Abn logo
Sep 25 2021 @ 00:19AM

వరివద్దు

లోకేశ్వరం మండలంలోని విఠోలి గ్రామంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాఽధికారులు

రబీలో వరి వద్దంటూ ఊరూరా ప్రచారం 

ఈ నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు 

క్లస్టర్‌ల వారీ చైతన్య సదస్సులు 

వరికి బదులుగా పప్పు, చిరుధాన్యాల సాగుచేపట్టాలని సూచన 

నిర్మల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : రాబోయే రబీసీజన్‌లో వరిపంటసాగును చేపట్టవద్దని ఆ పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలైనా పప్పు , చిరుధాన్యాలు నూనెగింజల పంటలను సాగు చే యాలన్న ప్రచారం పల్లెల్లో హోరెత్తుతోంది. ప్రభు త్వం రబీసీజన్‌లో వరిసాగును పూర్తిస్థాయిలో ని యంత్రించేందు కోసం  ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను రూ పొందించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఈ నెల 30 వరకు జిల్లాలోని 79 క్లస్టర్‌ల వారీగా ప్రచారం మొదలుపెట్టారు. రైతువేదికల్లో క్లస్టర్‌ రైతులందరినీ సమీకరించి సంబంధిత ఏఈఓలు ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా రబీసీజన్‌లో బోరుబావుల కింద వరి ఎక్కువగా సాగవుతోంది. జిల్లాలో చెరువులు, ప్రాజెక్ట్‌ల పరిధిలోని కాలువల కింద వరిపంట సాగవుతున్నప్పటికీ ముఖ్యంగా రబీలో మాత్రం అత్యధికం గా బోరుబావులపైనే రైతులు ఆధారపడి వరి పంటను సాగుచేస్తున్నారు. జిల్లాలో  భూగర్బ జలా లనిల్వలు పుష్కలంగా ఉండడం, దీనికి తోడుగా ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తుండడంతో రైతులు రబీలో కూడా వరి వైపే మొగ్గు చూపుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వరిధాన్యం సాగువిస్తీర్ణం పెరిగిపోవడం, దానికి అనుగుణంగా కుప్పలు తెప్పలుగా దిగుబడులు వస్తున్న కారణంగా ఆ పంటను కొనుగోలు చేయడం, తరువాత నిల్వ చేయడం లాంటి వ్యవహారాలన్నీ యంత్రాంగానికి కత్తి మీద సాములా మారుతున్నాయి. ప్రతియేటా దిగుబడులు పెరుగుతున్న కారణంగా ఽధాన్యం కొనుగోలు వ్యవహారం ఎఫ్‌సీఐకి భారంగా మారుతోంది. అయితే రబీలో ధాన్యాన్ని కొనుగోలు చేయలేమంటూ ఇటీవలే ఎఫ్‌సీఐ రాష్ట్ర సర్కారుకు స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకొని రైతులను వరిసాగు చేయవద్దంటూ కోరుతోంది. ఈ విషయంలో ఏకంగా సీఎం కేసీఆర్‌ వరి సాగుచేస్తే ఉరి తప్పదన్న సంకేతాలను సైతం పంపడంతో అధికార యంత్రాంగమంతా ఈ దిశగానే దృష్టి కేంద్రీకరించింది. ముందుగానే రైతులను రబీ సాగు విషయంలో మరింత అప్రమత్తం చేసి వారిలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా వారంతా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించే విధంగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం గానూ క్లస్టర్‌ల వారీగా రబీలో పెద్ద ఎత్తున వరి పంటను సాగుచేయవద్దంటూ ప్రచారం మొదలు పెట్టింది. సంబంధిత క్లస్టర్‌ల ఏఈఓలు తమ వద్ద ఉన్న రైతుల రికార్డుల ఆధారంగా ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా కూడా వరిధాన్యం సాగు ప్రతికూలతలపై వివరిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు క్లస్టర్‌ల వారీగానే కాకుండా గ్రామపంచాయతీల వారీగా కూడా వరి పంటసాగు నియంత్రణఫై అవగాహన కల్పించబోతున్నారు. 

