నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-12-01T05:17:15+05:30 IST

జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నిరంజన్‌బాబురెడ్డి కోరారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
మాట్లాడుతున్న నిరంజన్‌బాబురెడ్డి పక్కనే ఎమ్మెల్యే ఆనం, కలెక్టర్‌, జేసీలు

వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నిరంజన్‌బాబురెడ్డి

నెల్లూరు, (వ్యవసాయం), నవంబరు 30 : జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ నిరంజన్‌బాబురెడ్డి కోరారు. కలెక్టరేట్‌లోని తిక్కనప్రాంగణంలో మంగళవారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ శాశ్వత ప్రాతిపదికన పొర్లుకట్టల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గత సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా కొందరికి రావాల్సిన బిల్లులు త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని   కోరారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ వరద బాధిత రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.  2020-21లో పండించిన ధాన్యానికి మద్దతు కల్పించేందుకు 164 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 4.37లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలోని 680 ఆర్‌బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామన్నారు. సమావేశంలో జేసీ హరేందిరప్రసాద్‌, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖల జేడీలు వై.ఆనందకుమారి, బి.మహేశ్వరుడు, నాగేశ్వరరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయకుమార్‌రెడ్డి, ఎల్‌డీఎం రాంప్రసాద్‌రెడ్డి, ఉద్యానశాఖ ఏడీ ప్రదీప్‌, మార్కెటింగ్‌శాఖ ఏడీ రామమ్మ, డీఆర్‌సీ, వ్యవసాయశాఖ డీడీలు శివన్నారాయణ, ప్రసాద్‌, ఏడీలు అనిత, ధనుంజయరెడ్డి, నర్సోజి, సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.

అన్నదాత దగా : ఎమ్మెల్యే ఆనం

 కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడంలో అన్నదాత దగా పడుతున్నాడని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా న్యాయం జరగడం లేదన్నారు. తేమశాతం పేరుతో మిల్లర్లు వందల కేజీలు అధికంగా తీసుకుంటున్నారన్నారు. ధాన్యం బస్తాలను రెండు మూడు రోజులు లారీల్లోనే ఉంచి రైతన్నకు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-01T05:17:15+05:30 IST