హక్కుల కోసం పోరాటాలకు వెనుకాడవద్దు

ABN , First Publish Date - 2021-06-22T05:55:27+05:30 IST

హక్కుల కోసం పోరాటాలకు వెనుకాడవద్దని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు.

హక్కుల కోసం పోరాటాలకు వెనుకాడవద్దు
దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న జె.అయోధ్యరామ్‌

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌

కూర్మన్నపాలెం, జూన్‌ 21: హక్కుల కోసం పోరాటాలకు వెనుకాడవద్దని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 130వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో ఎస్‌ఎంఎస్‌-2 కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో అయోధ్యరామ్‌ మాట్లాడుతూ గతంలో విశాఖ ఉక్కు కర్మాగారంపై అడుగడుగునా కుట్రలు, ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులు తిప్పికొట్టారన్నారు. 1985లో రేషనలైజ్డ్‌ కాన్సెప్ట్‌ పేరుతో ప్లాంట్‌ను ముక్కలు చేసే ప్రయత్నాలు చేశారని, 1998లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, ఎయిర్‌ సెపరేషన్‌ ప్లాంట్‌లను ప్రైవేట్‌కు ఇచ్చే ప్రయత్నాలు చేశారని, 1400 ఎకరాల స్టీల్‌ప్లాంట్‌ భూమిని లాక్కొని గంగవరం పోర్టుకు అప్పగించారని, 1999లో బీఐఎఫ్‌ఆర్‌ పేరుతో అమ్మేయాలని ప్రయత్నించారని వివరించారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ  ఉక్కు కర్మాగారంలో, సెయిల్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలను స్టీల్‌ యాజమాన్యాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, దొమ్మేటి అప్పారావు, రామచంద్ర రావు, మరిడయ్య, రాజు, అప్పలరెడ్డి, బాలాజీ, సత్యనారాయణ, మురళీ కృష్ణ, వి.ప్రసాద్‌, గంగవరం .గోపి, వరసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T05:55:27+05:30 IST