Abn logo
Sep 22 2021 @ 23:36PM

వైసీపీలో వర్గపోరు!


 ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవుల కోసం తీవ్ర పోటీ

 మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

 కొన్ని మండలాల్లో రాజకీయ శిబిరాలు

 తమ అనుచరులు, సామాజికవర్గాలకు పెద్దపీట

 నేతల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మండల, జడ్పీ ప్రాదేశిక ఫలితాలు వచ్చాయి. జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, ఎంపీపీలు, మండల ఉపాధ్యక్షుల ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. శుక్రవారం ఎంపీపీ, ఉపాధ్యక్షలు, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. 25న జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, కోఆప్షన్ల ఎంపిక జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. ఒకవైపు సహచర ఎంపీటీసీల సాయం కోరుతూనే... జిల్లా స్థాయి కీలక నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో 37 మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికలు జరుగగా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. కవిటి నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన పిరియా విజయకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఇద్దరు వైస్‌ చైర్మన్లు తెరపైకి రావడంతో ఆ పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాల్లో మునిగి తెలుతున్నారు. కీలక నేతలను కలుస్తూ తమకు ఒక అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 

అమాత్యుల నియోజకవర్గాల్లో..

ఎంపీపీలు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక మాత్రం అధికార పార్టీ కీలక నేతలకు కత్తిమీద సా ములా మారింది. కొన్ని మండలాల్లో సులువుగా ఎంపిక ప్రక్రియ జరిగినా..మెజార్టీ మండలాల్లో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సొంత నియోజకవర్గం పోలాకి మండలంలో ఎంపీపీ పద వి కోసం తీవ్ర పోటీ నెలకొంది. సామాజిక సమీకరణల నేపథ్యంలో తమ్మినేని భూషణరావుకు తొలుత డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ మంత్రి కుమారుడు కృష్ణచైతన్య జడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన నేపథ్యంలో దమయంతి అనే కొత్త పేరును తెరపైకి తెచ్చారు. దీంతో గతంలో హామీ పొందిన భూషణరావు తన స్వగ్రామం సుసరాంలో దీక్షకు దిగుతుండడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నరసన్నపేట నియోజకవర్గంలో మూడు మండలాల్లో డిప్యూటీ సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపీపీలుగా ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ప లాస నియోజకవర్గంలో కూడా విభేదాలు తెరపైకి వస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలో ఉప్పరపల్లి నీలవేణి, మడ్డు పరమేశ్వరిలు ఆశాహులుగా ఉన్నారు. వర్గాలు విడిపోయి పదవి దక్కించు కునేందుకు పావులు కదుపుతున్నారు. మందస మండలంలో మెట్ట రుక్మిణి, డొక్కరి దానయ్యల మధ్య పోటీ ఉంది. ఎంపీపీ పదవి దక్కకపోతే నా సత్తా చూపిస్తానంటూ ఒక ఎంపీటీసీ అభ్యర్థి హెచ్చరిస్తున్నట్లు బోగ ట్టా.  స్పీక ర్‌ తమ్మినేని సీతారాం ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమదాలవలస నియోజకవర్గంలోనూ అవే గొడవలు కొనసాగుతున్నాయి.  పొందూరు మండలంలో స్పీకర్‌ ప్రధాన అనుచరుడి పేరు ఎంపీపీ అభ్యర్థిగా మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఆయన ఓటమి చెందడంతో పరిస్థితి తారుమారు అయ్యింది.వ్యతిరేక వర్గానికి పదవి దక్కకుండా స్పీకర్‌ జాగ్రత్తలు తీసుకుంటున్న సమాచారం. బూర్జ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీకి 8 స్థానాలు దక్కాయి.నలుగురు ఎంపీపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కందాపు నవీన, కన్నేని దీపల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. 

ఆ మండలాల్లో పోటా పోటీ

ఎచ్చెర్ల మండలంలో మొదలవలస చిరంజీవి, జరుగుళ్ల శంకర్‌ వర్గాల మధ్య  పోటీ నెలకొంది. మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలకుగాను వైసీపీకి 19 స్థానాలు దక్కాయి. ఇక్కడ క్యాంపు రాజకీయాలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కొత్తూరు మండలంలో హైడ్రామా నడుస్తోంది. రెండు వర్గాలు ఎంపీపీ కోసం పోటీ పడుతున్నాయి. 19 స్థానాలకు... వైసీపీకి 14, టీడీపీకి ఐదు స్థానాలు దక్కాయి. దీంతో  ఒక వర్గం టీడీపీ ఎంపీటీసీలతో టచ్‌లోకి రావడం చర్చనీయాంశమైంది. మెళి యాపుట్టిలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఇద్దరి మధ్య పో టీ నెలకొంది. రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలంలో ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇచ్ఛాపురంలో 15 స్థానాలకు 11 వైసీపీకి వచ్చాయి. ఇక్కడ రెండు గ్రూఫులుగా ఏర్పడ్డాయి. ఒక వర్గం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కవిటిలో 22 ఎంపీటీసీ స్థానాలకుగాను 21 వైసీపీకి దక్కడంతో అక్కడ కూడా ముగ్గురు అధ్యక్ష పదవి కోసం  పోటీలో ఉన్నారు. ఎంపీపీ పదవుల కోసం తీవ్ర పోటీ ఉండడంతో ముఖ్య వైసీపీ నేతలు ఫోన్‌లు స్విచ్ఛాఫ్‌ చేసినట్లు సమాచారం.

టెక్కలిలో జఠిలం

టెక్కలి నియోజకవర్గంలో ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక జఠిలమవుతోంది. కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్క టెక్కలిలో మాత్రం ద్విముఖ పోరు ఉండగా...మిగతా మండలాల్లో మాత్రం ఐదారుగురు అభ్యర్థులు ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. నందిగాంలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. అక్కడ ఎమ్మెల్సీ దువ్వాడ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాను సూచించిన వ్యక్తులనే ఎంపీపీలుగా ఎంపిక చేయాలని కోరుతున్నారు. సంతబొమ్మాళిలో 20 ఎంపీటీసీ స్థానాలకు 18 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఏకంగా ఆరుగురు అభ్యర్థులు ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు.  కోటబొమ్మాళి మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలకు 20 స్థానాలు వైసీపీ గెలుపొందింది. ఇక్కడ నుంచి కూడా నలుగురు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. నందిగాం మండలం 16 ఎంపీటీసీ వైసీపీ 16 స్థానాల్లో పాగా వేసింది. టెక్కలిలో 22 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ముగ్గురు పోటీ పడుతున్నారు.  కోటబొమ్మాళి, సంతబొమ్మాళికి చెందిన కొందరు నేతలు స్థానిక నేతలు తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పటికే పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.