మాదిగల్లో ఒక్కళ్లు కూడా పనికిరారా!

ABN , First Publish Date - 2021-09-08T05:46:33+05:30 IST

సమతా దృక్పథం, సమాదరణ ప్రజాస్వామిక ప్రభుత్వ మూలాలు. వీటికి భిన్నంగా ప్రవర్తించే పాలకులు అర్హత ఉండీ అవకాశాలు పొందలేని జాతులకు అన్యాయం చేస్తారు....

మాదిగల్లో ఒక్కళ్లు కూడా పనికిరారా!

సమతా దృక్పథం, సమాదరణ ప్రజాస్వామిక ప్రభుత్వ మూలాలు. వీటికి భిన్నంగా ప్రవర్తించే పాలకులు అర్హత ఉండీ అవకాశాలు పొందలేని జాతులకు అన్యాయం చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఇదే చేస్తున్నది. మాదిగలపై కక్షగట్టి పాలన రంగం లోకి వారిని రానివ్వకుండా అణచివేస్తున్నది. విద్య, ఉద్యోగ, రాజకీయ పాలక పదవుల్లో మాదిగల స్థానాన్ని జీరో స్థాయికి చేర్చింది.


ఇటీవల విద్యా వ్యవస్థలో పదవులకు నియామకాలు జరిగాయి. వీటిని పరిశీలిస్తే మాదిగలకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎంత అన్యాయం చేసిందో అర్థమవుతుంది. యూనివర్సిటీలకు నియమించిన పదిమంది వైస్‌ చాన్సలర్లలో గానీ, టీ‌ఎస్‌పీఎస్‌సీకి నియమించిన చైర్మన్‌, ఏడుగురు సభ్యులలో గానీ, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఏడుగురు సెట్స్‌ కన్వీనర్లలో గానీ, ఉన్నత విద్యామండలి నియమకాల్లో గానీ ఎక్కడా ఒక్క మాదిగను నియమించలేదు. ముప్పైకి పైగా జరిగిన నియామకాల్లో ఒక్క మాదిగ లేడు. అంతేకాదు కూకట్‌పల్లిలోని జే‌ఎన్‌టీయూలో పరిపాలన అనుభవం కలిగిన మాదిగ ప్రొఫెసర్‌ని రిజిస్ట్రారుగా నియమిస్తే ఓర్చుకోలేక ప్రభుత్వం జోక్యం చేసుకొని గంటల వ్యవధిలో ఆ ఉత్తర్వులను రద్దు చేయించింది. అయితే పైన పేర్కొన్న అన్ని విభాగాల్లో మాల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పదవి వారికే ఇచ్చారు. అలాగే ప్రతి విభాగంలోను రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఇది మాదిగ జాతిని ఘోరంగా అవమానించే చర్యనే. మాదిగలు పదవుల్లోకి రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా కుట్రను అమలు చేస్తున్నది. చదువులు నేర్పించే వ్యవస్థ నుండి మాదిగలను అధికారికంగా ‘వెలి’ వేసింది.


ఇప్పటికే మంత్రి వర్గంలో స్థానం లేదన్న ఆవేదన మాదిగ సామాజిక వర్గం వారి హృదయాల్లో బలంగా నాటుకుంది. ముఖ్యమంత్రి నియమించుకున్న సలహాదారుల్లోనూ, ముఖ్యమంత్రి కార్యాలయం లోనూ మాదిగలకు స్థానం ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ తరువాత ఆ స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రదీప్‌ చంద్ర రావాల్సి ఉండగా– రెండుసార్లు రాజీవ్‌ శర్మ కాలాన్ని పొడిగించి ప్రదీప్‌ చంద్ర కాలాన్ని హరించి వేశారు. పోలీస్‌ శాఖలో మొదటి డీజీపీ అనురాగ్‌శర్మ తరువాత అదే స్థాయిలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన కృష్ణప్రసాద్‌కు అవకాశం రావాలి. కానీ అతడినీ దూరం పెట్టారు. చివరికి పదవీ విరమణ అనంతరం ఇద్దరు శర్మలకు ప్రభుత్వ సలహాదారులుగా గౌరవం దక్కితే, ప్రదీప్‌ చంద్ర, కృష్ణప్రసాద్‌లకు అవమానాలు వీడ్కోలుగా లభించాయి.


