Abn logo
Mar 25 2021 @ 00:50AM

పట్టభద్రులయితే మాత్రం కొమ్ములుంటాయా?

ఆయనెవరో కేరళలో బిజెపి నాయకుడట, చదువుకున్న వాళ్లు ఎక్కువైనందువల్లనే రాష్ట్రంలో తమ పార్టీ బలం పుంజుకోవడం లేదని బాధ పడుతున్నాడు. చదువుకున్నవాళ్లు చెప్పినమాటకు తలూపకుండా మొండి వాదనలు చేస్తారని కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. కేరళ రాష్ట్రంలో చదువుకున్నవారి శాతం దేశంలోనే ఎక్కువ అని తెలిసిందే. ఆ రాష్ట్ర ప్రజల జీవనవిధానానికి, సామరస్య జీవనానికి, సాంస్కృతిక ప్రత్యేకతలకి, రాజకీయ ప్రాధాన్యాలకు అక్షరాస్యతా చదువూ కారణాలని పదే పదే వింటూ ఉంటాము. ఇటువంటి నిర్ధారణలు నోటి మాటగా చేసేవే తప్ప, నిరూపణకు నిలుస్తాయా అన్నది సందేహమే.


కేరళ విషయం అనే కాదు, దేశంలోనే కాస్త సంఘసంస్కారం, ఆధునిక విలువలు, విద్యా విస్తరణ ఉన్న ప్రాంతాలలో ప్రజలు భిన్నంగా ఉంటారని, బిజెపిని ఆదరించరని, బెంగాల్లో కానీ, దక్షిణాదిలో కానీ ఆ పార్టీకి చెల్లుబాటు తక్కువని చెబుతుంటారు. ఈ బడాయి పరిశీలనలకు చెలామణీ తగ్గిపోతున్నది. కేరళలో ఈసారి కాకపోతే మరోసారి, కాంగ్రెస్ ఆ కాస్తా ఆరిపోతే, లెఫ్ట్ ఫ్రంట్‌కు ప్రత్యామ్నాయం ఎన్డీఏ నో ఎన్డీఎఫ్ఫో నో అవుతుంది. వంతులవారీగా అధికారం పంచుకుంటుంది. బెంగాల్ విషయం చూస్తూనే ఉన్నాము. చాకచక్యమో అంకగణితమో అంగబలమో అధికారపార్టీని అంతిమంగా గట్టెక్కించగలవేమో కానీ, ప్రమాదం అయితే ముంచుకువచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఏ ముఖద్వారం గుండా దేశంలోకి వచ్చి, పరాధీనతతో పాటు, సామాజిక, సాంస్కృతిక మథనానికి కూడా ఆస్కారం కలిగించిందో, ఆ దారి మీదే ఒక ప్రతీఘాత వాదం కాచుకుని ఉన్నది. రెండున్నరవందలేళ్ల చరిత్రకు జాతీయ ‘ప్రక్షాళన’ అనివార్యమనిపిస్తున్నది. ఇక ఎక్కడ మాత్రం, అభ్యుదయం, విప్లవం, సమానత్వం, సామాజిక న్యాయం పైచేయిగా వర్థిల్లుతున్నాయని? రాటు తేలిన కరుడుగట్టిన తమిళులేం చేస్తున్నారు? గుడిగోపురాల పునరుద్ధరణ, తీర్థయాత్రల వితరణ ఎన్నికల వాగ్దానాలయ్యాక, ఏ పార్టీ గెలిచిందన్నది స్వయంసేవకులకు ఎందుకు? పురోగామి ప్రాంతాలలో ప్రజలు చీకటిని వ్యతిరేకించారు. వెలుతురును ప్రేమించారు. గోడలను ఛేదించారు. ఐక్యతలను నిర్మించారు. అక్షరాలలో ఆదర్శాలను ఉద్దీపింపచేశారు. ఉద్యమాలను ఉద్వేగాలలో, చరిత్రలో, అవగాహనలో నిలుపుకున్నారు. మరి ఎందుకు, కట్టుబాటు సడలిపోతున్నది? అవగాహన శిథిలమవుతున్నది? చదువులు, చదువులతో పాటు ఆచరణల అనుభవం కలిగిన తరతరాల వివేకం ఎక్కడ పలచబడిపోతున్నది? అసలు చదువుకి, చదువుకున్నవారికి మనం ఎక్కువ విలువ కట్టామా? సంస్కారం చదువులలో స్థిరపడలేదా? విచక్షణ అలవరిచే గుణం చదువులకు లేకుండా పోయిందా? ఒకసారి వేసిన ముందడుగు అట్లాగే నిలబడాలంటే, మరో ముందడుగుకు అవకాశమివ్వాలంటే ఏమి జరగాలి? 


