ప్రజలపై పన్నుల భారం వేయొద్దు

ABN , First Publish Date - 2021-06-15T06:00:25+05:30 IST

ఆస్తి పన్ను పెంపు, చెత్తపై పన్ను విధింపు ద్వారా ప్రజలపై భారం వేయొద్దని కోరుతూ టీడీపీ నేతలు, కార్పొరేటర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు.

ప్రజలపై పన్నుల భారం వేయొద్దు
జీవీఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన

విశాఖపట్నం, జూన్‌ 14(ఆంఽధ్రజ్యోతి): ఆస్తి పన్ను పెంపు, చెత్తపై పన్ను విధింపు ద్వారా ప్రజలపై భారం వేయొద్దని కోరుతూ టీడీపీ నేతలు, కార్పొరేటర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. వాటికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులు మాట్లాడుతూ మూలధనం విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాలని నిర్ణయించడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుకంటే 15 శాతం లోపే పన్ను పెరుగుదల ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నదానికి... తర్వాత జరగబోయేదానికి పొంతన ఉండదన్నారు. గతంలో మాదిరిగానే ఆస్తిపన్ను విధానం కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. చెత్త సేకరణపై సెస్‌ పేరుతో ప్రజలపై కొత్తగా భారం మోపడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు. చెత్తను సంపదగా మార్చుకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాల్సింది పోయి... చెత్త సేకరణకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అనేక నగరాల్లో చెత్త నిర్వహణ సమర్థంగా నిర్వహించామని, వైసీపీ ప్రభుత్వం అవసరమైతే తమ పార్టీ అధినేత చంద్రబాబు సలహాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ కార్పొరేటర్లు అక్కడి నుంచి ర్యాలీగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజనకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్నకుమారి, గంట అప్పలకొండ, మొల్లి హేమలత, పిల్ల మంగమ్మ, శ్రీవిద్య, నొల్లి నూకరత్నం, పులి లక్ష్మీబాయ్‌, పల్లా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-15T06:00:25+05:30 IST