వ్యాక్సిన్‌ వాయుదా వద్దు

ABN , First Publish Date - 2020-08-25T05:30:00+05:30 IST

‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నివేదిక ప్రకారం ఈ లాక్‌డౌన్‌ సమయంలో వ్యాక్సిన్లు వేయించుకునే చిన్నారుల

వ్యాక్సిన్‌ వాయుదా వద్దు

‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నివేదిక ప్రకారం ఈ లాక్‌డౌన్‌ సమయంలో వ్యాక్సిన్లు వేయించుకునే చిన్నారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనివల్ల దాదాపు కనుమరుగైన గొంతువాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో వంటివి తిరిగి పుంజుకొనే ప్రమాదం ఉందని ‘డబ్ల్యు.హెచ్‌.ఒ’ స్పష్టం చేసింది. కాబట్టి కరోనాను మించిన భయానక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే తల్లితండ్రులు పిల్లలకు తప్పక వ్యాక్సిన్లు వేయించాలి.


వదిలేస్తే ఎన్నో సమస్యలు... 

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎంతగా ఎదురుచూస్తుందో అందరికీ తెలిసిందే! ఇంతలా వ్యాక్సీన్‌ కోసం ఎదురుచూడడానికి కారణం, కరోనా మహమ్మారి నుంచి శాశ్వత విముక్తి పొందడం కోసమే! అలాంటప్పుడు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఇతర వ్యాక్సిన్లను వేయించుకోకపోవడం ఎంతవరకూ సమంజసం?

ఉదాహరణకు.. పొంగు, తట్టుకు సంబంధించిన వ్యాక్సిన్లు వేయించకపోతే, పిల్లల్లో నెమ్ము, ఆకలి లేకపోవడం, నరాల బలహీనతల వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్నిసార్లు మెదడు మీదా ప్రభావం పడుతుంది. మరికొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగానూ పరిణమిస్తాయి. కాబట్టి తల్లితండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. 


భయం వద్దు!

ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కనుక భయపడాల్సిందేమీ లేదు. వ్యాక్సిన్ల తరువాత ఇచ్చే బూస్టర్‌ డోస్‌లు కూడా క్రమం తప్పకుండా నిర్దేశిత సమయానికి వేయించాలి.

ముఖ్యంగా ఏడాది లోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. బూస్టర్‌ డోస్‌లు అవసరం లేదని కొంతమంది భావిస్తారు. కానీ అది సరైంది కాదు. మొదటిసారి వ్యాక్సినేషన్‌ వల్ల శరీరం రోగనిరోధక శక్తిని సంతరించుకొంటుంది. దానికి బూస్టర్లు ఇస్తే... అది జీవితకాలం కొనసాగుతుంది. 


ముందు... తరువాత!

మీరు వెళ్లదలుచుకున్న ఆసుపత్రికి కాల్‌ చేసి మీ పిల్లల చార్ట్‌లో పేర్కొన్న వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందో లేదో కనుక్కోండి. కరోనా వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సిన్‌ కేంద్రంలో/ ఆసుపత్రిలో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారో అడగండి. వాళ్ళు ఇచ్చిన సమాచారం మీకు సంతృప్తికరంగా ఉంటేనే అక్కడకు వెళ్లండి.

పిల్లల్ని తీసుకువెళ్లేటప్పుడు పెద్దవారు తప్పనిసరిగా ‘ఎస్‌ఎంఎస్‌’ (భౌతిక దూరం, మాస్క్‌, శానిటైజేషన్‌) పాటించాలి. రెండేళ్ల లోపు పిల్లలకు మాస్క్‌లు పెట్టకూడదని గుర్తుంచుకోండి. కానీ, భౌతిక దూరం పాటిస్తూ వారిని సంరక్షించుకోవాలి. సాధారణంగా వ్యాక్సిన్‌ వేసిన వెంటనే 20 నిమిషాలపాటు పిల్లలను అబ్జర్వేషన్‌లో పెడతారు. వ్యాక్సినేషన్‌ తరువాత 24 గంటల్లో జ్వరం వస్తే భయపడక్కర్లేదు. ఒకవేళ 48 గంటల తరువాత కూడా జ్వరం తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రతించాలి.





    • ఇమ్యూనైజేషన్‌ చార్ట్‌!

    • పుట్టగానే: హెపటైటిస్‌-బి (కామెర్లు), బీసీజీ (టీబీ), ఓపీవీ/ఐపీవీ (పోలియో)

    • 6 వారాలకు: డీటీపీ (గొంతువాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం), ఓపీవీ/ ఐపీవీ, రోటా వైరస్‌ (నీళ్ల విరేచనాలు), న్యుమనోకోకల్‌ (మెదడువాపు, నిమ్ము), హెపటైటిస్‌-బి

    • 10 వారాలకు: డీటీపీ, ఓపీవీ/ఐపీవీ, రోటా వైరస్‌, న్యుమనోకోకల్‌

    • 14 వారాలకు: డీటీపీ, ఐపీవీ, రోటా వైరస్‌, న్యుమనోకోకల్‌

    • 6 నెలలకు: హెపటైటిస్‌-బి, ఓపీవీ 

    • 9 నెలలకు: ఎంఎంఆర్‌ (అమ్మవారు/పొంగు/తట్టు), ఓపీవీ 

    • 12 నెలలకు: న్యుమనోకోకల్‌, హెపటైటిస్‌-ఎ

    • 15 నెలలకు: ఎంఎంఆర్‌- బూస్టర్‌, చికెన్‌ పాక్స్‌ 

    • 18 నెలలకు: డీటీపీ- బూస్టర్‌, ఓపీవీ/ఐపీవీ, హెపటైటిస్‌-ఎ 

    • 2వ సంవత్సరం: టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌  

    • 3వ సంవత్సరం: ఎంఎంఆర్‌- బూస్టర్‌, చికెన్‌పాక్స్‌- బూస్టర్‌ 



    • 5వ ఏడు: డీటీపీ- బూస్టర్‌, ఓపీవీ, టైఫాయిడ్‌ 

    • 8వ సంవత్సరం: టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ 

    • 10వ సంవత్సరం: డీడీఏపీ/టీడీ

    • - డాక్టర్‌ లక్ష్మీ వేదప్రకాష్‌
    • కన్సల్టెంట్‌ నియో నాటాలజిస్ట్‌ అండ్‌ పిడియాట్రీషియన్‌,
    • రెయిన్‌బో చిల్ట్రన్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌ 

Updated Date - 2020-08-25T05:30:00+05:30 IST