చదువుకున్నవాళ్లకి, చదువులేని వాళ్లకీ సమానంగా ఓటుహక్కు ఉండడం గురించి బాధపడేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. గ్రామీణులు, ఎప్పుడూ బాధితులుగానో, ఏవో సహాయాలు ఆశించేవారిగానో ఉండే పేదలు- వీరు ఓటును అమ్ముకుంటారని, లేదా అమాయకంగా నేతలను గుడ్డిగా నమ్ముతారని అనుకోవడం మధ్యతరగతికి, పట్టణ విద్యాధిక శ్రేణికి అలవాటు. అందుకు తగ్గట్టుగానే, అధికారంలో ఉన్న పార్టీపై ఉన్న అసమ్మతి కొద్దోగొప్పో పట్టణ ప్రాంతాల ఎన్నికలలో వ్యక్తం కావడం జరిగేది. మెజారిటీ నిరక్షరాస్య, నిరుపేద ఓటర్లున్న దేశంలో మందబలపు ప్రజాస్వామ్యంలో తాము విశిష్ట అల్పసంఖ్యాకులమన్న నిష్ఠూరపు అతిశయం చదువుకున్నవారిలో, నాగరికులలో కనిపించేది. పల్లెలు పట్నాలు అని లేకుండా దేశమంతా చుట్టబెడుతూ రాజసూయం చేస్తున్న భారతీయ జనతాపార్టీని ఒకప్పుడు పట్టణ పార్టీ అని, వర్తకుల పార్టీ అని భావించేవారు. విశాల ప్రజానీకాన్ని మైమరిపించే ఒక జాతీయరసాయనాన్ని తయారుచేసిన తరువాత, ఆ పార్టీకి ఇక ఎల్లలు లేకుండా పోయాయి. 


తాజాగా తెలంగాణలో చదువుకున్న వాళ్లు చర్చలోకి వచ్చారు. చేయవలసిందంతా చేసి, తనను తానే దెప్పిపొడుచుకోవడం తెలంగాణ సమాజానికి కూడా అలవాటవుతున్నట్టుంది. శాసనమండలికి రెండు పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి జరిగిన ఎన్నికల విషయంలో, ఫలితాలు ఎట్లా వస్తే తెలంగాణ సమాజపు ప్రతిష్ఠకు అనుగుణంగా ఉండేవో అందరికీ తెలుసు. కానీ, బ్యాలట్ పెట్టె దగ్గర ఎవరి ప్రాధాన్యాలు వారివి. ఫలితాలు వచ్చాక, విద్యావంతులను, పట్టభద్రులను వెక్కిరించుకుంటూ వ్యాఖ్యలు. పట్టభద్రులు కావడంతో తలకెక్కే కిరీటం ఏమీ లేదు కదా? మహా అయితే, ఉద్యోగి లేదా నిరుద్యోగి. కానీ విద్యావంతులు కావడం వల్ల వారి మీద గొప్ప బాధ్యత ఉన్నదన్న అభిప్రాయం ఉంటుంది. అధికారపక్షాన్ని ఓడించడం మాత్రమే కాదు, ఒక గౌరవప్రదమైన ఎంపిక చేసి తమ స్థాయిని ప్రకటించుకోవలసిన అగత్యం పట్టభద్ర ఓటర్ల మీద ఉన్నదని ఇతరులు భావించారేమో కానీ, పట్టభద్రులు భావించినట్టు లేరు. ప్రత్యేక ఉద్యమంలో ఒక కీలకపాత్ర పోషించిన కోదండరామ్‌ను, తొంభైమందిలో ఒక్కగానొక్క శాసనమండలి సభ్యుడిగా కూడా గెలిపించుకోనక్కరలేదని తెలంగాణ రాష్ట్ర సమాజం, అందులోనూ తన గురించి తాను గొప్పలు చెప్పుకునే విద్యాధిక సమాజం భావించినప్పుడు, ఇక దానిపై ఏ చర్చ జరిపి కూడా ఉపయోగం లేదు. సాధారణంగా ఓటర్ల మెప్పు పొందవలసిన బాధ్యత అభ్యర్థిదే. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే ఫలానా అభ్యర్థిని గెలిపించుకోవలసిన భారం ఓటర్ల మీద పడుతుంది. ఆ పరీక్షలో తెలంగాణ ఓడిపోయింది. ఇది శాసనసభ ఎన్నిక అయినా, మరే రకం ఓటర్ల నియోజకవర్గం అయినా సరే ఫలితం ఇట్లాగే ఉండేది. చిన్న ఎన్నిక కూడా గెలవలేడని కెసిఆర్ అన్నారంటే, అది వాస్తవం అయి ఉండాలి. ఇటువంటి ఎన్నికలను కోదండరామ్, మల్లన్న, చెరుకుసుధాకర్, రాణిరుద్రమ.. వీళ్లెవరూ గెలవలేరు. ఆ అశక్తత వెనుక ఉన్న విలువలేమిటో కెసిఆర్‌కు తెలియనివి కాదు. ‍


