ఆక్రమణదారులను వదలం

ABN , First Publish Date - 2021-12-03T04:36:30+05:30 IST

జిల్లాలో ఎక్కడైన అటవీ భూములను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే ఆక్రమణదారులను వదిలే ప్రసక్తిలేదని, చట్ట విరుద్ధంగా కార్యకలపాలు చేపట్టే వారిపై కఠినంగా శిక్షిస్తామని, అవసరమైతే పీడీయాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ హెచ్చరించారు.

ఆక్రమణదారులను వదలం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

- అధికార వర్గాలపై దాడి చేస్తే ఎదురుదాడి చేస్తాం

- పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తాం

- లింగంపేట్‌ ఫారెస్ట్‌ ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

- ఇలాంటి ఘటనలు పునరావృత్తం కావొద్దు

- అర్హులైన వారందరికీ పోడు భూముల పట్టాలు ఇస్తాం

- జిల్లాలో 20వేలకు పైగా పోడు భూముల కోసం దరఖాస్తులు

- కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

- లింగంపేట ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం

- ఎస్పీ శ్వేతారెడ్డి

- జిల్లాలో ఐదుచోట్ల అటవీ భూములను కబ్జా చేసేందుకు యత్నించారు

- జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత


కామారెడ్డి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడైన అటవీ భూములను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే ఆక్రమణదారులను వదిలే ప్రసక్తిలేదని, చట్ట విరుద్ధంగా కార్యకలపాలు చేపట్టే వారిపై కఠినంగా శిక్షిస్తామని, అవసరమైతే పీడీయాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉండే అధికారులపై, ఉద్యోగులపై సిబ్బందిపై దాడులకు పాల్పడితే ఎదురుదాడికి సైతం తాము సిద్ధంగా ఉంటామని ఆయన హెచ్చరించారు. లింగంపేట ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్‌ ఉద్యోగులపై ఆక్రమణదారులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొందరు ఆక్రమణదారులు ఫారెస్ట్‌ భూములను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నారని అలాంటి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అనవసరంగా అటవీ భూములను ఆక్రమించుకుని తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కలెక్టర్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 29న లింగంపేట మండలం ముంబాజీపూర్‌ తండా శివారులోని అటవీ ప్రాంతంలో చెట్లను నరికి వేసి భూమిని చదును చేసేందుకు కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌లతో దున్నుతున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ ఉద్యోగులైన మహేష్‌, ఫిరోజ్‌ఖాన్‌లు అక్కడికి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆక్రమణదారులు ఎదురుదాడికి దిగి ఉద్యోగులపై దాడి చేశారని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఫారెస్టు ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈదాడికి పాల్పడిన వారిని పోలీసుశాఖ వెంటనే అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారని అన్నారు. నాలుగు ట్రాక్టర్లను సీజ్‌ చేశారని తెలిపారు. అటవీ చట్టాల ప్రకారం ఫారెస్ట్‌ భూములను ఆక్రమించినా, చెట్లను నరికినా కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం ఉందని అన్నారు. అటవీ భూములను కబ్జా చేయడం చాలా నేరమని అన్నారు. అటవీ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, పోలీసుశాఖల సమన్వయంతో అటవీ భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో అటవీహక్కుల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా వృక్ష సంపదను కాపాడుకునేందుకు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయినప్పటికీ కొందరు ఆక్రమణదారులు అటవీ సంపదను కొల్లగొడుతూ భూములను ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న అటవీసంపదను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. కొవిడ్‌ సమయంలో ఆక్సిజన్‌ లేక చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని అలాంటప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే చెట్లను, మొక్కలను, అటవీ సంపదను కొల్లగొట్టడం ఆక్రమణదారులకు తగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొందరు ఆక్రమణదారులు అత్యాశకు పోయి అటవీ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ ఆక్రమణదారుల్లో చాలా మంది యువకులు ఉండడం బాధాకరమని అన్నారు. ప్రస్తుత అటవీ చట్టాల ప్రకారం ఫారెస్ట్‌ భూములను ఆక్రమించే క్రమంలో కేసులు నమోదయితే వారి భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తున్నారనే భావనతో జిల్లాలోని కొన్ని గ్రామాలు సైతం అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అటవీ భూముల ఆక్రమణకు పాల్పడే ఎంతటివారినైన కఠినంగా శిక్షిస్తామని చివరకు గ్రామంలోని అందరిపైన కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. జిల్లాలో పోడు భూముల కోసం ఇప్పటి వరకు 20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డాటా ఎంట్రీ చేస్తున్నామని అన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులుగా ఉన్న వారందరికీ పోడు భూముల పట్టాలు అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు.


