ఈ పచ్చని చెట్లకు దిక్కెవరు?

ABN , First Publish Date - 2021-01-18T09:27:15+05:30 IST

హరితహారం పేరుతో లక్షలాది మొక్కలు నాటిస్తున్న ప్రభుత్వం.. పాత సచివాలయ ప్రాంగణంలోని వందల ఏళ్ల నాటి చెట్లను మాత్రం కాపాడలేకపోతోంది. పైగా.. వృక్షాలను కాపాడేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద

ఈ పచ్చని చెట్లకు దిక్కెవరు?

సచివాలయ ప్రాంగణంలో 300కు పైగా వృక్షాలు తరలించి, కాపాడేందుకు ముందుకు రాని ప్రభుత్వం

సంరక్షణ బాధ్యత తీసుకున్న ‘వట’ సంస్థకు..

మూల్యం చెల్లించాలంటూ అధికారుల హుకుం!

తమ వల్ల కాదంటూ తప్పుకున్న స్వచ్ఛంద సంస్థ


హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): హరితహారం పేరుతో లక్షలాది మొక్కలు నాటిస్తున్న ప్రభుత్వం.. పాత సచివాలయ ప్రాంగణంలోని వందల ఏళ్ల నాటి చెట్లను మాత్రం కాపాడలేకపోతోంది. పైగా.. వృక్షాలను కాపాడేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థకు సహకరించకపోగా.. అడ్డుపడుతోంది. వాళ్లు కాపాడిన కొన్ని చెట్లకు తగిన మూల్యం చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కొత్త సచివాలయం నిర్మించేందుకు.. సుమారు పాతిక ఎకరాల్లో విస్తరించిన పాత సచివాలయ భవన సముదాయాలను ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో కొత్త సెక్రెటేరియేట్‌ను కట్టేందుకు సంకల్పించింది. అయితే, ఆ పరిసరాల్లో సుమారు మూడు వందలకు పైగా చెట్లు ఉన్నట్లు పర్యావరణ ఉద్యమకారులు చెబుతున్నారు. అందులో మొదటి విడతగా 33 చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించి, మరో 40 చెట్లను కొట్టేయాలంటూ సంబంధిత అధికారులు ఆదేశాలు జారీచేసినట్లు వట ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పెద్దిరెడ్డి ఉదయ్‌కృష్ణ చెబుతున్నారు. సచివాలయం ఆవరణలోని చాలాచెట్లు సుమారు ఎనభై నుంచి వందేళ్ల కాలం నాటివిగా పర్యావరణ వేత్తలు గుర్తించారు. అందులో మర్రి, రావి, వేప, చింత తదితర చెట్లు ఎక్కువగా ఉన్నాయి.


కాపాడినందుకు పైసలా..

బలీయంగా ఉన్న ఒక చెట్టు.. నలుగురు సభ్యులు కలిగిన ఓ కుటుంబానికి రోజుకు అవసరమైనంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని శాస్త్రవేత్తల అంచనా. అలాంటి చెట్లను కాపాడుకోవడం అందరి బాధ్యత. కానీ, కంచే చేను మేసిన చందంగా.. చెట్లను కాపాడాల్సిన మనుషులే ఇక్కడ వాటి ఉసురు తీస్తున్నారు. ఇలాంటి స్థితిలో.. రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టుల్లో భాగంగా.. తొలగించాల్సిన చెట్లను సురక్షితంగా మరో ప్రాంతానికి తరలించి, వాటిని కాపాడే బృహత్‌ కార్యక్రమాన్ని వట ఫౌండేషన్‌ భుజాలకెత్తుకుంది. పదేళ్ల కిందట ప్రారంభమైన ఈ స్వచ్ఛంద సంస్థ.. ఇప్పటి వరకు సుమారు రెండు వేల పెద్ద చెట్లను మరో ప్రాంతానికి తరలించి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసింది. సచివాలయం ప్రాంగణంలోనూ నరికివేతకు ఎంపిక చేసిన 40 చెట్లలో ఎనిమిదింటిని, తరలించేందుకు గుర్తించిన 33 చెట్లలో పదింటిని వట ఫౌండేషన్‌ కాపాడి.. శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు స్థలానికి తరలించింది. ‘‘నరికివేతకు గురయ్యే చెట్ల బాధ్యతను మాత్రమే వట ఫౌండేషన్‌ స్వీకరిస్తుంది. 


