తదుపరి విచారణ వరకు ఖాళీ చేయించొద్దు

ABN , First Publish Date - 2021-04-11T08:09:59+05:30 IST

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టువల్ల ముంపునకు గురవుతున్న ఏటిగడ్డకిష్టాపూర్‌, వేములఘాట్‌ గ్రామాలకు చెందిన బాధితులను తదుపరి విచారణ వరకు ఖాళీచేయించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

తదుపరి విచారణ వరకు ఖాళీ చేయించొద్దు

అవార్డులు పాస్‌ చేయండి, కానీ ఒత్తిడి చేయొద్దు

మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు భారీ ఊరట!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టువల్ల ముంపునకు గురవుతున్న ఏటిగడ్డకిష్టాపూర్‌, వేములఘాట్‌ గ్రామాలకు చెందిన బాధితులను తదుపరి విచారణ వరకు ఖాళీచేయించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. భూసేకరణ చట్టప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం అవార్డులు ప్రకటించవచ్చని, అయితే పిటిషనర్లపై ఒత్తిడి చేయరాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు సీజే హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. భూసేకరణ చట్టం-2013 నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం ఇచ్చేంతవరకు తమను ఖాళీ చేయించరాదని కోరుతూ సిద్దిపేట జిల్లా వేములఘాట్‌ గ్రామానికి చెందిన గాడే శ్రీలేఖ మరో 50 మంది, ఏటిగడ్డకిష్టాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్‌. లింగం మరో 35 మంది గ్రామస్థులు వేర్వేరు పిటిషన్లలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్‌. రవికుమార్‌ వాదించారు. రెండు గ్రామాల్లోని పిటిషనర్లు తమ ఇళ్ళను ఖాళీ చేయాలని అధికారులు ప్రకటిస్తూ డిక్లరేషన్‌ ఇచ్చారని, భారీ యంత్రాలను మోహరించారని ఆయన కోర్టుకు తెలిపారు. 


బాధితులను ఏ క్షణమైనా ఖాళీ చేయించే అవకాశం ఉందని, భూసేకరణ ప్రక్రియ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు. అయితే 2013నాటి భూసేకరణ చట్ట నిబంధనల ప్రకారమే ముందుకు వెళుతున్నామని, కొందరు పిటిషనర్లు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ సంజీవ్‌ కుమార్‌ ధర్మాసనానికి తెలిపారు. చట్ట ప్రకారం అవార్డులు జారీ చేసిన తర్వాతే స్వాధీనపర్చుకుంటామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణ వరకు పిటిషనర్లను ఖాళీ చేయించవద్దని పేర్కొంటూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఈ వ్యాజ్యాల్లో రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లకు రెండు వారాల్లోగా రిప్లయ్‌ కౌంటర్లు వేయాలని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణను జూన్‌ 26కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-04-11T08:09:59+05:30 IST