రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

ABN , First Publish Date - 2021-05-14T05:34:03+05:30 IST

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
ఎదులాబాద్‌లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి

  •  మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ శ్వేతామహంతి
  •  ఘట్‌కేసర్‌ (రూరల్‌) మండలం ఎదులాబాద్‌లో  
  •  వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

ఘట్‌కేసర్‌ రూరల్‌ : వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని ఎదులాబాద్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఆందోళనలకు గురికావొద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తూకం, ధాన్యం బస్తాలు, రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. పంట దిగుబడి ఏలా ఉంది? టోకెన్ల పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయా? ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు ఎన్ని రోజుల్లో బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని డీసీఎస్వో, డీసీవోలకు సూచించారు.   

  • జ్వర సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి 

ఇంటింటి జ్వర సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. మండలంలోని ఎదులాబాద్‌లో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను ఆమె తనిఖీ చేశారు. గ్రామంలో జ్వర సర్వే ఎంత వరకు పూర్తిచేశారు? ఎంతమందికి పాజిటివ్‌ వచ్చింది? ఎన్ని కిట్లు పంపిణీ చేశారనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జ్వర సర్వేలో పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింహరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారులు, కో-అపరేటివ్‌ అధికారులు, ఎంపీడీవో అరుణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ అశ్విన్‌, సర్పంచ్‌ సురేష్‌, ఉపసర్పంచ్‌లు లింగేశ్వర్‌రావు, నరేష్‌, సింగిల్‌విండో డైరెక్టర్లు చందుపట్ల ధర్మారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, రైతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • రైతుల సంక్షేమానికి కృషి

శామీర్‌పేట : రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నామని టీఎ్‌ససీఏబీ చైర్మన్‌, అఖిల భారత కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ సమాఖ్య అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు అన్నారు. గురువారం ఆయన శామీర్‌పేట సొసైటీని సందర్శించి వరి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి వరి ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌, శామీర్‌పేట సొసైటీ చైర్మన్‌ మధుకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం చేయడం జరిగిందని రవీందర్‌రావు అన్నారు. కాగా రైతులు ధాన్యం అమ్మిన 24గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. సొసైటీ అభివృద్ధికి అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రమేష్‌, సొసైటీ సీఈవో నర్సింలు, సొసైటీ డైరెక్టర్‌ భూమిరెడ్డి, ఏఈవో రవి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T05:34:03+05:30 IST