కార్యాలయాలకు.. రావద్దు!

ABN , First Publish Date - 2021-04-20T04:40:59+05:30 IST

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు కొద్దిరోజులపాటు రావద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే.. మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాల్సిందేనని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాటి కలెక్టరేట్‌లో ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. కేవలం ఫోన్‌ద్వారా సమస్యలను తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించారు.

కార్యాలయాలకు.. రావద్దు!
ఉద్యోగులు హాజరుకాక నిర్మానుష్యంగా ఉన్న కార్పొరేషన్‌ కార్యాలయం

కొవిడ్‌ వ్యాప్తి వేళ.. అధికారుల ఆంక్షలు
స్పందన కార్యక్రమం రద్దు
ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల స్వీకరణ
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు కొద్దిరోజులపాటు రావద్దంటూ ఆంక్షలు విధిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే.. మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాల్సిందేనని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నాటి కలెక్టరేట్‌లో ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. కేవలం ఫోన్‌ద్వారా సమస్యలను తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చిపోయేవారిపై నిఘా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను ఎవరూ కలిసేందుకు రావద్దని, అవసరం అయితే ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా అందిన అనేక ఫిర్యాదులు పరిష్కరించాల్సి ఉంది. కనీసం అర్జీదారులకు సమాధానం కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులు కూడా ఫోన్‌కు స్పందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు కరోనా సాకుతో కార్యాలయాల్లో ఉండేందుకు ఇష్టపడడం లేదు. కేవలం ముఖ్య అధికారుల టెలీ కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లకు మాత్రమే హాజరవుతున్నారు. దీంతో ఎంపీడీవో, రెవెన్యూ కార్యాలయాల్లో సమస్యలు చెప్పుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఫోన్‌ నెంబర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. త్వరగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 ప్రజాప్రతినిధులు సైతం..
కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రజాప్రతినిధులు సైతం తమ క్యాంపు కార్యాలయాలకు తాత్కాలిక సెలవులు ప్రకటించారు. కార్యకర్తలు, అధికారులు ఎవరూ తమ క్యాంపు కార్యాలయాలకు రావద్దని స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు సైతం ప్రారంభోత్సవాలు, సభలు, సమావేశాలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు.

 తగ్గని ఉధృతి
జిల్లాలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజురోజుకీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా సోమవారం మరో 893 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 10,08697 నమూనాలు సేకరించగా..  కరోనా బాధితుల సంఖ్య 52,976కు చేరింది. వీరిలో చాలామంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌ కేంద్రంలో 4,442 మంది, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 476  మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 265 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-04-20T04:40:59+05:30 IST