Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్‌పై భయం వద్దు

  • దానివల్ల ఒక్కరూ చనిపోలేదు
  • కొత్త వేరియంట్‌ తీవ్రతపై వారంలోగా స్పష్టత
  • ఇప్పుడున్న వ్యాక్సిన్లూ దానిపై పనిచేస్తాయి
  • ఫైజర్‌ మాత్రలు కూడా ప్రభావవంతమే 
  • ఎంవీవీటీ ఫార్ములాతో కరోనా కట్టడి
  • ప్రఖ్యాత వైద్యుడు డి.నాగేశ్వర్‌రెడ్డి వెల్లడి
  • ఈశ్వరీబాయి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసిన గవర్నర్‌


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌కు సంబంధించి ప్రఖ్యాత వైద్యుడు, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత, ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి కీలక అంశాలను వెల్లడించారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. అది ఆరింతలు ఎక్కువ ఇన్ఫెక్షన్‌ను కలిగించగలదని హెచ్చరించారు. అయినా ఒమైక్రాన్‌ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటివరకు ఆ వేరియంట్‌ సోకిన వాళ్లలో ఒక్కరు కూడా మరణించినట్టు కానీ.. తీవ్ర ఆరోగ్య సమస్యలకు లోనైనట్లు కానీ వెల్లడి కాకపోవడాన్ని సానుకూల అంశంగా అభివర్ణించారు.


తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈశ్వరీ బాయి స్మారక పురస్కారాన్ని గవర్నర్‌ తమిళిసై చేతులమీదుగా డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న కొవిడ్‌ టీకాలు ఒమైక్రాన్‌పై పనిచేయవనే అశాస్త్రీయ ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఈ అంశంపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని, వారం రోజుల్లోగా ఫలితాలు తెలుస్తాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పైనా పనిచేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫైజర్‌ కంపెనీ నుంచి మాత్రల రూపంలో కొత్త కొవిడ్‌ మందులు రానున్నాయని, అవి 90 శాతం వైరల్‌ ఇన్ఫెక్షన్‌ను తగ్గించగలవని చెప్పారు. ఒమైక్రాన్‌పై కూడా ఫైజర్‌ మాత్రలు పనిచేస్తాయని ఆయన వివరించారు. ఒమైక్రాన్‌ సోకిన వారిలో గొంతునొప్పి, కండరాల నొప్పి, కాస్తంత అలసట వంటి లక్షణాలు మినహా ఇతర ఆరోగ్య సమస్యలు పెద్దగా తలెత్తడం లేదని తెలుస్తోందన్నారు. ఎంవీవీటీ (మాస్క్‌, వ్యాక్సినేషన్‌, వెంటిలేషన్‌, టెస్ట్‌) ఫార్ములాను ప్రతి ఒక్కరూ పాటిస్తే కరోనాను కట్టడి చేయొచ్చని డి.నాగేశ్వర్‌రెడ్డి  తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవడంతో పాటు మరో నాలుగు నెలల వరకు మాస్కును తప్పనిసరిగా ధరించాలని సూచించారు. 


రోగులు చనిపోతుంటే చూసి చలించిపోయా.. 

‘‘కరోనా రెండో దశలో ఒక్కో కుటుంబంలో నలుగురు, ఐదుగురు చనిపోతుంటే చూసి చలించిపోయాం. ఒక్కోసారి అయితే.. తల్లిదండ్రులిద్దరూ కరోనాతో చనిపోతే చిన్నపిల్లలు ఒంటరిగా మిగిలిపోయిన కుటుంబాలనూ చూశాం. నా నలభై ఏళ్ల వైద్యవృత్తిలో ఎన్నడూ రోగులు ఇంతగా బాధపడటాన్ని చూడలేదు. ఇలా భారీగా సంభవించిన మరణాలను చూసి వైద్యులమంతా కలతచెందాం. ఆ బాధ మమ్మల్ని ఇంకా వెంటాడుతోంది. గత రెండేళ్లలో కరోనాతో దాదాపు 2వేల మంది వైద్యులు చనిపోయారు. మా ఆస్పత్రిలో రోగులకు కరోనా చికిత్స అందించిన వైద్యుల్లో  దాదాపు 60 శాతం మంది కొవిడ్‌ బారినపడ్డారు. ఒక విధంగా వైద్యులంతా ఆయుధాలు లేని సైనికుల్లా కరోనా మీద పోరాడారు’’ అని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి  పేర్కొన్నారు. 


నాగేశ్వర్‌రెడ్డి సేవలను కొనియాడిన గవర్నర్‌ 

ఈ కార్యక్రమంలో ఈశ్వరీబాయి స్మారక అవార్డు గ్రహీత డా.నాగేశ్వర్‌రెడ్డి వైద్యసేవలను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ కొనియాడారు. తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు గీతారెడ్డి మంత్రిగా పనిచేసినప్పటికీ, ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈశ్వరీబాయి సేవలను ఎన్నడూ స్మరించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడ్డాకే, ఈశ్వరీ బాయి జయంతిని ఏటా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది’’ అన్నారు. ఈశ్వరీబాయి డాక్యుమెంటరీని కూడా అధికారికంగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ రమణాచారి సభాధ్యక్షత వహించగా, మాజీ మంత్రి, ఈశ్వరీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు డా. గీతారెడ్డి, డా. రామచంద్రారెడ్డి, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టరు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement