Abn logo
Oct 13 2020 @ 00:09AM

మూలధన సబ్సిడీలు మేలు చేసేనా?

ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీరంగంలో కొత్త పెట్టుబడులు పెట్టేవారికి 50 నుంచి 75 శాతం మూలధన సబ్సిడీలు సమకూర్చే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక ప్రశంసనీయమైన ప్రయత్నమేననడంలో సందేహం లేదు కానీ, ఆ పథకం సత్ఫలితాల నివ్వగలుగుతుందా? పోషకాహారలోపంతో చనిపోతున్న వ్యక్తికి ఆక్సిజన్‌ ఇవ్వడం లాంటిదే ఈ పథకం కూడా. ఎలక్ట్రానిక్స్ పురోగతికి ప్రధాన అవరోధాలు మన విద్యావ్యవస్థ, ప్రభుత్వ నిబంధనలే కదా.


భారత్‌లో మొబైల్ ఫోన్ తయారీదారుల సంఖ్య గత ఐదేళ్ళలో 2 నుంచి 60 కి పెరిగిందని ఎలక్ట్రానిక్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. మన దేశంలో భారీ పెట్టు బడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్ రంగంలోని అగ్రగామి సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని, ఇప్పటికే అవి తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాయని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఇవి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్న పరిణామాలు అనడంలో సందేహం లేదు. 


2016 సంవత్సరంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటికే ప్రపంచ అగ్రగామి ఎలక్ట్రానిక్స్ సంస్థలు మన దేశంలో ఉన్నాయి. ఫాక్స్‌కాన్, లెనోవో తమ వస్తువులను ఉత్పత్తి చేయడానికి స్థానిక కంపెనీలకు కాంట్రాక్టుల నిచ్చాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్లో ఉన్న కంపెనీలు ఆ కాంట్రాక్టులను పొందాయి. శామ్‌సంగ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సొంత ఫ్యాక్టరీ ఉంది. మరి గత ఐదు సంవత్సరాలలో ఆ కంపెనీలు ఎందుకు విస్తరించలేదు? చెన్నైలో, లెనోవో అనుబంధ సంస్థ మోటారోలాకు సంబంధించిన ఫ్యాక్టరీ మూతపడిఉంది. లెనోవో కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే కాదు, మూతపడిన ఫ్యాక్టరీని ఇంతవరకు పునః ప్రారంభించలేదు. ఫాక్స్‌కాన్, లెనోవో తదితర కంపెనీలు మనదేశంలో 1700 కోట్ల డాలర్లను మదుపు చేయనున్నట్లు 2015లో ప్రభుత్వం ప్రకటన చేసింది కానీ, అలాంటిదేం జరగలేదు. 


భారత్‌లో తయారవుతున్న మొబైల్ ఫోన్లు వాస్తవానికి మేళన రేఖ (అసెంబ్లీ లైన్) తుది దశ ప్రక్రియ మాత్రమేనని అసోఛామ్ నివేదిక ఒకటి వెల్లడించింది. ఒక గృహిణి మార్కెట్ నుంచి పిండి, పప్పులు, కూరగాయలు తీసుకువచ్చి భోజనాన్ని సిద్ధం చేసినట్టుగానే మన ఉత్పత్తిదారులు విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వాటికి ఒక తయారయిన వస్తువుగా తుదిరూపు నిస్తున్నారు! ఇలా విడిభాగాల సమ్మేళనం వాస్తవ ‘తయారీ’ ఎలా అవుతుంది? మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాల లక్ష్యం స్వావలంబన అనేది మనం మరచిపోకూడదు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారులు దిగుమతి అయిన విడిభాగాల మీదనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇదొక కఠోర వాస్తవం. 2018-–19 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోకి 5500 కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ పరికరాలు దిగుమతి కాగా కేవలం 900 కోట్ల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి కావడం ఆ కఠోర వాస్తవానికి ఒక తిరుగులేని నిదర్శనం. మరింత స్పష్టంగా, నిష్ఠూరంగా చెప్పాలంటే 2015 నుంచి మన ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల రంగంలో ఎటువంటి పురోగతి లేదు. 


మనదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో పురోగతి ఎందుకు మందకొడిగా ఉంది? ఈ అంశంపై నిశిత విశ్లేషణ చేసిన ఎనిమిది వ్యాసాలను నేను ఇంటర్నెట్‌లో చదివాను. వాటిలో ఆరు వ్యాసాలు నిపుణ శ్రామికులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొన్నాయి. మన ఇంజనీరింగ్ కళాశాలలు తమ విద్యార్థులను ఒక ఇంటెల్ చిప్ లోని నలభై భాగాలు పని చేసే తీరుతెన్నుల గురించి నేర్చుకోమని అడుగుతాయని ఒక వ్యాసం పేర్కొంది. వాస్తవానికి ఆ నలభై భాగాల ప్రకార్యాలను విద్యార్థి కంఠస్థం చేయాలి. ‘ఒక విద్యార్థి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మరమ్మత్తు నిపుణుడుగా రూపొందినప్పటికీ రకరకాల చిప్‌లలోని వివిధ భాగాలు నిర్వర్తించే పనులను గుర్తుపెట్టుకోవల్సిన అవసరం లేదు. ఆ వివిధ భాగాల పనులు ఏమిటో నేర్చుకోమనడానికి బదులు ఒక పరికరాన్ని తయారుచేసేందుకు ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్‌ను ఎలా ఉపయోగిస్తావో చూపమని అడగడం విద్యార్థిలో సృజనాత్మక ప్రతిభను వంద రెట్లు పెంపొందించడమవుతుంద’ని ఆ వ్యాసకర్త పేర్కొన్నారు. మన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లోని ఫ్రొఫెసర్లలో అత్యధికులు చిప్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలియని వారే. చిప్స్ ఎలా పనిచేస్తాయో నేర్చుకోవల్సిన అవసరం వారికేముంది? పాఠాలు చెప్పినా చెప్పక పోయినా నెల తిరగగానే వేతనాలు చేతికొస్తున్నప్పుడు వారెందుకు అదనంగా శ్రమపడతారు? 


ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీరంగంలో కొత్త పెట్టుబడులు పెట్టేవారికి 50 నుంచి 75 శాతం మూలధన సబ్సిడీలు సమకూర్చే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక ప్రశంసనీయమైన ప్రయత్నమేననడంలో సందేహం లేదు కానీ, ఆ పథకం సత్ఫలితాల నివ్వగలుగుతుందా? పోషకాహారలోపంతో చనిపోతున్న వ్యక్తికి ఆక్సిజన్‌ ఇవ్వడం లాంటిదే ఈ పథకం కూడా. ఎలక్ట్రానిక్స్ పురోగతికి ప్రధాన అవరోధాలు మన విద్యావ్యవస్థ, ప్రభుత్వ నిబంధనలే కదా. ఈ సమస్యలను పరిష్కరించనంతవరకు కొత్త పెట్టుబడులు రావు గాక రావు. 2016లో ‘మేక్ ఇన్ ఇండియా’ పథకాన్ని ప్రారంభించినప్పుడు వచ్చాయా? ఇప్పుడూ అదే కథ పునరావృతమవుతుంది. అసలు సమస్యలను పరిష్కరించకుండా మూలధన సబ్సిడీలు ఎంతగా ఇచ్చినా ఫలితం ఉండబోదు. వీటి పంపిణీ మన ప్రభుత్వాధికారుల అక్రమార్జనకు మరిన్ని అవకాశాలను కల్పించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ సబ్సిడీలనివ్వడానికి బదులుగా ఆర్థికవ్యవస్థను పీడిస్తున్న మౌలిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లోని ఆచరణాత్మక పరిజ్ఞానం లేని ఆచార్యులు, అధ్యాపకులను ఇంటికి పంపించాలి. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని అరికట్టాలి. సామాజిక అసమానతలను రూపుమాపాలి. వివిధ అంశాలపై ప్రతిపక్షాలతో నిర్మాణాత్మక చర్చలు జరపాలి. పర్యావరణ పరిస్థితులను మెరుగుపరచాలి. ముఖ్యంగా నీటి, వాయు కాలుష్యాన్ని నిరోధించి తీరాలి. ఆనందప్రదమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను సమకూర్చినప్పుడు మాత్రమే విదేశీ పెట్టుబడులైనా, దేశీయ మదుపులైనా సమృద్ధిగా వస్తాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం మూలధన సబ్సిడీలు సమకూర్చడం వంటి ప్రతిపాదనల వల్ల ఎలాంటి ప్రయోజనముండబోదు. పెట్టుబడుల వెల్లువ పగటి కలగా మాత్రమే మిగిలిపోతుంది.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...