కొవిడ్‌ మరణాలను దాచొద్దు

ABN , First Publish Date - 2020-08-02T08:26:38+05:30 IST

తెలంగాణలో కొవిడ్‌ మరణాలను సర్కారు దాచిపెట్టడం సరైంది కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

కొవిడ్‌ మరణాలను దాచొద్దు

  • కరోనా కట్టడిలో ఢిల్లీ ప్రభుత్వాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలి: కిషన్‌రెడ్డి
  • గాంధీ, టిమ్స్‌లను సందర్శించిన కేంద్ర మంత్రి


అడ్డగుట్ట/ఎర్రగడ్డ/మియాపూర్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొవిడ్‌ మరణాలను సర్కారు దాచిపెట్టడం సరైంది కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం గాంఽధీ ఆస్పత్రి, టిమ్స్‌, ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రులను ఆయన సందర్శించారు. గాంధీ   నుంచి వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణకు కేంద్రం సహకరిస్తుందని, వైద్యంపై నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఈ నెలలో వైరస్‌ మరింతగా విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారని, అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.  


టిమ్స్‌లో వసతులేవి?

టిమ్స్‌లో సదుపాయాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘కరోనా వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్మెంట్‌లో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కేంద్రం వైద్య పరికరాలను సమకూర్చింది. ఇంకా కావాలంటే ఇస్తుంది. కరోనా బారిన పడినవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలి’ అని సూచించారు. సర్కారు ఆస్పత్రులపై నమ్మకం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

Updated Date - 2020-08-02T08:26:38+05:30 IST