ఇక నుంచి తామేదో పెద్ద మేధావులమని, ఆలోచనాపరులమని చెప్పుకోవడం తెలంగాణ విద్యావంతులు మానుకోవాలి. ఇతరులూ వారిని అట్లా పరిగణించనవసరం లేదు. వారూ మామూలు మనుషులే. చదువులు ఉన్నాయి కానీ, అది అనివార్యంగా విచక్షణకు దారితీయాలని లేదు కదా? ఓడిపోయినవారందరి లెక్కలు తీసి, గెలిచిన అభ్యర్థి కంటె ఎక్కువే ఉన్నాయి కదా అని అల్పసంతోషం తెచ్చుకుని సంతృప్తి చెందనక్కరలేదు. ప్రభుత్వ వ్యతిరేకత చూపగలిగిన అభ్యర్థులందరూ ఓడిపోయారు. వారిని ఓటర్లు ఓడించారు. ప్రశ్నించగలిగే ప్రతినిధులు వారికి అక్కరలేదు. హైదరాబాద్ లోనూ అదే జరిగింది. నాగేశ్వర్ కాకపోతే, రెండో స్థానం దాకా వచ్చిన రాంచంద్రరావునే గెలిపించి ఉండాలి. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేవాడు. కనీసం ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఇక్కడ బోనులో ఉన్నది ఓటర్ల విచక్షణే తప్ప ఇందులో గెలిచినవారి తప్పేమీ లేదు. ఇక, నల్లగొండ-వరంగల్‌లో తీన్మార్ మల్లన రెండో స్థానంలోకి రాగలగడం వెనుక ఆయన శక్తిసామర్థ్యాలు, ఇతర నేపథ్య కారణాలు ఏమేమి పనిచేశాయో సమీక్షించుకోవలసిందే. ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఆయన తీవ్రస్వరం ప్రజలను ఆకట్టుకుంటున్నదని అంటున్నారు. కానీ, నిజంగా, తెలంగాణ సమాజం ప్రభుత్వంపై తీవ్ర విమర్శను కోరుకుంటున్నదా? విమర్శకులను ఆదరిస్తున్నదా? 


ప్రజాప్రతినిధిగా చట్టసభకు పంపడానికి ఓటర్లకు వేరే లెక్కలు ఉంటాయి కానీ, ప్రజల తరఫున మాట్లాడడానికి కోదండరామ్ అండ్ బృందానికి ఎప్పుడూ అవకాశం ప్రజలు ఇస్తూనే ఉంటారు. ఆయన ఆ బాధ్యతలోనే రాణిస్తారు. అందులోనే ఎక్కువ గౌరవం పొందుతారు. అదే ఆయన వంటి వారికి పదవి. ఒకసారి ప్రజలు పెద్దమార్పు తెచ్చుకుంటారు. దానితో ప్రజల భావాలలో కూడా మార్పులువస్తాయి. కానీ, ఆ మార్పుని, భావాలని అదే స్థాయిలో నిర్వహించకపోతే, అవి పాతపడిపోతాయి. బుద్ధి బూజుపట్టిపోయి, వెనకడుగులు వేస్తాము. తెలంగాణ ఉద్యమం గొప్పదే. ఎంతో చైతన్యంతో ఐకమత్యంతో చేసిందే. కానీ, వాటిని నిలుపుకోలేకపోతే, విచ్ఛిన్నతే ఎదురయింది. ఇంకా ఇంకా నిలవనీరుగా మిగిలిపోతే, ప్రత్యేకతెలంగాణ ఉద్యమం నుంచే కాదు, తెలంగాణరైతాంగ పోరాటం వంటి చరిత్ర నుంచి కూడా వెనుకకు వెనుకకు నడవవలసి వస్తుంది.

కె. శ్రీనివాస్