టీకాకు ఆటంకాలొద్దు

ABN , First Publish Date - 2021-06-13T08:59:07+05:30 IST

కొవిడ్‌ మహమ్మారిపై పోరులో కీలకమైన టీకాల విషయంలో ఆటంకాలొద్దని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కొవిడ్‌ సంబంధిత టెక్నాలజీ, టీకాలపై మేధో సంపత్తి హక్కులు-వాణిజ్య పరమైన అంశాల(ట్రిమ్స్‌)

టీకాకు ఆటంకాలొద్దు

మేధో సంపత్తి హక్కుల అవరోధాలు వద్దు

జీ-7 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 


న్యూఢిల్లీ, జూన్‌ 12: కొవిడ్‌ మహమ్మారిపై పోరులో కీలకమైన టీకాల విషయంలో ఆటంకాలొద్దని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కొవిడ్‌ సంబంధిత టెక్నాలజీ, టీకాలపై మేధో సంపత్తి హక్కులు-వాణిజ్య పరమైన అంశాల(ట్రిమ్స్‌) ఒప్పందాలు అడ్డు రాకూడదని అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రపంచంలో అందరికీ ఆరోగ్యం(వన్‌ ఎర్త్‌-వన్‌ హెల్త్‌) సాధ్యమవుతుందన్నారు. ఇంగ్లండ్‌లోని కార్నవాల్‌లో ప్రారంభమైన 3 రోజుల జీ-7 సమ్మిట్‌లో భాగంగా రెండో రోజు జరిగిన కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌ లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా ఆతిథ్య దేశాలుగా పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజల భాగస్వామ్యంతో తాము కొవిడ్‌ను ఎదుర్కొంటున్నామన్నారు. ‘‘భారత్‌ అందిపుచ్చుకున్న డిజిటల్‌ టెక్నాలజీతో మహమ్మారిని సమర్థంగా అడ్డుకుంటున్నాం.


టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌.. వ్యాక్సినేషన్‌కు డిజిటల్‌ టూల్స్‌ను వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో భారత్‌ గడించిన అనుభవాన్ని, నైపుణ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని భావిస్తున్నాం’’ అని చెప్పారు. కరోనా మహమ్మారిపై భారత్‌ పోరులో జీ-7 దేశాల సహకారాన్ని ఆయన కొనియాడారు. టీకాల విషయంలో మేధో సంపత్తి హక్కుల అడ్డంకిపై ఇప్పటికే భారత్‌, దక్షిణాఫ్రికాలు డబ్ల్యూటీవోను సంప్రదించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘కొవిడ్‌ సంబంధిత టెక్నాలజీపై ట్రిమ్స్‌ అడ్డును తొలగిస్తే.. వన్‌ ఎర్త్‌-వన్‌ హెల్త్‌ సాధ్యమవుతుంది. జీ-7 సమ్మిట్‌ కూడా ఇదే సం దేశాన్ని ఇవ్వాలి. భవిష్యత్‌లో వచ్చే మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ ఐక్యత, నాయకత్వం, సంఘీభావం అవసరం. ఆ బాధ్యత ప్రజాస్వామ్య, పారదర్శక సమాజాలపై ఉంది’’ అని మోదీ అన్నారు. కాగా.. జీ-7 సమ్మిట్‌ చివరి రోజైన ఆదివారం జరిగే 2 సెషన్లలో మోదీ ప్రసంగిస్తారు. నిజానికి ఆయన ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌ వెళ్లా ల్సి ఉన్నా.. భారత్‌లో సెకండ్‌వేవ్‌ ఉధృతి వల్ల రాలేనని జీ-7కు తెలిపారు. దాంతో ఇంగ్లండ్‌ ప్రధాని బోరీజాన్సన్‌ వర్చువల్‌గా పాల్గొనాల్సిందిగా కోరారు.

Updated Date - 2021-06-13T08:59:07+05:30 IST