ఉద్యమ నేతగా కేసీఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీ ప్రకారం మెజార్టీ జనాభా కలిగిన మాదిగలకు ముఖ్యమంత్రి పదవి రావాలి. కానీ మోసం చేశారు. రెండవ స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా డా.రాజయ్య ఐదేళ్ల పాటు కొనసాగాలి. కానీ అకారణంగా బర్తరఫ్‌ చేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రి వర్గంలోనైనా మాదిగలకు స్థానం లభిస్తుందని ఆశిస్తే మళ్ళీ అన్యాయమే జరిగింది. మొదటి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ హోదాలో ఉప ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగిన మహమ్మద్‌ ఆలీ రెండోసారి కూడా ఎమ్మెల్సీ హోదాలో మంత్రిగా కొనసాగుతున్నాడు. కానీ అదే హోదాలో పని చేసిన కడియం శ్రీహరిని మాత్రం రెండవ సారి మంత్రిగా తీసుకోకపోవడం దారుణం. రెండుసార్లు ప్రజాప్రతినిధిగా గెలిచి అత్యధిక ఓట్లతో టీఆర్‌ఎస్ పార్టీలోనే మొదటి స్థానంలో నిలిచిన చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్థానాన్ని బాల్క సుమన్‌కు అప్పగించారు. గత ఏడేండ్లుగా సామాజిక వర్గాల నేపథ్యం చూసి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేస్తున్న ప్రభుత్వం ఒక్క మాదిగకు కూడా అవకాశం ఇవ్వకుండా వివక్ష చూపెట్టింది. తెలంగాణ ఉద్యమంలో ఆవగింజంత త్యాగం లేని సంతోష్‌ కుమార్‌ రాజ్యసభకు అర్హుడిగా కనిపించారు గానీ, తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసి పాలక పార్టీని వదిలి వచ్చిన మంద జగన్నాథం లాంటి మాదిగ నేతలు మాత్రం అర్హులు కాలేకపోయారు. బంధుత్వానికి ఉన్న విలువ ప్రజాసేవకు, ఉద్యమ త్యాగాలకు లేకుండా పోయింది.


రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రెస్‌మీట్‌లు పెట్టి మాటలతో ఎదురుదాడి చేయించడానికి, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న తమ స్వంత జాతి ఉద్యమ నాయకత్వాన్ని దూషించడానికి మాత్రమే ప్రభుత్వం మాదిగ వర్గాన్ని వాడుకుంటున్నది. వెలమ, రెడ్డి ప్రజాప్రతినిధులకు ప్రజలను పాలించే పనిని, మాదిగ ప్రజా ప్రతినిధులకు మాత్రం ప్రభుత్వానికి కాపలా కాసే బాధ్యతను అప్పగించడం దుర్మార్గమైన రాజనీతి. పాలక పదవుల్లోకి మాదిగలను చేర్చుకోకపోతే వారి సమస్యలు ఎలా చర్చకు వస్తాయి? వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు మాదిగల కోసం ప్రభుత్వంలో ఒకే ఒక్క తీర్మానం జరిగింది. అది కూడా డా.రాజయ్య ఉప ముఖ్యమంత్రి హోదాలో చొరవ తీసుకొని చేయించిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం మాత్రమే. ఆ తరువాత ముఖ్యమంత్రి బంజారాహిల్స్‌లో మాదిగ భవన్‌ నిర్మాణం కోసం, డప్పు చెప్పు పెన్షన్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలు కాలేదు. గీత, చేనేత కార్మికుల పెన్షన్లపై, వెలమ, కమ్మ భవనాలపై తీర్మానాలు జరిగినట్లు, మాదిగ భవన్‌, డప్పు, చెప్పు కార్మికుల పెన్షన్ల మీద తీర్మానం జరుగలేదు. వాటిని అమలు చేయాలని అడిగేవారు, ముఖ్యమంత్రితో కనీసం చర్చించేవారు ప్రభుత్వంలో లేకపోవడం వల్లే అవి విస్మరించబడ్డాయి. కనుకనే ప్రభుత్వంలో పాలక పదవుల్లో ప్రాతినిధ్యం ఉండాలని మాదిగలు ఆకాంక్షిస్తున్నారు.


