విద్యుత్‌ చార్జీలు పెంచొద్దు

ABN , First Publish Date - 2022-01-25T06:36:57+05:30 IST

విద్యుత్‌ చార్జీలను పెంచవద్దని, వినియోగదారులపై భారం మోపవద్దని వినియోగదారులు, ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ చార్జీలు పెంచొద్దు

వినియోగదారులపై భారం మోపొద్దు

ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణలో వామపక్షాలు, ప్రజా సంఘాల నేతల డిమాండ్‌

పంపిణీ సంస్థల ప్రతిపాదనలపై నిరసన

వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చవద్దని విజ్ఞప్తి


విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలను పెంచవద్దని, వినియోగదారులపై భారం మోపవద్దని వినియోగదారులు, ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు)కు ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు సమర్పించిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) సోమవారం విశాఖపట్నం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి, సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్‌ రామ్‌సింగ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీలు వారి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, డిస్కమ్‌లు ప్రామాణికాల ప్రకారం పనిచేయాలని సూచించడం వల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ఇటు వినియోగదారులు, అటు డిస్కమ్‌లు రెండింటికీ సమన్యాయం చేయాల్సి ఉందని, ఆ దిశగానే ఈఆర్‌సీ పనిచేస్తోందన్నారు. విద్యుత్‌ ఒప్పందాలపై తాము గతంలోనే ఆదేశాలు ఇచ్చామని, వాటిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అక్కడి తీర్పుకు కట్టుబడి ఉంటామని, అవసరమైతే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి వెనుకాడబోమని స్పష్టంచేశారు. విద్యుత్‌ టారిఫ్‌లపై మాత్రమే ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని, ఒప్పందాలపై కాదని, అది తమ పరిధిలో లేని అంశమని స్పష్టంచేశారు. దీనిపై విజయవాడకు చెందిన సీపీఎం నాయకులు సీహెచ్‌ బాబూరావు, ఈఆర్‌సీ చైర్మన్‌ మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఏ నిర్ణయమైనా, ఎవరిదైనా అంతిమంగా వినియోగదారులపైనే భారం పడుతున్నందున, తాము వాటి గురించి చర్చిస్తామని, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టమని బాబూరావు తన ప్రసంగం కొనసాగించారు. ఎప్పుడూ ఏప్రిల్‌ నుంచి అదనపు భారం మోపే సంస్థలు ఈసారి ఆగస్టు నుంచి అమలు చేస్తామనడంతో అనుమానంగా ఉందన్నారు. కొత్త ప్రతిపాదనల వల్ల నెలకు రూ.105 కోట్ల భారం వినియోగదారులపై పడుతోందన్నారు. అసలు భారమే లేకుండా చేయాలని డిమాండ్‌ చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.2,500 కోట్లు ఆదా చేశామని చెబుతున్నందున ఆ మేరకు ట్రూ-డౌన్‌ చార్జీలు వసూలు చేయాలని, ఆ ప్రయోజనం వినియోగదారులకు అందించాలన్నారు. రాష్ట్రంలో 14 థర్మల్‌ స్టేషన్లను తాత్కాలికంగా నిలిపేశారని, ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలన్నారు. సెకీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. లోటుకు, నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. వ్యవసాయ విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల టెండర్‌ను 107 శాతం అధికంగా ఇచ్చారని దానిపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మీటర్లను పెట్టవద్దని ఆదేశించాలని కోరారు. పీపీఏలను పునఃపరిశీలన చేయాలని సూచించారు.  


ప్రభుత్వ విధానాల వల్లే నష్టాలు

సీహెచ్‌ నరసింగరావు, సీపీఎం, విశాఖపట్నం

రాజశేఖర్‌రెడ్డి దాదాపుగా 20 ఏళ్లు...పీపీఏలను అసెంబ్లీలో వ్యతిరేకించారు. ఇప్పుడు సాంకేతిక విప్లవం వచ్చింది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతోంది. ధరలు తగ్గుతున్నాయి. అటువంటి సమయంలో 25 ఏళ్లకు పీపీఏ ఒప్పందాలు ఏపీ ప్రభుత్వం చేసుకోవడం అవినీతికి పెద్దపీట వేసినట్టే. వాటిని రద్దు చేయాలి. విశాఖపట్నంలోని హిందూజ కంపెనీ యూనిట్‌కు రూ.7 వసూలు చేస్తోంది. పీక్‌ లోడ్‌ పేరుతో అధిక ధరలకు విద్యుత్‌ కొంటున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఈపీడీసీఎల్‌కు నష్టాలు వస్తున్నాయి. పంపిణీ నష్టాలు ఎక్కువ వున్న ప్రాంతాల్లో ఎక్కువ చార్జీలు వసూలు చేయాలి. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.


మిగులు విద్యుత్‌ ఉంటే అదానీతో ఒప్పందం ఎందుకో...

లోకనాథం, సీపీఎం నాయకులు, విశాఖపట్నం.

విశాఖ ఏజెన్సీలో 200 గిరిజన గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్‌ సదుపాయం లేదు. పవన విద్యుత్‌ కాంట్రాక్టర్లపై మూడేళ్ల నిర్వహణ బాధ్యత ఉంది. కానీ వారు పట్టించుకోవడం లేదు. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌కు మీటర్లు పెడుతున్నారు. విద్యుత్‌ ఉచితం అయినా వాటి మీటర్లకు కోట్ల రూపాయలు వెచ్చించి కాంట్రాక్టర్లను పోషిస్తున్నారు. ఇది కూడా వినియోగదారులపైనే పడుతుంది. జీఓ నంబరు 91 ద్వారా ఎస్‌సీ, ఎస్‌టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. అమలు చేయడం లేదు. మిగులు విద్యుత్‌ ఉన్నప్పుడు అదానీతో ఒప్పందం ఎందుకో స్పష్టంచేయాలి.


200 యూనిట్లు వాడే వారిపై అధిక భారం

కె.వెంకటరమణ, వినియోగదారుల ఫెడరేషన్‌ అధ్యక్షులు

కొత్త ప్రతిపాదనల్లో నెలకు 200 యూనిట్లు వినియోగించే వారిపైనే అధిక భారం పడుతుంది. 300లోపు యూనిట్లు వినియోగించే వారిని దారిద్య్ర రేఖకు దిగువనున్నవారిగా గుర్తించి తెలుపు రేషన్‌ కార్డు ఇస్తుంటే...డిస్కమ్‌లు మాత్రం 30 యూనిట్లు వాడే వారినే పేదలుగా గుర్తించడం హాస్యాస్పదం. గత రెండేళ్లలో 2,432 కోట్లు విద్యుత్‌ కొనుగోళ్లలో ఆదా చేశామని చెప్పి ఇప్పుడు శ్లాబులను కుదించడం ఏమిటి. ఆర్థిక భారం కానున్న సబ్‌స్టేషన్ల ఆటోమేషన్‌ విరమించుకోవాలి. పంపిణీ నష్టాలు తగ్గించిన ఈపీడీసీఎల్‌లో వినియోగదారులకు తక్కువ టారిఫ్‌ విధించాలి 



Updated Date - 2022-01-25T06:36:57+05:30 IST