Kuwait లో నర్సుల రిక్రూట్‌మెంట్‌పై Indian Embassy కీలక సూచన.. ఎట్టిపరిస్థితిలో అలా చేయకండంటూ..

ABN , First Publish Date - 2021-09-30T19:49:53+05:30 IST

కువైత్‌లో భారత నర్సుల నియామకాలపై రాయబారి సిబి జార్జ్ తాజాగా కీలక సూచన చేశారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా మాత్రమే రిక్రూటర్లకు ఫీజు చెల్లించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితిలో అదనంగా ఎవరికీ రూపాయి కూడా చెల్లించ వద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంబసీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఓపెన్ హౌస్...

Kuwait లో నర్సుల రిక్రూట్‌మెంట్‌పై Indian Embassy కీలక సూచన.. ఎట్టిపరిస్థితిలో అలా చేయకండంటూ..

కువైత్ సిటీ: కువైత్‌లో భారత నర్సుల నియామకాలపై రాయబారి సిబి జార్జ్ తాజాగా కీలక సూచన చేశారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా మాత్రమే రిక్రూటర్లకు ఫీజు చెల్లించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితిలో అదనంగా ఎవరికీ రూపాయి కూడా చెల్లించ వద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంబసీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో అంబాసిడర్ వెల్లడించారు. నోటిఫికేషన్‌ ప్రకారం రిక్రూటర్లు కేవలం రూ.30వేల వరకు మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనికి అదనంగా ఎవరైనా అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్క రూపాయి అదనంగా తీసుకున్న అదే స్కామ్ కిందికి వస్తుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ నియామకాల ప్రక్రియను ఆరోగ్యశాఖ సహాయంతో నేరుగా నిర్వహించే విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నారు.


అలాగే భారత్ నుంచి కువైత్‌ నియమించుకునే డొమెస్టిక్ వర్కర్ల రిక్రూట్‌మెంట్ రుసుమును కూడా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇక నిన్న జరిగిన ఓపెన్ హౌస్ సమావేశంలో పలు సంస్థల ప్రతినిధులతో పాటు కువైత్ ఆరోగ్యశాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కువైత్‌లో భారత నర్సుల నియామకాలపై అధికారులతో రాయబారి చర్చించారు. వారు కూడా నర్సుల రిక్రూట్‌మెంట్ విషయంలో భారత ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే రిక్రూటర్లు తీసుకోవడం జరుగుతుందని, దానికి అదనంగా ఎవరు అడిగిన అది స్కామ్ అవుతుందని అధికారులు చెప్పినట్లు సిబి జార్జ్ తెలిపారు. కనుక అభ్యర్థులు ఎట్టిపరిస్థితిలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ ఎవరైన అలా అదనంగా అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.          

Updated Date - 2021-09-30T19:49:53+05:30 IST