మా ఊరికి రావొద్దు.. ఎవరైనా వస్తే జరిమానా..!

ABN , First Publish Date - 2020-07-22T22:05:52+05:30 IST

కరోనా వల్ల మనుషుల మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నది. కొత్త వ్యక్తులతో ఎక్కడ కరోనా వస్తుందోనన్న భయం ఎక్కువవుతున్నది. ఫలితంగా రాకపోకలు స్థంభించిపోతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.

మా ఊరికి రావొద్దు.. ఎవరైనా వస్తే జరిమానా..!

కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకూ నో ఎంట్రీ

దుబ్బాక నుంచి ఎవరిని రానిచ్చినా జరిమానా

ఆయా గ్రామాల ప్రజలకు సర్పంచుల హెచ్చరిక!

‘మూట’ వ్యాపారులకు తీరని నష్టం

కూలీలు, గుమస్తాలు రాలేక దుబ్బాకలో నిలిచిపోయిన పనులు

నేటి నుంచి లాక్‌డౌన్‌ సడలింపు


దుబ్బాక(మెదక్) : కరోనా వల్ల మనుషుల మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతున్నది. కొత్త వ్యక్తులతో ఎక్కడ కరోనా వస్తుందోనన్న భయం ఎక్కువవుతున్నది. ఫలితంగా రాకపోకలు స్థంభించిపోతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కరోనా మహమ్మారి వల్ల దుబ్బాక మండలానికి ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల గ్రామాల్లోకి అడుగు పెట్టొద్దనే ఆంక్షలు మొదలయ్యాయి. కేసులు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలను నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా చేనేత వ్యాపారులు సైకిళ్లపై తిరుగుతూ చేసే (మూట)వస్త్ర వ్యాపారాలు ఆగిపోయాయి. దుబ్బాకలో చేనేత కార్మికులు, మరికొందరు సైకిళ్లపై వస్త్రాలు, టీ పొడి (చాయ్‌పత్తా)తో పాటు ఇతరత్రా సామగ్రిని సరిహద్దు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ విక్రయిస్తుంటారు. ఆంక్షల వల్ల వారి వ్యాపారం సాగడం లేదు. 


దుబ్బాక మండలానికి ఆనుకుని ఉన్న కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం, రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీర్‌రావుపేట, ముస్తాబాద్‌ మండలాల్లోని గ్రామాలకు దుబ్బాక నుంచి వెళ్లే చిరువ్యాపారులకు, బంధువులకు ఆంక్షలు విధించారు. సోమవారం ముస్తాబాద్‌ మండలం ముచ్చర్ల గ్రామానికి వెళ్లిన వస్త్ర, టీ పొడి వ్యాపారులను గ్రామస్థులు తిరిగి పంపించేశారు. దుబ్బాక నుంచి ఎవరు వచ్చినా, వారితో ఎవరైనా మాట్లాడినా జరిమానా విధిస్తామని ఆ గ్రామ సర్పంచు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆయా గ్రామాలకు ఆనుకుని ఉన్న దుబ్బాక మండలంలోని గ్రామాలు పోతారం, పెద్దచీకోడు, గంబీర్‌పూర్‌ ప్రజలను కూడా అనుమతించడంలేదని తెలిసింది. దుబ్బాకవాసులు ఏవైనా శుభకార్యాలకు, బంధువుల వద్దకు వెళితే గ్రామసేవకుల ద్వారా సమాచారం తెలుసుకుని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. 


ఇటీవల గంభీర్‌రావుపేట మండలం నర్మాలకు వెళ్లిన టీపొడి వ్యాపారిని వెనక్కి వచ్చేవరకు వదల్లేదని తెలిసింది. అలాగే ఆయా గ్రామాల ప్రజలు దుబ్బాకలో కూలీ పనులకు వెళ్లినా జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా వారు కూలీ పనులు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. కూరగాయలు అమ్మే వారిని, చీరలు, వివిధ వస్తుసామగ్రి విక్రయించే వారిని గ్రామాల్లోకి రానివ్వడం లేదు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల ప్రజల్లో కూడా ఇదే తరహా ఆంక్షలు ఉన్నాయి. ధర్మాజీపేటకు చెందిన తాపీ కూలీలు దుబ్బాకలో పనులు చేపట్టకూడదని నిర్ణయించారు. దీంతో పెంకుటిళ్లు, ఇళ్ల మరమ్మతులకు ఇబ్బందిగా మారింది. దుబ్బాక మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన యువకులు పట్టణంలో వ్యాపారులు నిర్వహిస్తున్నారు. అయితే వారి కుటుంబీకులు వెళ్లొద్దని ఒత్తిడి తెస్తుండడంతో. దుబ్బాకకు రాకుండా, వినియోగదారుల నుంచి తప్పించుకోవడానికి ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు.


నష్టాన్ని అంచనా వేసి సడలింపులకు నిర్ణయం

వ్యక్తిగత జాగ్రత్తలు లేకుండా లాక్‌డౌన్‌ విధించడం వల్ల ఫలితం ఉండదని భావించిన దుబ్బాక  చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సోమవారం సడలింపును చేపట్టింది. కేవలం ఇద్దరు, ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా రావడంతో లాక్‌డౌన్‌ విధించడం వల్ల వ్యాపారపరంగా దుబ్బాక పట్టణం దెబ్బతింటుందని భావించారు. ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, లాక్‌డౌన్‌ను సడలించి, కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాలనే భావనకు వచ్చారు. మంగళవారం నుంచి లాక్‌డౌన్‌ సడలించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సడలింపు ఉంటుందని, శనివారం అంగడిని బంద్‌ చేయాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు చింతరాజు ప్రకటించారు. వ్యక్తిగ త జాగ్రత్తలు తీసుకోని వారికి జరిమానా విధించాలని సూచించారు. తప్పనిసరిగా అందరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం ఉండేలా కిరాణా దుకాణదారులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో వస్త్రదుకాణ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యాపారం నిర్వహించుకోవాలని కోరారు. 

Updated Date - 2020-07-22T22:05:52+05:30 IST