యాసంగిలో వరి వద్దు

ABN , First Publish Date - 2021-10-10T05:19:45+05:30 IST

మెతుకుసీమగా పేరున్న మెదక్‌ జిల్లాలో వరి విస్త్రతంగా సాగు చేస్తున్నారు.

యాసంగిలో వరి వద్దు

ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం

సాగు విస్తీర్ణం తగ్గించాలని ప్రభుత్వ నిర్ణయం

గ్రామాల్లో ముమ్మరంగా అవగాహన సదస్సులు

మెదక్‌, అక్టోబరు 9 : మెతుకుసీమగా పేరున్న మెదక్‌ జిల్లాలో వరి విస్త్రతంగా  సాగు చేస్తున్నారు. గతంతో పోల్చితే ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయి. కానీ ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం విముఖత చూపడంతో వ్యవసాయధికారులు ప్రత్యామ్నాయ పంటలను సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యాసంగిలో  ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలు సాగుచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మెదక్‌ జిల్లాలో 83 క్లస్టర్లలో యాసంగిలో వరికి బదులుగా శనగ, కంది, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటల సాగుతో వచ్చే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. 


తగ్గనున్న వరిసాగు

మెదక్‌ జిల్లాలో గత సంవత్సరం యాసంగిలో 2.12 లక్షల విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారు. జిల్లాకు పెద్దదిక్కుగా నిలిచే ఘనపురం మధ్యతరహా ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలైన కొల్చారం, మెదక్‌, హవేళీఘణపురం, పాపన్నపేట తదితర మండలాల పరిధిలో 30 వేల ఎకరాల్లో రెండో పంటగా వరిని పండించారు. కౌడిపల్లి, నర్సాపుర్‌, శివ్వంపేట, తూప్రాన్‌, రామాయంపేట, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్‌, టేక్మాల్‌ మండలాల్లో కూడా బోర్ల కింద రైతులు వరి పంటను సాగు చేశారు. అయితే వ్యవసాయాధికారులు ప్రత్యామ్నాయ పంటల సాగు పై దృష్టి కేంద్రీకరించడంతో ఈ యాసంగిలో 41.229 ఎకరాల విస్తీర్ణాన్ని వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికలను సిద్దం చేశారు. గత ఏడాదితో పోలిస్తే 21 శాతం వరి విస్తీర్ణాన్ని తగ్గించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. పొద్దుతిరుగుడు 6వేల 915 ఎకరాల విస్తీర్ణం 6 వేల 620 ఎకరాలలో జొన్నలు, 4 వేల ఎకరాలలో కూరగాయలు, మేజ్‌ 7 వేల 128 ఎకరాలు, 10 వేల ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ, 3 వేల 867 ఎకరాలలో కందులు తధితర పంటల సాగుకు ప్రణాళికలను జిల్లా అధికారులు సిద్దం చేశారు. 


ప్రత్యామ్నాయ పంటలే మేలు -పరశురాంనాయక్‌, మెదక్‌ జిల్లా వ్యవసాయధికారి

మెదక్‌ జిల్లాలో గడిచిన యాసంగి సీజన్‌లో 2.13 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రస్తుతం కేంద్ర సర్కార్‌ ధాన్యం కొనుగోలుపై చేసిన ప్రకటన నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు నిలచిపోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల సాగుతో వచ్చే లాభాలను విరిస్తున్నాం 


అదవిపందులు, కోతుల బెడద -ఆకుల భూమేష్‌, రైతు అల్లాదుర్గం

జొన్న, మక్క, పొద్దు తిరుగుడు వంటి పంటలకు అడవిపందులు, కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో తప్పనిసరై వరి పంటను సాగు చేస్తున్నాము. వర్షాభావ పరిస్థితుల కారణంగా గతేడాది యాసంగిలో జొన్న పంటను సాగుచేస్తే కోతులు, అడవిపందుల దాడులతో పెట్టుబడి కూడా చేతికిరాలేదు. అడవిపందుల బారినుంచి పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తేనే ఆరుతడి పంటలు సాగుచేయగలం.  

Updated Date - 2021-10-10T05:19:45+05:30 IST