ఎవరున్నా వదలొద్దు

ABN , First Publish Date - 2021-01-08T08:13:14+05:30 IST

రామతీర్థం ఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

ఎవరున్నా వదలొద్దు

  • కేసును సీరియ్‌సగా తీసుకోవాలి
  • రామతీర్థం ఘటనపై డీజీపీ ఆదేశం
  • ఆటోవాలాలపై పోలీసుల అనుమానం?
  • ఆలయంలో బిగించేందుకు కెమెరాలు,
  • ఎలక్ట్రికల్‌ సామగ్రి తెచ్చింది వీరే
  • సీఐడీ అదుపులో 10-12 మంది!
  • వారి కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు?

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రామతీర్థం ఘటన వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. తిరుపతిలో జరిగిన పోలీస్‌ డ్యూటీ మీట్‌ ముగించుకుని గురువారం సాయంత్రం మంగళగిరి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న ఆయన.. శాంతి భద్రతలు, సీఐడీ ఉన్నతాధికారులతో రామతీర్థం ఘటనపై సమీక్షించారు. కొండపై ఆలయంలో కెమెరాలు ఏర్పాటు చేయడానికి మూడు రోజుల ముందు రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనుక కుట్ర ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రధాన ఆలయంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని.. ఇటీవల జరుగుతోన్న ఆలయాల ఘటనల నేపథ్యంలో మరో 16 కెమెరాలు ఏర్పాటుకు నిర్ణయించారని, ఆ కెమెరాలు, ఇతర ఎలక్ట్రికల్‌ సామగ్రిని తీసుకొచ్చిన ఆటోవాలాలపై పోలీసులు సందేహపడుత్నుట్లు సమాచారం.


అయితే ఆధారాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పేర్లు వెల్లడించలేకపోతున్నామని కొందరు అధికారులు అన్నట్లు సమాచారం. అయితే ఎవరున్నా వదిలి పెట్టొద్దని, కేసును చాలా సీరియ్‌సగా తీసుకుని.. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేయాలని డీజీపీ సూచించినట్లు సమాచారం. రామతీర్థం ఘటనలో పురోగతి ఉందని, అయితే కుట్ర కోణమా..? ఇతర కారణాలు ఏమి ఉన్నాయి..? అనుమానితులు ఎవరెవరితో మాట్లాడారు.. ఉంటే ఎవరి ప్రోద్బలంతో ఈ పని చేస్తున్నారు..? అనే కోణంలో సీఐడీ ఆరా తీస్తున్నట్లు  సమాచారం. పది పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారని.. వారి కాల్‌ డేటా ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిసింది. రాష్ట్రంలో ఇతర ఆలయాల్లో జరిగిన ఘటనలపైనా డీజీపీ సమీక్షించినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా పరిటాలలోని కాళీమాత ఆలయం ఘటనలో బాధ్యుడిని అరెస్టు చేశామని, ఏలూరులో మద్యం షాపు దొంగతనం కోసం వినియోగించిన గ్రానైట్‌ హాక్సాబ్లేడ్‌నే ఇక్కడ కూడా వాడినట్లు తేలిందని పోలీసు అధికారులు వివరించారు. అక్కడి వేలి ముద్రలు ఇక్కడ కూడా సరిపోవడంతో అరెస్టు చేశామని, ఇందులో దొంగతనమే తప్ప కుట్రకోణం కనిపించలేదని వెల్లడించినట్లు తెలిసింది. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి ప్రాంతాల్లో జరిగిన ఆలయాల ఘటనలపై ప్రస్తుత పరిస్థితిని డీజీపీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.ఎక్కడికక్కడ పాత నేరస్థులు, ఆలయాల దొంగలు, ఇతర అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని శాంతిభద్రతల విభాగం అధికారులు సవాంగ్‌కు తెలియజేసినట్లు తెలిసింది.  కాగా.. తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్‌కు డీజీపీ నివేదించారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యులను వదిలిపెట్టొద్దని సీఎం ఆదేశించినట్లు సమాచారం.


పోలీసు అధికారులకు కేంద్రం నుంచి ఫోన్‌? 

‘చలో రామతీర్థం’ సందర్భంగా బీజేపీ నేతలు అక్కడకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్టు చేసిన వైనంపై కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్ర పోలీసు అధికారులకు ఫోన్‌ వచ్చినట్లు తెలిసింది. ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు, పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఇప్పటికే బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఫోన్లో మాట్లాడారు. అలాగే విశాఖలో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కాకుండా బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ను వైజాగ్‌ పోలీసులు అడ్డుకోవడంపై కేంద్ర హోం శాఖ రాష్ట్ర పోలీసులను వివరాలు అడిగినట్లు సమాచారం. అయితే కేంద్రం ఎలాంటి వివరాలు అడగలేదని శాంతిభద్రతల అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ మీడియాకు తెలిపారు.

Updated Date - 2021-01-08T08:13:14+05:30 IST