కమీషన్లు రావనే వ్యాక్సిన్‌ కొనడం లేదు

ABN , First Publish Date - 2021-05-07T09:36:19+05:30 IST

‘‘సీబీఐ కేసుల్లో జగన్‌రెడ్డి సహ నిందితునిగా ఉన్న హెటెరో... రష్యా కంపెనీ వ్యాక్సిన్‌ తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొంది

కమీషన్లు రావనే వ్యాక్సిన్‌ కొనడం లేదు

హెటెరో తయారు చేసేవరకూ నిధులివ్వరు

కొనుగోళ్లకు కేంద్రం అనుమతి లేదన్నది పచ్చి అబద్ధం

అంబులెన్సులను అరబిందో చేతిలో పెట్టి నాశనం చేశారు

ఏడాది కాలంలో ఆసుపత్రుల్లో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: టీడీపీ


అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘సీబీఐ కేసుల్లో జగన్‌రెడ్డి సహ నిందితునిగా ఉన్న హెటెరో... రష్యా కంపెనీ వ్యాక్సిన్‌ తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొంది. ఆ వ్యాక్సిన్‌ తయారయి వచ్చే వరకూ ఇతర కంపెనీల వ్యాక్సిన్లేవీ కొనకూడదని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని వింటున్నాం. తమ వారికి మేళ్లు చేసి కమీషన్లు దండుకోవడానికి ప్రజల ప్రాణాలతో ఆడుకొంటున్నారు. అందుకే వ్యాక్సిన్ల కొనుగోలుకు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇతర కంపెనీల వ్యాక్సిన్లు కొంటే కమీషన్లు రావనే వైసీపీ ప్రభుత్వం దానికి నిధుల కేటాయించడం లేదు. వ్యాక్సిన్లు కొనడానికి కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ మండిపడింది. వ్యాక్సిన్ల కొనుగోలుపై సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గురువారం స్పందించారు. ‘‘సొంతంగా కేవలం 13 లక్షల వ్యాక్సిన్లు కొనడానికి రూ.45 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై మేం ప్రశ్నించాం. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అంతా కేంద్రం పరిధిలో ఉందని, కొనుగోళ్లకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని సజ్జల పచ్చి అబద్ధాలు చెప్పారు. 


వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిలో సగం తమకు ఇచ్చి మిగిలిన సగం రాష్ట్రాలకు నేరుగా అమ్ముకోవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్‌ కొనుగోలులో తమ అసమర్థత బయట పడటంతో కేంద్రంపై నెపం నెట్ట తప్పించుకోవాలని చూస్తున్నారు’’ అని విమర్శించారు. ‘‘రాష్ట్రంలోని 108, 104 అంబులెన్సులు ఇప్పటికే విజయసాయి రెడ్డి వియ్యంకుడి కుటుంబానికి చెందిన అరబిందో సంస్థకు అప్పగించారు. అవి కరోనా కాలంలో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. స్వయంగా విజయసాయిరెడ్డి ఈ అంబులెన్సుల కాల్‌ సెంటర్‌లో కూర్చుని ఫోన్‌ చేస్తే 20 నిమిషాలకుగాని స్పందించలేదు’’ అని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభణను స్వయంగా చూసిన తర్వాత కూడా ఏడాది కాలంగా జగన్‌రెడ్డి రంగుల ప్రకటనలతో కాలం గడపడం తప్ప... ఆస్పత్రుల్లో వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. ఈ ఏడాదిలో ఏం వసతులు మెరుగుపర్చారో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని పట్టాభి డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-07T09:36:19+05:30 IST