Abn logo
Nov 26 2020 @ 17:29PM

రైతుల జీవితాలతో ఆడుకోవద్దు : హర్యానా సీఎం ఖత్తార్

న్యూఢిల్లీ : చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ హెచ్చరించారు. అబద్ధాలు, మోసాలు, మాయదారి ప్రచారాలకు కాలం చెల్లిందన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విషయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలపై నిరసన తెలిపేందుకు పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి తరలి వస్తున్న నేపథ్యంలో మనోహర్ లాల్ ఖత్తార్ ట్విటర్ వేదికగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై విమర్శలు గుప్పించారు. 


‘‘మీ మోసాలు, అబద్ధాలు, ప్రచారానికి సమయం మించిపోయింది. మీ నిజ రూపాలను ప్రజలను చూడనివ్వండి. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రజల జీవితాలను అపాయంలోకి నెట్టడం దయచేసి మానుకోండి. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. కనీసం మహమ్మారి సమయంలో చౌకబారు రాజకీయాలు మానుకోండి’’ అని ఓ ట్వీట్‌లో ఖత్తార్ పేర్కొన్నారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో మాట్లాడటం కోసం మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నట్లు ఖత్తార్ మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు. తనతో మాట్లాడకూడదని సింగ్ నిర్ణయించుకున్నారని, రైతు సమస్యలపై ఆయనకు ఉన్న శ్రద్ధ ఇదేనా? అని ప్రశ్నించారు. కెప్టెన్ సింగ్ కేవలం ట్వీట్లు ఇస్తున్నారని, చర్చలకు రాకుండా పారిపోతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయోత్పత్తులకు ఎంఎస్‌పీ విషయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో చెప్పానని, అదే విషయాన్ని మరొకసారి చెప్తున్నానని అన్నారు. అమాయకులైన రైతులను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. 


ఇదిలావుండగా, ఢిల్లీ వెళ్తున్న రైతులను నిలువరించేందుకు హర్యానా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. రైతులు ఢిల్లీ వెళ్ళకుండా ఆపవద్దని కోరారు. 


Advertisement
Advertisement
Advertisement