నిమజ్జన ప్రదేశానికి ప్రజలను అనుమతించొద్దు

ABN , First Publish Date - 2021-09-19T05:29:04+05:30 IST

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా మున్నేటికి ప్రజలను అనుమతించవద్దని, కేవలం నిర్ధేశించిన ప్రదేశానికి మాత్రమే శోభా యాత్రతో రావాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, పోలీస్‌ కమీషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదేశించారు.

నిమజ్జన ప్రదేశానికి ప్రజలను అనుమతించొద్దు
మున్నేరు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, సీపీ విష్ణు వారియర్‌

ఖమ్మం కలెక్టరేట్‌, సెప్టెంబరు 18: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా మున్నేటికి ప్రజలను అనుమతించవద్దని, కేవలం నిర్ధేశించిన ప్రదేశానికి మాత్రమే శోభా యాత్రతో రావాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, పోలీస్‌ కమీషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదేశించారు. ఆదివారం నిర్వహించ యనున్న గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను మున్నేటి వద్ద శనివారం వారు పరిశీలించారు. మునిసిపల్‌, రెవెన్యూ పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యుత్‌ దీపాలు, రోడ్లు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.  ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాల న్నారు. మున్నేరు వద్ద గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతో పాటు అక్కడ అన్ని రక్షణ చర్యలు తీసుకో వాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గట్టి బందోబస్తును ఏర్పాట్లు చే యాలని సూచించారు.  వినాయక నిమజ్జన ప్రాంతాల్లో 9 భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్‌ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు.  రాత్రివేళలో ఇబ్బంది పడకుండా ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుతో పాటు, సీసీ కెమేరాలు సైతం  ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్‌ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, అడిషన్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, ఏసీపీలు రామోజీ రమేష్‌, ఆంజనేయులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

వైరా, సెప్టెంబరు18: వైరాలో ఆదివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మండల ప్రత్యేక అధికారి కస్తాల సత్యనారాయణ శనివారం పరిశీలించారు. సోమవరం నల్లచెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సందర్శించి పరిశీలించారు. గణేష్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటుచేసిన క్రేన్‌ను పరిశీలించారు. తహసీల్దార్‌ హళావత్‌ రంగా, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకటస్వామితో ఏర్పాట్ల గురించి సమీక్షించారు. ఉత్సవ కమిటీలు సహకరించాలని సూచించారు. 

భక్తులు సహకరించాలి: ట్రాఫిక్‌ సీఐ అంజలి

ఖమ్మంక్రైం, సెప్టెంబరు18: గణేష్‌ విగ్రహాల నిమజ్జనం సజావుగా జరుపుకునే విధంగా ప్రజలు సహకరించాలని ట్రాఫిక్‌ సీఐ అంజలి ఒక ప్రకటనలో శనివారం సూచించారు. నగరంలో నిరవ్హఇంచే గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఎవరు కూడా మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని సూచించారు. అన్ని ప్రాంతాలలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని తెలిపారు. శోభాయాత్రలోనే పాల్గొనే వాహనాల డ్రైవర్లు మద్యం, మత్తుపానరీయాలు సేవించ వద్దని నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితలలో ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిబంధనలు పాటించి మాస్కులు ధరించాలని సూచించారు.

గణేష్‌ నిమజ్జనోత్సవాలపై ఏసీపీ సమీక్ష

వైరా/మధిర రూరల్‌, సెప్టెంబరు 18:  వైరా పోలీస్‌ సర్కిల్‌ పరిధిలోని వైరా, కొణిజర్ల, చింతకాని, తల్లాడ మండల కేంద్రాల్లో గణేష్‌ నిమజ్జన ఉత్సవాలను శాంతియుతంగా జరపాలని ఏసీపీ స్నేహా మెహ్రా కోరారు. శనివారం ఎన్‌వీఎస్‌ గార్డెన్‌లో నిమజ్జన ఏర్పాట్లపై పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు, గజ ఈతగాళ్లతో సమావేశాన్ని నిర్వహించారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, మద్యం సేవించి నిమజ్జనాల్లో పాల్గొనకుండా చూడాలన్నారు. ప్రతి నిమజ్జన కేంద్రం వద్ద భారీ గేట్లు, లైటింగ్‌ ఏర్పాటుచేయాలని కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో వైరా సీఐ జె.వసంతకుమార్‌, ఎస్‌ఐలు వి.సురేష్‌,రవి, నరేష్‌, లవణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గణేష్‌ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై వైరా ఏసీపీ స్నేహా మెహ్రా సమీక్ష నిర్వహించారు. శనివారం స్థానిక రిక్రీయేషన్‌క్లబ్‌ కల్యాణ మండపంలో మధిర సర్కిల్‌ పరిధిలోని ఎస్‌హెచ్‌వోలు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వలంటీర్లతో ఏసీపీ ఈ సమావేశాన్ని నిర్వహించారు. విగ్రహం వెంట మండపాల బాధ్యులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. డీజే ఉపయోగించకుండా ప్రశాంత వాతావరణంలో ఊరేగింపు నిర్వహించి విగ్రహాలను నిమజ్జనాలకు తరలించాలన్నారు. నిమజ్జనం నిర్వహించే మధిరలోని వైరానది, చెరువు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీఐ మురళీ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:29:04+05:30 IST