నలభై ఏళ్లు దాటిన ఒక్కో చెట్టును తరలించేందుకు మూడు రోజులు పడుతుంది. అందుకు నలభై అడుగుల పొడవైన డీసీఎం, వంద టన్నుల సామర్ధ్యమున్న క్రేన్‌, జేసీబీలు అవసరమవుతాయి. ఒక్కో చెట్టును తరలించేందుకు సుమారు రూ. 2 నుంచి రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. సచివాలయ ప్రాంగణంలోని చెట్లలో ఎనిమిదింటిని తరలించేందుకు మాకు రూ. 6-8 లక్షలు ఖర్చయింది. అయితే, ఒక్కో చెట్టుకు కొంత ధర చెల్లించాలని అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు’’ అంటూ ఉదయ్‌కృష్ణ ఆవేదన వెలిబుచ్చారు. చెట్లను కాపాడే వాళ్లకు సాయం చేయకపోగా.. వారినే సొమ్ము చెల్లించాలంటూ హుకుం జారీ చేయడం విడ్డూరంగా ఉందని కొందరు పర్యావరణవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 


మిగిలిన చెట్ల పరిస్థితి...

మొదటి విడతగా తరలించాలనుకున్న 33 చెట్లలో ఇప్పుడు కేవలం పది చెట్లకు మాత్రమే పునరావాసం కల్పించగలిగారు. అధికారుల సహకారం లేకపోవడంతో మిగతా చెట్లను తరలించేందుకు వట ఫౌండేషన్‌ ఆసక్తి చూపడంలేదు. దీంతో.. ఆ 23 చెట్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక కొట్టేసేందుకు గుర్తించిన నలభై చెట్లలో ఎనిమిది చెట్లను వట ఫౌండేషన్‌ సురక్షిత ప్రాంతానికి తరలించింది. ఒక చెట్టు కొట్టేయడం వల్ల వచ్చే కలప రూ. రెండు నుంచి రూ. ఐదు వేలుకి అమ్ముడవుతుంది. కాబట్టి, ప్రభుత్వం కొట్టేసేందుకు అనుమతించిన చెట్లను కాపాడాలంటే, తగిన సొమ్ము చెల్లించాల్సిందే. అలా చెల్లించలేక వట ఫౌండేషన్‌ సైతం మిగతా చెట్లను తరలించేందుకు వెనక్కి తగ్గిందని సమాచారం. 


చెట్లను కాపాడేందుకు ప్రణాళిక రూపొందించాలి

సచివాలయ ప్రాంగణంలోని వృక్ష సంపదను కాపాడుకునేందుకు కావలసిన ప్రణాళిక సంబంధిత శాఖ వద్ద లేదనిపిస్తోంది. కొన్ని వందల ఏళ్ల నాటి విలువైన చెట్లను కోల్పోవడమంటే.. హుస్సేన్‌సాగర్‌ తీరాన్ని కాలుష్యకేంద్రంగా మార్చుకోవడమే. అక్కడ కొన్ని వందల ఏళ్ల నాటి చెట్లు కూడా ఉన్నాయి. వాటిని కాపాడుకునేలా కొత్త సచివాలయం నిర్మాణ డిజైన్‌ను మలుచుకోవాలి. తప్పక తరలించాలనుకునే చెట్లను మాత్రమే రీలొకేట్‌ చేయాలి. తర్వాత కూడా వాటి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. ఒక చెట్టును కొట్టేయడమంటే కొన్ని వందల జీవాల మనుగడను ప్రశ్నార్థకం చేయడమే. నగరం నడిబొడ్డున సుమారు మూడొందల చెట్లను కోల్పోవడమంటే మన ఊపిరిని మనమే వదిలేయడంతో సమానం. 

-పెద్దిరెడ్డి ఉదయ్‌కృష్ణ, వ్యవస్థాపకుడు, వట ఫౌండేషన్‌


బాధ్యతను స్వీకరించరు...

ఒక చెట్టును వేళ్లతో సహా మరో ప్రాంతానికి తరలించాక, తిరిగి అది తిరిగి ప్రాణంపోసుకునేంత వరకూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వేర్ల బలంకోసం కొన్నిరకాల ఎరువులను వాడాల్సి ఉంటుంది. కొమ్మలు కొట్టేసిన చోట, బెరడుకు లేపనం పూయాల్సి ఉంటుంది. అలా రకరకాల జాగ్రత్తలు తీసుకోగలిగితేనే చెట్టును కాపాడుకోగలం. అయితే, పునరావాసానికి తరలించే చెట్ల పరిరక్షణ బాధ్యతను స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ కారణంగానే వట ఫౌండేషన్‌ వెనకడుగు వేసిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

Updated Date - 2021-01-18T09:27:15+05:30 IST