ఐదుగురిని అరెస్టు చేశాం.. మరొక్కరు పరారీలో ఉన్నారు

- ఎస్పీ శ్వేతారెడ్డి

లింగంపేట మండలం ముంబాజీతండా శివారులోని అటవీ ప్రాంతంలో ఈ నెల 29న అర్ధరాత్రి ఫారెస్ట్‌ భూములను ఆక్రమించి ట్రాక్టర్లతో దున్నుతున్న ఆక్రమణదారులను అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు వెళ్లగా వారిపై ఎదురుదాడిచేసి తీవ్రంగా గాయపరిచారని. దాడికి పాల్పడిన ఆరుగురిని గుర్తించడం జరిగిందన్నారు. వీరిపై మూడు సెక్షన్‌ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. ఈ ఆరుగురిలో ఐదుగురిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని అన్నారు. అరెస్ట్‌ అయిన వారిలో ముంబాజీ తండాకు చెందిన దండుగుల హన్మంత్‌, గుర్రపు చిన్నోల్ల సాయిలు, గాంధారి మండలం చిన్నాపూర్‌ గ్రామానికి చెందిన సంపంగి లక్ష్మయ్య, సంపంగి లవన్‌కుమార్‌, సంపంగి నాగేష్‌లను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌ చేశామన్నారు. మరొకరు సంపంగి పోచయ్య పరారీలో ఉన్నారని అన్నారు. అటవీ హక్కుల చట్టాలు కఠినంగా ఉన్నాయని ఎవరుకూడా అటవీ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించవద్దని అన్నారు. అటవీ భూములను ఆక్రమించుకున్నా.. విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్‌ అధికారులపై దాడులకు పాల్పడితే పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేస్తామని అన్నారు. అటవీ భూముల పరిరక్షణకు పోలీసుశాఖ నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేశామని అన్నారు.


జిల్లాలో ఐదు చోట్ల అటవీ భూములను ఆక్రమించారు

- జిల్లా అటవీశాఖాధికారి నిఖిత

రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో జిల్లాలో కొందరు ఆక్రమణదారులు అటవీ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత అన్నారు. ఇటీవల కాలంలో ఇప్పటి వరకు ఐదుచోట్ల ఫారెస్ట్‌ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని అన్నారు. నస్రూల్లాబాద్‌, లింగంపేట్‌, పిట్లం, గాంధారి, చద్మల్‌తండాలో ఒక్కో ప్రాంతంలో ఒక హెక్టార్‌ వరకు అటవీ భూములను కబ్జాచేసి చెట్లను నరికి వేసి భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ ఆక్రమణలను అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది ప్రయత్నించగా ఆక్రమణదారులు ఎదురుదాడులకు దిగుతున్నారని అన్నారు. లింగంపేటలో జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తారన్న ఉద్దేశ్యంతో కొందరు అటవీ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అటవీహక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబరు 5 కన్న ముందు పోడు భూముల్లో సాగు చేస్తున్న వారు మాత్రమే అర్హులు అని అన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. వారు మాత్రమే లబ్ధిదారులు అవుతారని అన్నారు. తర్వాత ఎవరు అటవీ భూముల్లో సాగు చేసినా ఆక్రమణలకు పాల్పడినా అర్హులుకారని ఆమె తెలిపారు.

Updated Date - 2021-12-03T04:36:30+05:30 IST