నాణ్యతలో రాజీ వద్దు

ABN , First Publish Date - 2020-12-04T05:12:03+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయంగా చేపడుతున్న ‘నాడు-నేడు’ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నివాస్‌ అధికారులకు ఆదేశించారు.

నాణ్యతలో రాజీ వద్దు
ధర్మపురం పాఠశాలలో నాడు- నేడు పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

నాడు-నేడు పనులు వేగవంతం చేయండి
కలెక్టర్‌ నివాస్‌
(ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్‌/సోంపేట/కంచిలి/కవిటి)

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ధ్యేయంగా చేపడుతున్న ‘నాడు-నేడు’ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ నివాస్‌ అధికారులకు ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ వద్దని హెచ్చరించారు. గురువారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లోని వివిధ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులను పరిశీలించారు. ఇచ్ఛాపురంలోని బాలికోన్నత పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించి.. విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం, ఈదుపురం పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఫ్లోరింగ్‌ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు ఆదేశించారు. సోంపేట మండలం పలాసపురం, సోంపేట ఉన్నత పాఠశాలలను సందర్శించి.. బాత్‌రూమ్‌లో అస్తవ్యస్తంగా ఉన్న పనులను సరిచేయాలని తెలిపారు. కవిటి మండలం నెలవంక, సీమూరు ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు పరిశీలించారు. కంచిలి మండలం ఎం.ఎస్‌.పల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. పనులను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో 1156 పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో పెయింటింగ్‌ పనులు జరుగుతున్నాయి. అన్ని పాఠశాలలకు ఫర్నీచర్‌ సమకూర్చాం. కొన్ని పాఠశాలల్లోని వరండాల్లో అదనపు తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేస్తున్నాం. సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతా’మని తెలిపారు.

సత్ఫలితాలు సాధించాలి
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం చదివి.. సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ నివాస్‌ పిలుపునిచ్చారు. సోంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలెక్టర్‌ ముచ్చటించారు. ఈ సందర్భంగా యూనిఫాం, బెల్టు ధరించి పాఠశాలకు హాజరైన విద్యార్థి పవన్‌ను అభినందిస్తూ పెన్ను బహూకరించారు. ప్రతి విద్యార్థీ బెల్టు, యూనిఫాం, షూ ధరించి హుందాగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మరింత శ్రద్ధగా చదివి పదికి పది పాయింట్లు సాధించాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 30 శాతం వరకు విద్యార్థుల చేరికలు పెరిగాయని.. ఇదే స్ఫూర్తితో మంచి విద్యా విధానానికి బాటలు వేయాలని ఉపాఽధ్యాయులకు సూచించారు.

సచివాలయ సిబ్బంది తీరుపై అసంతృప్తి
కవిటి మండలంలోని నెలవంక సచివాలయ సిబ్బంది పనితీరుపై కలెక్టర్‌ నివాస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. సిబ్బంది, వలంటీర్లు బయోమెట్రిక్‌ వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బయోమెట్రిక్‌ డివైస్‌ పనిచేయడం లేదని సిబ్బంది బదులిచ్చే ప్రయత్నం చేయగా... కుంటిసాకులు చెప్పొద్దని మందలించారు. మండలంలో అన్ని సచివాలయాల్లోనూ ఇదే పనితీరు కొనసాగుతుందా? అని ఎంపీడీవో సూర్యనారాయణను ప్రశ్నించారు. బయోమెట్రిక్‌ వేయని వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్‌ నివాస్‌ పర్యటనలో భాగంగా సోంపేటలో వివిధ సమస్యలను అధికారులు, స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ భవనం, బారువ కళాశాల భవనాలు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. పలాసపురం, లక్కవరంలో వీధి దీపాలు వెలగడం లేదని, పాఠశాలల ప్రహరీ  నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయని మాజీ ఎంపీటీసీ తడక జోగారావు వివరించారు. ఈ పనులన్నీ పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీవోను కలెక్టర్‌ ఆదేశించారు. రూర్బన్‌ పనులు వెంటనే పూర్తి చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. తితలీ కారణంగా ఉద్దానంలో కొబ్బరికి పట్టిన పురుగు నివారణ కోసం త్వరలో మందును పిచికారీ  చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ మల్లెవరపు నవీన్‌, ఇచ్ఛాపురం మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి, తహసీల్దారులు మురళీమోహన్‌రావు, ఎన్‌.వెంకటరావు, వి.విజయ్‌కుమార్‌, ఎంపీడీవోలు వెంకటరమణ, ఆర్‌.వెంకటరావు, సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, ఎంఈవోలు కురమాన అప్పారావు, ఎస్‌.శివరాంప్రసాద్‌, ఎస్‌.జోరాడు, ధనుంజయ, ఏఈ అట్టాడ సునీల్‌, డీఈఈ సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:12:03+05:30 IST