సంతకం చేయొద్దు

ABN , First Publish Date - 2020-09-24T07:20:57+05:30 IST

దేశవ్యాప్తం గా తీవ్ర దుమారం రేపిన 3 సాగు బిల్లులను ఆమోదించొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను 18 ప్రతిపక్షాలు కోరాయి.

సంతకం చేయొద్దు

సాగు బిల్లులపై రాష్ట్రపతికి 18 పార్టీల మొర

విపక్షాన్ని విస్మరించిన సర్కార్‌

10 రోజుల్లోనే సమావేశాల ముగింపు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తం గా తీవ్ర దుమారం రేపిన 3 సాగు బిల్లులను ఆమోదించొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను 18 ప్రతిపక్షాలు కోరాయి. రాజ్యాంగ విరుద్ధంగా, పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాసి తెచ్చిన ఈ బిల్లులపై సంతకం చేయొద్దని అభ్యర్థించాయి. అన్ని పార్టీల తరఫున రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ రాష్ట్రపతిని కలిసి బిల్లులు తెచ్చిన తీరును, రాజ్యసభలో ప్రభుత్వ ‘రాజ్యాంగ-వ్యతిరేక’ విధానాన్ని వివరించారు. ‘‘ప్రతిపక్షాలు 5తీర్మానాలు ప్రవేశపెట్టాయి. బిల్లులను స్థాయీ సంఘానికి పంపాలని కోరాయి. డివిజన్‌ను కోరాం. ఏ బిల్లుపైనైనా ఒక్క సభ్యుడు ఓటింగ్‌ కోరినా సభాపతి మన్నించాలి. మా తీర్మానాలన్నింటినీ ఏకపక్షంగా తిరస్కరించారు.


దేశ రైతాంగానికి ఎనలేని నష్టాన్ని మిగిల్చే ఈ బిల్లులను మేధావులు కూడా తప్పుబట్టారు.’ అని ఆయనకు తెలిపారు. ‘‘రాష్ట్రపతి నేను చెప్పినదం తా ఓపిగ్గా విన్నారు. మా వాదన పరిశీలిస్తామన్నారు’ అని ఆజాద్‌ మీడియాకు చెప్పారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, జేడీఎస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌(మణి), లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ పార్టీలు సోమవారం నాడే ఇందుకు సంబంధించిన ఓ విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతి కార్యాలయంలో అందజేశాయి. 


సమావేశాల కుదింపు

ఇటీవల కాలంలో ఎన్నడూ జరగని రీతిలో పార్లమెంట్‌ సమావేశాలు అర్థంతరంగా ముగిశాయి. 18 రోజులు జరుగుతాయనుకున్న వర్షాకాల సమావేశాలు ప్రభుత్వం తన ఎజెండాను ఆగమేఘాలతో ముగించుకోవడంతో 10 రోజులకే ముగిశాయి. అందులో రెండ్రోజులు విపక్షాల బహిష్కరణ నడుమ సాగాయి. ఈ నెల 14 నుంచి ఉభయ సభలు రోజూ చెరో 4 గంటల పాటు సమావేశమైనప్పటికీ ఈ 10 రోజుల్లోనే ప్రభుత్వం  25 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. 


 రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై విపక్షాల ఆగ్రహావేశాలు, 8మంది ఎంపీలపై వేటు, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, ప్రతిపక్ష సభ్యులు సమావేశాలను బహిష్కరించడం మొదలైన వాటితో సమావేశాలు అట్టుడికాయి. ప్రతిపక్ష బాయ్‌కాట్‌ నడుమే ప్రభుత్వం మంగళవారం ఒక్క రోజే రాజ్యసభలో 7కీలక బిల్లులను ఆమోదించింది. బుధవారమూ పెద్దల సభలో అత్యంత కీలకమైన కార్మిక నియమ బిల్లులు(లేబర్‌ కోడ్స్‌), విదేశీ విరాళాల సవరణ సహా మరో 8 బిల్లులను ఆమోదించారు. లోక్‌సభ సాయంత్రం 6 గంటలకు సమావేశమై రెండున్నర గంటల్లోనే ముగిసిపోయింది. చివరి రోజు మేజర్‌ పోర్ట్స్‌ బిల్లును ప్రవేశపెట్టి ప్రధాని మోదీ వస్తున్నారని తెలియగానే 10నిమిషాల్లోనే బిల్లుపై చర్చ ముగించి ఆమోదించారు. ఆయన వచ్చిన కొద్దిసేపటికే లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడింది. చివరి 2 రోజుల్లోనే పార్లమెంట్‌ 15బిల్లులను ఆమోదించడం గమనార్హం.


కొవిడ్‌ నిబంధనల వల్ల చరిత్రలో తొలిసారి రెండు సభల సభ్యులూ ఉభయసభల్లోనూ కూర్చుని, సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ‘‘లెజిస్లేటివ్‌ కార్యకలాపాలు 67ు, నాన్‌-లెజిస్లేటివ్‌ బిజినెస్‌ 32ు జరిగాయి. అనేక ముఖ్య బిల్లులు ఆమోదం పొందడం ఓ రికార్డు’’ అని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేటు మెంబర్లకిచ్చే సమయం రద్దు చేశారు. లిఖిత పూర్వక సమాధానాలు కోరుతూ 2300 ప్రశ్నలు వచ్చాయి. 


11 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు

నవంబరులో రిటైర్‌ కానున్న 11 మంది ఎంపీలకు రాజ్యసభ బుధవారం వీడ్కోలు పలికింది. వీరంతా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 


పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా

ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ సహా వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన సభ్యులు లోక్‌సభను కూడా బహిష్కరించి పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహం వద్దకు ఊరేగింపు నిర్వహించారు. రైతులను, కార్మికులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడా లన్న నినాదాల ప్లకార్డులతో మార్చ్‌ చేశారు.  టీఆర్‌ఎస్‌ సభ్యులు విడిగా గాంధీ విగ్రహం వద్ద కూడా ధర్నా నిర్వహించారు. ప్రతిపక్ష సభ్యులు లేనందున కార్మికులకు సంబంధించిన బిల్లులను ఆమోదించొద్దని విపక్ష పార్టీల ఎంపీలు రాసిన లేఖను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తిరస్కరించారు.ఈ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని పార్లమెంటు పూర్తిగా విస్మరించిందన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. లోక్‌సభలో ఆధిక్యత ఉండడంతో బిల్లులన్నింటికీ ఏకపక్షంగా ఆమో దించుకున్న సర్కారు రాజ్యసభలో కొంత ప్రతికూలత ఎదుర్కొంది. సభా నియమాలను కాలరాసి ఈ బిల్లులను ఎగువసభలో ఆమోదింపజేసుకుందన్న తీవ్రారోపణలను ఎదుర్కొంది. సాగు బిల్లులు విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమవుతాయన్న సంకేతాలు వెలువడుతున్నా యి. బిహార్‌, బెంగాల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్కారు వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్లులకు అనుగుణంగా బీజేపీ కూడా భారీఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. మిత్రపక్షాలు అకాళీదళ్‌, అన్నాడీఎంకే వ్యతిరేకతతో బీజేపీ ప్రతికూలతను ఎదుర్కొనే అవకాశముంది. 

Updated Date - 2020-09-24T07:20:57+05:30 IST