ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోరా?

ABN , First Publish Date - 2020-06-07T06:36:40+05:30 IST

‘గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉంది. ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం

ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోరా?

భయంగా ఉంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోండి

పంపిణీకి ఇళ్ల పట్టాలు సిద్ధం చేయండి: స్పీకర్‌ తమ్మినేని


పొందూరు, జూన్‌ 6: ‘గ్రామాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణల్లో ఉంది. ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నార’ంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఇళ్ల పట్టాలకు భూమి సేకరణలో విఫలమవుతున్నారని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని లైదాం రెల్లిగెడ్డలో జరుగుతున్న ఎత్తిపోతల పథకం పనులను శనివారం ఆయన  పరిశీలించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల పట్టాల కోసం గ్రామాల్లో ఆక్రమణలో ఉన్న భూమిని సేకరించాలని ఆదేశించినా ఇంతవరకు ఎందుకు ఆ పని చేయలేదని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ‘భయం ఉంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోవాల’ని సర్వేయర్‌ తులసిగణపతిపై మండిపడ్డారు. గ్రామాల్లో  పట్టాల పంపిణీకి తానే స్వయంగా వస్తానని... అప్పటికి ఆ భూముల్లో పట్టాలు సిద్ధం కావాలని ఆదేశించారు. 


తండ్యాం ఎత్తిపోతలకు ప్రతిపాదనలు

 రాష్ట్రంలో రైతుల ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పీకర్‌ సీతారాం అన్నారు. లైదాం రెల్లిగెడ్డలో  ఎత్తిపోతల పఽథకం పనులు పూర్తయితే ఆరు గ్రామాల్లో 1,250 మంది రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయని చెప్పారు. త్వరలో  రెల్లిగెడ్డలో తండ్యాం ఎత్తిపోతల పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని చెప్పారు.


సాగునీటి ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి వేలకోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రతిపక్షాలు వీటిని అడ్డుకునేందుకు ముందుకువెళ్లడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పప్పల రమణమూర్తి, సువ్వారి గాంధీ, లోలుగు శ్రీరాములునాయుడు, నాయకులు జి.మోహన్‌, జి.నాగరాజు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T06:36:40+05:30 IST