Abn logo
Sep 25 2021 @ 01:28AM

సహనాన్ని పిరికితనంగా భావించ వద్దు

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

-  టీఆర్‌ఎస్‌కు వత్తాసు పలుకుతున్న పోలీసులు 

-  రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే 

- ముఖ్యమంత్రి మెడలు వంచైనా ప్రతి గింజ కొనేలా చేస్తాం

 - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

- ముస్తాబాద్‌లో ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల/ ముస్తాబాద్‌ )

‘పోలీసులు మా  సహనాన్ని పిరికితనంగా భావించ వద్దు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సభ పెట్టగలం. సమస్యలు చెప్పుకోడానికి వస్తే కేసులు పెడతారా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలంలో కొనసాగింది. యాత్రలో కేంద్ర రైల్వే బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్‌ దాదారావు ధన్వే పాటిల్‌,  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో కలిసి  ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ముస్తాబాద్‌ మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక వ్యక్తిపై 18 కేసులు పెట్టారనీ,  రౌడీషీట్‌ తెరుస్తామని బెదిరిస్తున్నారనీ,  అట్లా చేస్తే తానే పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైఠాయిస్తాననీ హెచ్చరించారు.  పోలీసులు టీఆర్‌ఎస్‌కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారన్నారు. జెండాలు, ఫ్లెక్సీలు పీకితే భయపడబోమని, వాటితో అధికారంలోకి రావలనుకోవడం లేదని అన్నారు. ప్రజల గుండెల్లో నుంచి అధికారంలోకి రావాలనుకుంటున్నామని అన్నారు. బీజేపీ నేత రామకృష్ణ, హనుమంతు, జితేందర్‌రెడ్డిని చంపుదామని నక్సలైట్లు బెదిరిస్తే పారిపోలేదని ఇక్కడే ఉండి బీజేపీ జెండా పట్టుకొని పని చేశారని అన్నారు. దేశం కోసం, కాషాయ జెండా కోసం జితేందర్‌ ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఉంటే కేంద్రంలో బీజేపీ పాలన ఉందనేది మర్చిపోవద్దన్నారు.  పోలీసులు, బీజేపీ కలిసి న్సకలైట్లపై పోరాడయన్నారు. అనాటి పోలీసులు ఏరన్నారు. పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతోందన్నారు. బీజేపీ నేతలపై లాఠీ ఝుళిపిస్తూ  కేసీఆర్‌ కొమ్ముకాస్తున్నారని, టెర్రరిస్ట్‌లు, నక్సలైట్లు వస్తే పోలీసులకు  అండగా ఉండేది బీజేపీయేనని, కేసీఆర్‌ కేటీఆర్‌ విదేశాలకు పోయి తలదాచుకోవడం ఖాయమని అన్నారు. ‘రెండేళ్ల తర్వాత ఊడిపోయే పార్టీ టీఆర్‌ఎస్‌.  అధికారంలోకి వచ్చేది బీజేపీ’ అని అన్నారు. మంచిర్యాల జిల్లాలో 24 ఏళ్ల యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ‘వరి వేస్తే ఉరే గతి’ అనడంతోనే భయంతో రైతులు చనిపోతున్నారని అన్నారు.  రైతు అత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ‘వరి వేస్తే ఉరి’ అని కేసీఆర్‌ బెదిరిస్తున్నారని రైతులు చెబుతూ బాధ పడుతున్నారన్నారు. కేసీఆర్‌ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రోజుకో మాట చెబుతుంటాడని ఎద్దేవా చేశారు. ఒక రోజు సన్నవడ్లు వేయవద్దంటారని, మరో రోజు పత్తి వేయవద్దంటారని అన్నారు. భూ సార పరీక్షల కోసం కేంద్రం రూ.120 కోట్ల నిధులు ఇస్తే కేసీఆర్‌  తన ఫాంహౌస్‌లో మాత్రమే భూ సార పరీక్షలు చేయించుకున్నారని,  రైతుల భూముల్లో మాత్రం ఆ ఊసేలేదని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగాలేదని, ఏ రైతు ఇప్పుడు  కోటీశ్వరుడు కావాలనుకోవడం లేదని అన్నారు. కుటుంబ పోషణ కోసం సాగు చేసుకుంటున్నారని, నష్టాలు పూడ్చుకోవడానికి కష్టపడుతున్నారని అన్నారు.  ఏడేళ్లుగా అకాల వర్షాలతో పంట నష్టంతో రైతులు అల్లాడిపోతున్నా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కనీసం కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా పథకాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. ‘వ్యవసాయాన్ని భారంగా మార్చి వరి వేస్తే ఉరే గతి’ అని అనడంతోనే భయంతో రైతులు చనిపోతున్నారన్నారు. ఇకపై ఏ రైతు భయపడవద్దని ముఖ్యమంత్రి మెడలు వంచైనా ప్రతి గింజా కొనేలా చేస్తామని అన్నారు. ఇందుకోసం బీజేపీ ఎంతవరకైనా పోరాడుతుందన్నారు. రైతులను అయోమయానికి గురి చేయడానికే ‘వరివేస్తే ఉరి’ అని కేసీఆర్‌   వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.  కేంద్రం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటుందని, మిగిలిన 20 లక్షల మెట్రిక్‌ టన్నులు రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఇతర రాష్ట్రాల సీఎంలతో సమావేశం పెడితే కేసీఆర్‌ ఆ మీటింగ్‌కు వెళ్లకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారన్నారు. కృష్ణా నీటి కేటాయింపుల్లో 299 టీఎంసీల నీటికే ఒప్పుకొని తెలంగాణకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని అన్నారు. పంటల విషయంలోనూ రైతులను మోసం చేస్తున్నారనీ, నిజంగా రైతులకు అన్యాయం జరిగితే ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదనీ, ప్రధానమంత్రిని కలిసి  ఎందుకు అడగలేదనీ ప్రశ్నించారు. ‘ఇంటికో ఉద్యోగం’ అని చెప్పిన కేసీఆర్‌ రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, తన కుటుంబంలో కొడుకు, బిడ్డ, అల్లుడు, మరదలు కొడుకులతో సహా మొత్తం ఐదుగురికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారని అన్నారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పోలీస్‌ కిష్టయ్య తుపాకీతో కాల్చుకొని బలిదానం చేసుకున్నాడన్నారు.  