బాడీ షేమింగ్‌ను భరించొద్దు!

ABN , First Publish Date - 2021-04-14T05:30:00+05:30 IST

సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఎప్పుడో ఒకప్పడు బాడీ షేమింగ్‌కు గురైనవారే. కానీ నోరు తెరచి గట్టిగా మాట్లాడిన వారు చాలా తక్కువ. టీవీ నటి సయంతనీ ఘోష్‌ ఈ మధ్య తనకు ఎదురైన బాడీ షేమింగ్‌ అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా

బాడీ షేమింగ్‌ను భరించొద్దు!

సెలబ్రిటీల నుంచి సాధారణ మహిళల వరకు ఎప్పుడో ఒకప్పడు బాడీ షేమింగ్‌కు గురైనవారే. కానీ నోరు తెరచి గట్టిగా మాట్లాడిన వారు చాలా తక్కువ. టీవీ నటి సయంతనీ ఘోష్‌ ఈ మధ్య తనకు ఎదురైన బాడీ షేమింగ్‌ అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆడవాళ్ల ఛాతి, శరీరాకృతి గురించి అమితాసక్తి చూపే మగవాళ్లకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు నాగిని సీరియల్‌ ఫేమ్‌. మహిళల ఛాతిని శరీర భాగాల్లో ఒకటిగానే చూడాలని చెబుతున్న ఆమె ఏం అంటున్నారంటే... 


‘‘కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ఆకతాయి నా బ్రా కొలత అడిగాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే అతడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాను. అతడికి ఒక్కడికే కాదు బాడీ షేమింగ్‌ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మహిళల ఛాతి గురించి మగవాళ్లలో ఎందుకంత ప్రత్యేక ఆసక్తి చూపిస్తారో అర్థంకాక తలపట్టుకుంటున్నా. పాలిచ్చే తల్లి లేదా ఫ్యాషన్‌ రంగంలో ఉన్న మహిళల్లో ఛాతికి ఒక  అర్థం, పని ఉంది. మిగతా అందరు అమ్మాయిల్లోనూ ఛాతిభాగం అన్ని శరీర భాగాల లాంటిదే. అబ్బాయిలే కాదు కొందరు అమ్మాయిల్లో కూడా ఈ రకమైన ఆలోచన ఉంటుంది. ఆడవాళ్ల ఛాతి కూడా అన్ని అవయవాల లాంటిదే అని అందరు ఎందుకు అనుకోవడం లేదో? ఇటువంటి ఆలోచనలు మహిళలను ఎంతో ఆందోళనకు గురిచేస్తాయి. అంతెందుకు మనసుకు నచ్చిన డ్రెస్‌ కొనాలనుకున్నప్పుడు కూడా ఛాతీ చాలా చిన్నగా ఉందనో లేదా మరీ పెద్దగా ఉందనో అనే ఒకే ఒక్క కారణంతో వెనక్కి వచ్చేస్తారు చాలామంది అమ్మాయిలు. 


నేనూ బాధితురాలినే

ఆడవాళ్లను ఒకే శరీరాకృతిలో చూడాలనుకునే మగవాళ్లను ఎదుర్కొనేందుకు ఆడవాళ్లం సిగ్గు పడతాం. అనవర రాద్దాంతం ఎందుకులే అని మిన్నకుండిపోతాం. నేను కూడా పని ప్రదేశంలో ఒక పురుషుడు నా ఛాతి వంక అదే పనిగా చూస్తున్నప్పుడు ఇబ్బంది పడుతూనే చాలాసార్లు మౌనంగా ఉండిపోయాను. ఈ తరహా బాడీషేమింగ్‌ను ఇన్నాళ్లు భరించింది చాలు. ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మనల్ని మనం ప్రేమించుకునేందుకు, మనకోసం మనం నిలబడేందుకు, మనం ఎలా ఉన్నామో అంగీకరించేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే మనం తప్ప ఎవ్వరూ మనకోసం ఆ పని చేయలేరు. మీతో ఎవరైనా, ఎప్పుడైనా ఏ విధంగానైనా అమర్యాదగా ప్రవర్తించినా, మీ శరీరం తీరును అవమానపరుస్తూ మాట్లాడినా మౌనంగా ఉండి పోవద్దు. గట్టిగా బయటకు మాట్లాడండి. వారికి బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పండి. అది మగవాళ్లు, ఆడవాళ్లు.. ఎవరైనా సరే. ఈరోజుల్లో శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యమే అతి ముఖ్యమైనది. శరీరాన్ని దృఢంగా మార్చుకోండి. అలాగే మానసికంగానూ దృఢంగా మారండి. అన్ని రకాల శరీరాకృతులను ఒకేలా చూడాల్సిన సమయం వచ్చింది. ఈ మార్పు కోసం నేను కట్టుబడి ఉన్నాను. మరి మీరు?’’.

Updated Date - 2021-04-14T05:30:00+05:30 IST