జిల్లాలో బోరు బావులే ఎక్కువ ఆధారం

ఇదిలా ఉండగా ప్రతి రబీసీజన్‌లో జిల్లా రైతులు ఎక్కువగా బోరు బావులపైనే ఆధారపడి వరి ధాన్యాన్ని సాగుచేస్తుంటారు. మొదట్లోవరితో పాటు మొక్కజొన్నపంటకు కూడా ప్రాధాన్యతనిచ్చే వారు. నియంత్రిత వ్యవసాయసాగు విధానంలో ప్రభుత్వం మొక్కజొన్నసాగుకు అడ్డుకట్ట వేసింది. అధికారికంగా మద్ద తుధర చెల్లింపు విషయంలో గాని ఇక నుంచి ప్రభు త్వ జోక్యం ఉండబోదని, ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కజొన్నసాగును పూర్తిగా తగ్గించాలంటూ హెచ్చరించింది. దీంతో రైతులు మొక్కజొన్న పంటసాగును తగ్గించి వరి వైపే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం  45వేల నుంచి 50 వేల ఎకరాల వరకు బోరుబావులపైనే ఆధారపడి రబీలో వరిపంటను సాగుచేస్తుంటారు. అలాగే రబీలో చెరువుల కింద 30వేల ఎకరాలు, ప్రాజెక్ట్‌ల కింద 40వేల ఎకరాల వరిసాగు చేపడతారు. దాదా పు 1.20లక్షల వరకు రబీలో వరిపంట సాగవుతోంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో పాటు ఉచి త విద్యుత్‌ తోడుగా నిలుస్తున్న కారణంగా బోరు బావులపై ఆధారపడి సాగుచేస్తున్న రైతులు వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రబీసీజన్‌లో రైతులను గందరగోళానికి గురి చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇక్కడి భూసారం ఆధారంగా రైతులు పండించే వరిసాగు అత్యధిక దిగుబడులనిస్తున్నట్లు చెబుతున్నారు. పొలాల్లో వరి తప్ప ఇతర పంటలను సాగు చేయడం సాహసమే కావచ్చన్న అబిప్రాయంలో రైతులున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలపై విసృత ప్రచారం

కాగా రబీసీజన్‌లో వరిపంటలను సాగు చేయవద్దంటున్న అధికారులు ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, నువ్వులు, వేరుశనగలతో పాటు చిరు ధాన్యాలను సాగుచేయాలంటూ సూచిస్తున్నారు. దీని కోసం గానూ ప్రజలకు అవగాహన కల్పించడమే మార్గమని యంత్రాంగం భావించింది. అందుకు అ నుగుణంగా జిల్లాలోని 79 క్లస్టర్‌నలు అప్రమత్తం చేసింది. సంబంధిత క్లస్టర్‌ల ఏఈఓలంతా రైతువేదికలను అడ్డగా చేసుకొని దీనిపై విసృత ప్రచారం కొనసాగిస్తున్నారు. రైతు సమన్వయ సమితిలతో పాటు గ్రామాల్లోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులందరినీ ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. వరిసాగుతో జరిగే న ష్టాన్ని వివరిస్తూ రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలంటూ సూచిస్తున్నారు. 

గందరగోళం తప్పదా ! 

గత కొన్ని సంవత్సరాల నుంచి జిల్లాలో ప్రతి ఖరీఫ్‌, రబీసీజన్‌లకు గాను రైతులు వరిపంట సాగు కే మొగ్గు చూపుతుంటారు. కొంతకాలం నుంచి ప్రభు త్వం గిట్టుబాటు ధర, కొనుగోలు ప్రక్రియ చేపట్టడంతో రైతులు ఈ పంటసాగుకే ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో దళారులకు ధాన్యాన్ని విక్రయించుకునే రైతులు కొంతకాలం నుంచి సర్కారు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధరతో ఽధాన్యాన్ని విక్రయిస్తూ ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. కొనుగోలు వ్యవహారం దాదాపుగా తగ్గిపోయింది. మొదట ప్రభుత్వం మొక్కజొన్న పంట సాగుకు అడ్డుకట్ట వేయగా ప్రస్తుతం రబీలో వరి పంట సాగుకు బ్రేక్‌ వేయడం రైతులను  గందరగోళానికి గురి చేసే అవకాశం ఉందంటున్నారు. సాంప్రదాయ పంటలసాగుకు అలవాటు పడ్డ రైతులు ఒక్కసారి ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా చేపడతారన్న సంశయాలు మొదలవుతున్నాయి. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె దినుసు పంటలను ఇక్కడి పొలాల్లో సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతారో లేదోనన్న సంషయాలు నెలకొంటున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌కు గానూ వరి పంటసాగు ప్రక్రియలో నిమగ్నమైన రైతులు రబీసీజన్‌పై ఇప్పటి  నుంచే మానసికంగా సిద్ధం కావాల్సిన పరిస్థితులు తలెత్తుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.