జనరల్ రావత్ మరణంపై సంబరాలొద్దు : పాకిస్థాన్ ఆర్మీ మాజీ అధికారి

ABN , First Publish Date - 2021-12-12T17:07:35+05:30 IST

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్

జనరల్ రావత్ మరణంపై సంబరాలొద్దు : పాకిస్థాన్ ఆర్మీ మాజీ అధికారి

న్యూఢిల్లీ : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాయడం పట్ల పాకిస్థాన్ సైన్యంలో మాజీ అధికారి అదిల్ ఫరూఖ్  రజా సంతాపం తెలిపారు. భారతీయ యుద్ధ వీరుడు బ్రిగేడియర్ ఆర్ఎస్ పఠానియా పెట్టిన పోస్ట్‌పై రజా స్పందించారు. అనంతరం ఇరువురు ట్విటర్ వేదికగా సంభాషించుకున్నారు. 


‘‘శాల్యూట్ యూ సార్, జైహింద్’’ అని బ్రిగేడియర్ (రిటైర్డ్) ఆర్ఎస్ పఠానియా ట్వీట్ చేశారు. దీనిపై అదిల్ రజా స్పందించారు. 


‘‘సార్ దయచేసి నా హృదయపూర్వక సంతాపాన్ని అంగీకరించండి. పోరాటం, భద్రత, ప్రోటోకాల్, అడ్మినిస్ట్రేషన్/ట్రైనింగ్ అసైన్‌మెంట్లలో వైవిద్ధ్యభరితమైన అనుభవంగల సాయుధ దళాల అధికారి’’ అంటూ జనరల్ రావత్‌కు అదిల్ రజా నివాళులర్పించారు. 


దీనిపై పఠానియా స్పందిస్తూ, సైనికుడి కర్తవ్యం గురించి మాట్లాడారు. ‘‘ధన్యవాదాలు అదిల్, ఓ సైనికుడి నుంచి ఆశించేది ఇదే. శాల్యూట్’’ అని పేర్కొన్నారు. 


అదిల్ స్పందిస్తూ, ‘‘మీ శత్రువులు మరణిస్తే సంబరాలు చేసుకోకండి, ఎందుకంటే ఏదో ఓ రోజు మీ స్నేహితులు కూడా మరణిస్తారు’’ అనే పంజాబీ గీతాన్ని ప్రస్తావించారు. సైనికుడిగా పాటించవలసిన మంచి విషయం ఇదని తెలిపారు. మీకు జరిగిన నష్టానికి విచారిస్తున్నానని తెలిపారు. 


దీనిపై పఠానియా స్పందిస్తూ, మరోసారి ధన్యవాదాలు తెలిపారు. తనకు పంజాబీ భాష మాట్లాడటం వచ్చునని తెలిపారు. రణ క్షేత్రంలో మనం శత్రువులమని, అక్కడి నుంచి బయటికి వస్తే ఒకరితో మరొకరు స్నేహితులుగా కాకపోయినా, సామాన్యంగా ఉండాలని అన్నారు. 


తమిళనాడులోని ఓ మిలిటరీ కాలేజీకి వెళ్తుండగా జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక ప్రయాణించిన హెలికాప్టర్ బుధవారం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వీరిద్దరితో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2021-12-12T17:07:35+05:30 IST