May 5 2021 @ 00:42AM

మాస్క్‌ మరిచిపోకండి

గుర్తుంచుకోండి...

మార్క్‌ చేసి మరీ పెట్టుకోండి.

మాస్క్‌ మస్ట్‌ అండ్‌ షుడ్‌ అని!

మస్తిష్కంలో మార్క్‌ చేసుకోండి...

సారీ... సారీ... మాస్క్‌ చేయండి!

ఎటువంటి పరిస్థితుల్లోనూ...

మాస్క్‌ ధరించడం మరువకండి.

మన తారలు ఇస్తున్న సందేశమిదే!

మనకు దగ్గరైన వ్యక్తుల పుట్టినరోజు, పెళ్లి రోజు వంటివి మర్చిపోకుండా క్యాలెండర్‌లో తేదీలను, చేయాల్సిన ముఖ్యమైన పనులు మర్చిపోకుండా డైరీలో పేజీలను మార్క్‌ చేయడం అలవాటు. ఇప్పుడు మార్క్‌ చేయడం బదులు ప్రతి ఒక్కరూ మాస్క్‌ వేసుకోవాల్సిన సమయం వచ్చింది. సినీ తారలు అదే విషయం చెబుతున్నారు. కొందరు నేరుగా చెబుతుంటే... మరికొందరు తారలు చెప్పడంతో పాటు, తమ చర్యలతో పరోక్షంగా సందేశం ఇస్తున్నారు. ‘మాస్క్‌ అప్‌... ఫర్‌ యు అండ్‌ మి’ (మీ కోసం, నా కోసం... మాస్క్‌ ధరించండి) అని క్యాప్షన్‌ రాసి ఉన్న టీషర్టును అడివి శేష్‌ ధరించారు. శ్రుతీ హాసన్‌ అయితే మాస్క్‌లను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటున్నారు. దాదాపుగా తారలందరూ సందర్భం లభించినప్పుడు మాస్క్‌లపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.


మాస్క్‌ & సెల్ఫీ!

ఇప్పుడు తారలు ఫాలో అవుతున్న లేటెస్ట్‌ ట్రెండ్‌ ఏదో తెలుసా? మాస్క్‌ ్క్ష సెల్ఫీ! పరిశ్రమలో సహచరుల్ని కలిసినా... ఎక్కడికి వెళ్లినా... మాస్క్‌ ధరించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. సినిమాటోగ్రాఫర్‌ జి. విష్ణు వివాహంలో కీర్తీ సురేశ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మాస్క్‌లతో తీసుకున్న సెల్ఫీ ట్రెండ్‌ అయ్యింది. ఏఆర్‌ రెహమాన్‌ సైతం ఎవరికి సెల్ఫీలు ఇచ్చినా... మాస్క్‌తోనే ఇస్తున్నారు.


ప్రయాణాల్లో...

‘అన్నాత్త’ చిత్రీకరణలో పాల్గొనడానికి నయనతార గత వారమే హైదరాబాద్‌ వచ్చారు. ఇటీవలే ‘అఖండ’ తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తవడంతో ప్రగ్యా జైస్వాల్‌ ముంబై వెళ్లారు. అప్పుడు ఈ ఇద్దర్నీ గమనించారా? కనీసం ఫొటోల కోసమూ మాస్క్‌ తీయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా ప్రయాణలు చేయాల్సి వస్తే... వీళ్లను ఫాలో అయితే సరి!


భార్యాభర్తలైనా...

‘వేర్‌ ఎ మాస్క్‌’ అంటున్నారు శ్రియ - అండ్రూ కొశ్చివ్‌ దంపతులు. అలాగే, కాజల్‌ అగర్వాల్‌ - గౌతమ్‌ కిచ్లూ జంట! భార్యాభర్తలైనా... ఎక్కడికైనా కలిసి వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించాలని చెబుతున్నారు. మలయాళ హీరో హీరోయిన్లు, భార్యాభర్తలైన ఫాహద్‌ ఫాజిల్‌, నజ్రియా నజిమ్‌ ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చి వెళ్లారు. వాళ్లూ అంతే! మాస్క్‌లు తీయలేదు.


షాపింగా?

కరోనా కాలంలో నిత్యావసర వస్తువుల కోసం షాపింగ్‌కు వెళుతున్నారా? వారంలో ఏదో ఒక రోజు ఆ పని పూర్తి చేసుకోవడం మంచిదని హీరో, ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ ప్రిన్స్‌ సందేశం ఇస్తున్నారు. ‘‘నేను మంచి సన్‌ (కుమారుడు)గా ఉంటున్నా. ఎందుకంటే... ఈ రోజు సండే కదా’’ అని ఆదివారం వాళ్ల అమ్మతో కిరాణా సరుకులు కొనడానికి వెళ్లిన ఫొటోను ఆయన పోస్ట్‌ చేశారు. ఇటలీలో ‘థాంక్యూ’ చిత్రీకరణలో ఉన్న రాశీ ఖన్నా, మధ్యలో కొంచెం ఖాళీ సమయం లభించడంతో బయటకు వెళ్లారు. మేకప్‌కి అవసరమైనవి తీసుకోవడానికి! బయటకు అడుగుపెడితే మాస్క్‌ ముఖ్యమని మిర్రర్‌ సెల్ఫీ ద్వారా ఆమె చెప్పారు.


మూగ జీవాలున్నాయా?

మలైకా అరోరా ప్రతిరోజూ పెంపుడు శునకాన్ని వాకింగ్‌కు తీసుకువెళుతుంటారు. ఒక్కరోజు కూడా మాస్క్‌ లేకుండా కనిపించరు. ఇంట్లో మూగ జీవాలు ఉన్న వారందరూ ఆమెను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే... తాజాగా హైదరాబాద్‌ జూలో ఎనిమిది సింహాలకు కరోనా సోకింది. అందుకని, పెంపుడు జంతువులతో ఆడుకునేటప్పుడు, వాకింగ్‌కు తీసుకువెళ్లేటప్పుడూ మాస్క్‌ ధరించండి. ‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌, తెలుగమ్మాయి చాందినీ చౌదరి అయితే ఇంట్లో పెంపుడు కుక్కతో టైమ్‌ స్పెండ్‌ చేసేటప్పుడూ మాస్క్‌ తీయలేదు. మాస్క్‌ ధరించడం ముఖ్యమని చెప్పారు.


వ్యాక్సిన్‌కి వెళ్లేటప్పుడూ...

రమ్యకృష్ణ ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ కోసం ఆసుపత్రికి వెళ్లేవారు మాస్క్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారామె. హిందీ నటి మాధురీ దీక్షిత్‌ సహా మరికొందరు తారలు మాస్క్‌తో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.