ప్రస్తుతం తెలంగాణలో పన్నెండుమంది మాదిగ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అర్హులు కారా? ఎంతోమంది నిజాయితీపరులైన మాదిగ మేధావులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా వైస్‌ చాన్సలర్లుగా, టీఎస్‌పీ‌ఎస్‌సీ సభ్యులుగా పనికి రారా? తెలంగాణ కోసం పదవుల్ని త్యాగం చేసి ఉద్యమంలో మమేకమైన మాదిగ నేతలు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా రాజ్యసభకు అర్హులు కాలేరా? మాదిగ సామాజిక వర్గానికి చెందిన సమర్థులైన ఉన్నతాధికారులు ఎందరో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్కరికీ చోటు దొరకడం లేదా? అట్టడుగు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకొని అణచి వేస్తే సాధించేది ఏమున్నది, నియంతృత్వ ప్రభుత్వమనే పేరు తప్ప?


ఇప్పుడు ముఖ్యమంత్రి దళితబంధు ద్వారా దళిత సాధికారత సాధించడమే లక్ష్యమని అంటున్నారు. మరి ఈ దళిత సాధికారతలో మాదిగల సాధికారత ఉందా లేదా తేల్చాలి. ప్రభుత్వ వ్యవస్థలో అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మాదిగల్లో సాధికారత లేనట్లే కదా? వారికి సాధికారత లేకుండా దళిత సాధికారత ఎట్లా సాధ్యమవుతుంది? దళితబంధు కేవలం ఆర్థిక చేయూతనిచ్చే పథకమే కానీ దానివల్ల సామాజిక అంతరాలు సమసిపోవు. ప్రభుత్వమే పదవుల విషయంలో వివక్ష చూపినప్పుడు సమాజంలో వివక్ష ఎలా తొలగుతుంది? ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం అనేది ఆత్మ గౌరవ సమస్య. పది లక్షల పైసలు ఇస్తాం కానీ పాలనకు మాత్రం దూరం పెడుతాం అంటే సహించే స్థితిలో మాదిగలు లేరు. దళితబంధు ద్వారా ఆర్థికంగా పైకి తీసుకురావాలి. పాలక పదవుల్లో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా సమాజంలో గౌరవ స్థానాన్ని కల్పించాలి. 


మాదిగల మీద కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి శత్రుత్వ ధోరణి చూపిస్తున్నది. తమకు జరిగిన అన్యాయాలపై ప్రభుత్వం మీద మాదిగలు అనేకసార్లు పోరాటం చేసి ఉండవచ్చు. ఆ పోరాటం సైద్ధాంతికమైనది, శాస్త్రీయమైనదే తప్ప విద్వేషపూరితమైనది కాదని గ్రహించాలి. మాదిగల పాత్ర, మాదిగల త్యాగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు. మంత్రి వర్గంలో, పాలక పదవుల్లో, సీఎంఓలో, ఇతర పాలక పదవుల్లో మాదిగలను నియమించి ప్రభుత్వంలో తగిన భాగస్వామ్యం ఇవ్వాలి. అదే ధర్మం, ప్రజాస్వామ్యం.

గోవిందు నరేష్‌ మాదిగ

ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2021-09-08T05:46:33+05:30 IST