నేడు యువత ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే అమరుల అత్మ క్షోభిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పారన్నారు. ఈ సారి ఎన్నికలొస్తే యువత టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేలా తీర్పునివ్వడం ఖాయమన్నారు. పాదయాత్రలో నిలువ నీడ లేదని పేదలు ఏడుస్తున్నారన్నారు. ‘కేటీఆర్‌ నువ్వు మంత్రివి కదా. ముస్తాబాద్‌ మండలంలో ఎంత మందికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇచ్చావో సమాధానం  చెప్పు’ అని ప్రశ్నించారు. కేంద్రం 2.91 లక్షల ఇళ్ల కోసం రూ.10 వేల కోట్లు నిధులు ఇస్తే సిరిసిల్ల జిల్లాలో ఎంతమందకి  నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూసి జీర్ణించుకోలేక  బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దళితబంధు హుజూరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు.  అంబేద్కర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అక్టోబరు 2 తరువాత ముఖ్యమంత్రిని వదిలిపెట్టబోమని, దళిత బంధు అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ చార్జీలు పెంచితే ఊరుకునే సమస్యే లేదన్నారు.  లీటరు పెట్రోల్‌పై రూ.40 కేసీఆర్‌ తీసుకుంటూ నెపం మాత్రం కేంద్రంపై మోపుతున్నారన్నారు. పేదలపై ప్రేమ ఉంటే ఆర్టీసీ చార్జీలు ఎందుకు తగ్గించరన్నారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు బయటకు రాకుంటే కేసీఆర్‌ వారి బతుకులను మరింత దుర్భరం చేయడం ఖాయమన్నారు. ఏది మాట్లాడినా మతతత్వాన్ని రెచ్చగొడుతున్నారని అంటున్నారన్నారు. ఓవైసీ సవాల్‌ చేస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి సభ పెట్టి బీజేపీ సత్తా చూపామని,  కేసీఆర్‌కు ఓవైసీ సవాల్‌ విసిరితే భయపడి ఫామ్‌ హౌజ్‌లో పడుకున్నారని అన్నారు. బీజేపీ ఇస్లాంను ఏనాడూ కించపరచలేదని, అందరినీ సమానంగా చూడాలని చెబుతున్నామని అన్నారు. బీహార్‌లో ఎంఐఎంఏ హామీ ఇవ్వకుండానే 12 శాతం ఓట్లను ఏకం చేసి ఐదు సీట్లను గెలుచుకుందన్నారు. తెలంగాణలో  80 శాతం మంది ఒక్కటై ఓటు బ్యాంక్‌గా మారితే గోల్కొండపై కాషాయ జెండా ఎగిరేసి తీరుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం  బీజేపీదేనన్నారు. మేం ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే మతతత్వాన్ని రెచ్చగొడుతున్నామని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోందన్నారు.  మతతత్వాన్ని రెచ్చగొట్టే ఉద్దేశం బీజేపీకి లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్‌ బీజేపీ, టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.   రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వీర్యమ వుతున్నాయని, సర్పంచ్‌లను కలెక్టర్‌లతో భయ౅ పట్టిస్తున్నారని అన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిధులు ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు.   ముస్తాబాద్‌లో జాతీయ ఉపాధి హామీ కింది రూ.27.79 కోట్లు, మౌలిక సదుపాయాల కింద రూ.27.43 కోట్లు, పశుగ్రాసం పెంపకానికి రూ.10.79 కోట్లు, ఆర్థిక సంఘం ద్వారా రూ.14.98 కోట్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.49 కోట్లు, పీహెసీ నిర్మాణానికి రూ.14 కోట్లు కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. 


ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేసీఆర్‌ 

- బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ 

తెలంగాణ ఉద్యమం పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. తండ్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో భూ బకాసురిడిలా భూములను తింటుంటే కొడుకు కేటీఆర్‌ ఇసుకను మేస్తున్నట్లు, ఈ దొరల పెత్తన్నాన్ని ఎదరికించడానికి ప్రజాసం గ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి తండ్రీకొడుకులకు గుబులు పుడుతోందన్నారు.   మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, కటకం శ్రీధర్‌, ఎర్రం మహేష్‌, రమాకాంత్‌రావు, మోహన్‌రెడ్డి, గోపి, శ్రీనివాస్‌, దరువు ఎల్లం, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, సంగప్ప,  హన్మంతగౌడ్‌, కార్తీక్‌ రెడ్డి, లింగని మహేందర్‌, శ్రీనివాసరావు, శీలం రాజు, మల్లారపు సంతోష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ఎల్ల గిరి, తిరుపతి, మల్లారెడ్డి, సుధాకర్‌రెడ్డి, అజయ్‌, కృష్ణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.