చేసేదేం లేదు!

ABN , First Publish Date - 2021-09-02T06:45:07+05:30 IST

గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేధిస్తోంది. ఎన్నో ఆశలతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ఏ పనీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

చేసేదేం లేదు!

నిధులు లేక వెలవెలబోతున్న గ్రామ పంచాయతీలు

నూతన సర్పంచ్‌ల్లో ఆందోళన

ఉన్న కొద్దిపాటి ఫండ్స్‌కూ  అడ్డంకులు

14వ ఆర్థిక సంఘం డబ్బు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకు  సరి

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 1  : గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేధిస్తోంది. ఎన్నో ఆశలతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ఏ పనీ చేయలేని  పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 1052 గ్రామపంచాయతీలు ఉండగా 1,027 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.  14వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు సుమారు రూ.130కోట్ల మేర రాగా ఆ నిధుల్లో సుమారు రూ.70 కోట్లకుపైగా ప్రత్యేక అధికారుల పాలనలోనే విద్యుత్‌ బిల్లులు చెల్లించారు. మిగిలిన దాన్ని పలు పథకాలకు వినియోగించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రావడంతో సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ నిధులతో గ్రామాభివృద్ధికిపాటుపడవచ్చని ఆలోచనతో  పోటీపడ్డారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రత్యేకాధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను వినియోగించడంతో ప్రస్తుతం ఆయా పంచాయతీల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా చిల్లిగవ్వ లేని పరిస్థితి ఏర్పడింది. 


అధికార పార్టీ సర్పంచ్‌ల్లోనూ ఆందోళన

అధికారపార్టీ సానుభూతితో గెలుపొందిన సర్పంచ్‌లు మరింత ఆందోళన చెందుతున్నారు. పంచాయతీల్లో నిధులు లేకపోవడం, ప్రభుత్వం వివిధ పథకాలను సర్పంచ్‌లే చేపట్టాలని  ఆదేశాలు ఇవ్వడంతో మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖాళీ ఖజానాతో గ్రామాల్లో ఏమి చేస్తామని సర్పంచ్‌లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో అరకొరగా ఉన్న నిధులను కూడా సర్పంచ్‌లు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ఏదైనా అభివృద్ధి పనులు చేసేందుకు పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసి బిల్లులు పెట్టినా సీఎఫ్‌ఎంఎస్‌లో  మంజూరు కావడం లేదు. దీంతో సర్పంచ్‌లు తాము ఉండీ ఏమిప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు.


పూర్తిస్థాయి చెక్‌ పవర్‌ లేదు!

ప్రభుత్వం  పూర్తి స్థాయిలో చెక్‌పవర్‌ను మాత్రం సర్పంచ్‌లకు ఇవ్వలేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బ్లీచింగ్‌, పారిశుధ్యం, మంచినీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడంతో అందుకు అనుగునంగా సర్పంచ్‌లు పనులు చేపట్టారు.  నాలుగైదు మాసాలు గడుస్తున్నాఇంత వరకు ఒక్క పైసా వచ్చిన పరిస్థితి లేదు. దీంతో తమకు చెక్‌పవర్‌ ఇచ్చినట్లే ఇచ్చి నిధులు డ్రా చేసుకొనే అధికారం లేకుండా  చేసిందనే ఆరోపణలు వ్యక్త  వుతున్నాయి.  


Updated Date - 2021-09-02T06:45:07+05:30 IST