అనవసరంగా విద్యుత్‌ కొనడం లేదు

ABN , First Publish Date - 2021-01-21T06:07:33+05:30 IST

నిబంధనలను అతిక్రమించి ఎక్కడా అనవసరంగా విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదని ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి ప్రకటించారు.

అనవసరంగా విద్యుత్‌ కొనడం లేదు
ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి

వ్యవసాయ విద్యుత్‌ మీటర్లకు 60 శాతం దరఖాస్తులు

ముగింపు సదస్సులో ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి

సెక్యూరిటీ డిపాజిట్‌గా 3 నెలల బిల్లు


విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): నిబంధనలను అతిక్రమించి ఎక్కడా అనవసరంగా విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదని ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి ప్రకటించారు. 20212-22 విద్యుత్‌ టారిఫ్‌లపై ప్రజలు వ్యక్తంచేసిన అభ్యంతరాలకు ఆమె బుధవారం ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ సమక్షంలో వివరణ ఇచ్చారు. మార్కెట్‌లో మిగులు విద్యుత్‌ వున్నప్పుడు ఎక్కువ ధర పెట్టి కొంటున్నారని, కొన్ని సంస్థలతో ఒప్పందాలు లేకున్నా విద్యుత్‌ తీసుకుంటున్నారని, మరికొన్నింటికి ఎక్కువ రేటు ఇస్తున్నారంటూ అనేక మంది అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ఆమె సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రజలు, వినియోగదారులు ఆ విధంగా భావించడంలో తప్పు లేదని, అయితే నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని, నష్టం వచ్చేలా వ్యవహరించడం లేదని వివరించారు. వ్యవసాయ విద్యుత్‌ మీటర్లు వద్దని చాలామంది కోరుతున్నారని, అయితే...వాటి వల్ల అటు రైతులతో పాటు ఇటు డిస్కమ్‌లకు ప్రయోజనం ఉంటుందన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించడంతో ఇప్పటివరకు 60 శాతం మంది రైతులు మీటర్లు కావాలని దరఖాస్తులు ఇచ్చారని పేర్కొన్నారు. కొందరికి ఎక్కువ, మరికొందరికి తక్కువ విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని, గత ఐదేళ్ల వినియోగం అంచనా వేసి ఇస్తున్నామని పేర్కొన్నారు. సోలార్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌లపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని కొందరు సూచించారని, ప్రస్తుతం ఆ విషయం కోర్టులో వున్నందున మాట్లాడలేమని చెప్పారు. 


ఎస్‌పీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌ అధికారులు ఏమి చెప్పారంటే...?


- ఫెర్రో ఎల్లాయిస్‌ కంపెనీలకు ఇంకా టారిఫ్‌లు తగ్గించమన్నారని, ఓపెన్‌ యాక్సిస్‌లో విద్యుత్‌ కొనుగోలు చేసుకునే అవకాశం కోరారని, రాయితీలు పొందుతున్న వారికి అటువంటి వెసులుబాటు లభించదని స్పష్టంచేశారు.

- వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగించే రైతులకు ఏ రకమైన పరికరాలు అవసరమైనా సంస్థలే అందిస్తాయని, వాటికి ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. అంతకుమించి ఏమైనా అడిగితే 1912కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

- పుట్టగొడుగుల పెంపకాన్ని వ్యవసాయ విభాగంలో చేర్చాలని చాలామంది కోరారని, కానీ అది హెచ్‌టీ-1 విభాగంలోనే కొనసాగుతుందని స్పష్టంచేశారు.

- కరోనా సమయానికి సంబంధించి ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు కొంత వెసులుబాటు కల్పించిందని, ఆ ఫలితాలు తప్పకుండా వారికి అందుతాయన్నారు.

- చేపలు, రొయ్యల చెరువులకు అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తున్నారని, వాటిపై తనిఖీలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. గత ఏడాది కాలంలో 355 కేసుల ద్వారా రూ.74.41 లక్షలు జరిమానాగా వసూలు చేశామన్నారు.

- ఇప్పటివరకు సెక్యూరిటీ డిపాజిట్‌గా రెండు నెలల విద్యుత్‌ బిల్లును తీసుకుంటున్నామని, ఇది సరిపోవడం లేదని, దీనిని మూడు నెలలకు పెంచాలని సూచించారు. అద్దెకు ఉండేవారు వెళ్లిపోవడం వల్ల బిల్లు వివాదాలు, సెక్యూరిటీ డిపాజిట్‌ వివాదాలు వస్తున్నాయన్నారు. 


ప్రభుత్వం తరపున ఇంధన శాఖ అధికారి కుమార్‌ రెడ్డి నివేదికను సమర్పించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ ఉచితంగా ఇస్తారని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-21T06:07:33+05:30 IST