రాష్ట్రపతి ఎన్నికలపై డీఎంకే చర్చ

ABN , First Publish Date - 2022-07-18T17:30:36+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా అనుసరించాల్సిన వ్యూహరచనపై చర్చలు జరిపే నిమిత్తం అధికార డీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆదివారం ఉదయం ఆపార్టీ ప్రధాన కార్యాలయం అన్నా

రాష్ట్రపతి ఎన్నికలపై డీఎంకే చర్చ

దురైమురుగన్‌ అధ్యక్షతన సమావేశం

చెన్నై/అడయార్‌: రాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా అనుసరించాల్సిన వ్యూహరచనపై చర్చలు జరిపే నిమిత్తం అధికార డీఎంకే శాసనసభ్యుల సమావేశం ఆదివారం ఉదయం ఆపార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ లేకుండానే  ఆదివారం ఉదయం 10.30 గంటలకు  ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేత, నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ అధ్యక్షత వహించారు. సహాయ ప్రధాన కార్యదర్శులు ఐ.పెరియస్వామి, పొన్ముడి, పార్టీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కేఎన్‌.నెహ్రూ, ప్రభుత్వ విప్‌ కోవి చెళియన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. సోమవారం జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై శాసనసభ్యులకు సీనియర్‌ నేతలు సూచనలు చేశారు. ఓటు వేసేటప్పుడు శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయంపై దురైమురుగన్‌ తదితరులు ఎమ్మెల్యేలకు వివరించారు. సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమయ్యే సమయంలో ఎమ్మెల్యేలంతా క్యూలైన్లలో నిలిచి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఆదేశించారు.  సుమారు గంటకు పైగా జరిగిన సమావేశం అనంతరం తర్వాత పార్టీ ప్రచార కార్యాదర్శి టీకేఎస్‌ ఇలంగోవన్‌ మీడియాతో మాట్లాడుతూ సోమవారం జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు


నేడు సీఎం స్టాలిన్‌ డిశ్చార్జి

 కరోనా సోకడంతో నగరంలోని కావేరి ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆయన సోమవారం డిశ్చార్జ్‌ చేయనున్నట్టు ఆస్పత్రి నిర్వాహకులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  కొవిడ్‌ సోకిన సీఎం స్టాలిన్‌ ఐసోలేషన్‌ ముగియడంతో ఆయన్ను డిశ్చార్జ్‌ చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం స్టాలిన్‌ కోలుకున్నప్పటికీ వారం రోజుల పాటు ఆయన ఇంటిలోనే పూర్తిగా విశ్రాంతీ తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.  

Updated Date - 2022-07-18T17:30:36+05:30 IST