ప్రజలు చనిపోయినా పట్టదా?

ABN , First Publish Date - 2021-11-24T08:59:08+05:30 IST

ప్రజలు చనిపోయినా పట్టదా?

ప్రజలు చనిపోయినా పట్టదా?

ఈ సీఎంకు పరామర్శించే తీరిక కూడా లేదా?

విధ్వంసం జరిగితే గాలిలో తిరిగి వెళ్తే చాలా?

ప్రజలు ఆకలితో ఉంటే పెళ్లి విందుకా?

మృతులకు 5 లక్షలేనా?.. 25 లక్షలివ్వాలి

నష్టపోయిన ప్రతి వస్తువూ కొనివ్వాలి

మీ బాధ చూసి చలించిపోయా

అసెంబ్లీలో ప్రశ్నిద్దామంటే నా భార్యపైనా అగౌరవంగా మాట్లాడారు

మీకు న్యాయం జరిగే వరకూ పోరాడతా

బాధితులకు చంద్రబాబు భరోసా

కడప జిల్లా ముంపు గ్రామాల్లో పర్యటన

టీడీపీ పక్షాన వరద మృతులకు రూ.లక్ష


కడప, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి వరద ఉప్పెనై చెయ్యేరు తీర గ్రామాలను అతలాకుతలం చేసింది. 40 మందికి పైగా చనిపోతే ఈ ముఖ్యమంత్రి జగన్‌కు పట్టదా..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. బాధితులను పరామర్శించే తీరిక కూడా లేదా అని ప్రశ్నించారు. గాలిలో తిరిగితే సమస్యలు తెలుస్తాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా చెయ్యేరు ముంపు గ్రామాలు మందపల్లె, పులపుత్తూరు, నందలూరు, గుండ్లూరు, అగస్తాపురం గ్రామాల్లో, రాజంపేటలో మంగళవారం ఆయన పర్యటించారు. వర్షాలు, వరదల నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి  ఓదార్చారు. ఓ పక్క కుటుంబ సభ్యులు, మరోపక్క ఆస్తులు, ఇంకోపక్క జీవనాధారమైన పశుసంపద కోల్పోయి శరణార్థుల్లా కన్నీరు పెడుతున్న బాధితులను చూసి చంద్రబాబు తల్లడిల్లిపోయారు. ఓ దశలో కన్నీరు కార్చారు. ఇలాంటి దుస్థితి మునుపెన్నడూ చూడలేదని ఆవేదన  చెందారు. వరదలు, విపత్తులు రావడం సహజం. అయితే గత వరదలు, సాధారణ వరదలతో పోలిస్తే చెయ్యేరు వరద భిన్నమైందని, అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ లోపంతో కొట్టుకుపోవడం వల్లే ఇన్ని గ్రామాలు తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని మాజీ సీఎం అన్నారు. ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. మహిళలు, వృద్ధులు, రైతుల బాధలను ఆలకించారు. ఇసుక మేటలు వేసిన పొలాలను, శిథిలమైన ఇళ్లను, బురదకుప్పగా మారిన నివాసాలను పరిశీలించారు. మందపల్లె, రాజంపేటలో బాధితులనుద్దేశించి మాట్లాడారు. ‘చెయ్యేరుకు ఇంత వరద వస్తోంది.. ప్రాజెక్టు కూడా నిండి తెగిపోయే ప్రమాదం ఉందని ముందే పసిగట్టలేకపోయారా? ఈ ప్రభుత్వం మొద్దు నిద్రవహించింది. విపత్తు రాకుండా ముందే అప్రమత్తం చేసి ఉండాల్సింది. ఏరు, ఊరు, పొలాలు ఒక్కటయ్యాయి. ఇళ్లు కూలిపోయి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ ఘోర వైఫల్యమే ఇంత మంది మృతికి కారణం. సీఎం అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా..’ అని ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు హుద్‌హుద్‌ తుఫాను వస్తే 8 రోజులు విశాఖలోనే ఉన్నానని, తితిలీ తుఫాను వస్తే బస్సులోనే ఉండి బాధితులకు అండగా నిలిచానన్నారు. తుఫాను వస్తే ఆకాశంలో హెలికాప్టర్‌లో సర్వే చేసి వెళ్లే నష్టం కనిపిస్తుందా అని జగన్‌ను ప్రశ్నించారు.


వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారు..

‘అసెంబ్లీలో వ్యవసాయం గురించి చర్చ సందర్భంగా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దామనుకుంటే చివరకు నా భార్యను కూడా అవమానించారు. నాకేమైనా ఈ సీఎం ఆస్తులు కావాలా.. మీ కోసం మీ సమస్యల కోసం పోరాడుతుంటే ఈ ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసింది. అది గౌరవ శాసనసభ కాదు. కౌరవసభ’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘విశాఖ పాలిమర్‌ ప్రైవేటు ఫ్యాక్టరీలో విషవాయువుకు 40 మంది గురై చనిపోతే ఈ సీఎం ప్రభుత్వం తరపున కోటి పరిహారం ప్రకటించారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం వల్ల వరద తీవ్రతకు పలువురు చనిపోతే రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొంటారా? రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపోతే రూ.5,800 ఇచ్చి సరిపుచ్చుతారా..? చనిపోయిన మృతుల కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలి. నష్టపోయిన ప్రతి వస్తువూ ప్రభుత్వమే ఇవ్వాలి. ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలి. లేదంటే ఇప్పుడున్న ఇళ్ల తరహాలోనే ప్రత్యేక పునరావాస కాలనీలు నిర్మించాలి. అన్నమయ్య ప్రాజెక్టు పునర్మించాల్సి వస్తే సీసీ కాంక్రీటుతో రక్షణ గోడలు నిర్మించాలి. మీ అందరికీ న్యాయం జరిగేంతవరకు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం. ఈ సీఎం మెడలు వంచి మీకు న్యాయం జరిగేదాకా అండగా ఉంటా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అలాగే టీడీపీ తరపున మృతుల కుటుంబాలకు రూ.లక్ష, వరద బాధిత కుటుంబాలకు రూ.5 వేల చొప్పున పరిహారం రేపటి నుంచి రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్రాయుడు పంపిణీ చేస్తారని తెలిపారు.  


ఇంటింటికీ తిరిగి పరామర్శ..

మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో 22 మంది వరదకు మృతి చెందారు. ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి వారిని పరామర్శించారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేమని.. ధైర్యంగా ఉండాలని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఒక్కో ఇంట్లో 15 నిమిషాలకుపైగా ఉన్నారు. వారి బాధలన్నీ ఆలకించారు. మందపల్లెలో 9 మందిని కోల్పోయిన పూజారి ఈశ్వరయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూజారి పెద్దకొడుకు మల్లికార్జున, పూజారి రామమూర్తి, మహేష్‌, గిరిప్రసాద్‌, కోడలు సరస్వతి పేరు పేరునా పలకరిస్తూ ఓదార్చారు. అనంతరం గుండ్లూరు, బోయనపల్లెకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఇంట్లో జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. నగదు, బట్టలు, నగలు, సామాన్లు, ధాన్యపు బస్తాలు ఇలా సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని వారు వాపోయారు. ‘మీ బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తా. రాబోయేది మన ప్రభుత్వమే.. చనిపోయిన కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఆ రోజు మేమే ఇస్తాం’ అని అన్నారు. 


మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌ నైజం

సీఎం జగన్‌ మాట తప్పను, మడమ తిప్పనని అంటుంటారని.. కానీ అనేక అంశాల్లో మడమ తిప్పారని చంద్రబాబు ఆరోపించారు. ‘జగన్‌ విపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతికి అసెంబ్లీలో మద్దతిచ్చి ఇప్పుడు తప్పారు. మద్యనిషేధమని చెప్పి.. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం పారిస్తున్నారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్‌ నైజంగా మారింది’ అని విమర్శించారు. 


అన్నమయ్య ప్రాజెక్టు గేటు గత ఏడాదే పోయింది. ఇప్పుడు  మళ్లీ వరద వచ్చింది. గత ఏడాది పింఛా ప్రాజెక్టు తెగిపోతే గుణపాఠం ఎందుకు నేర్చుకోలేదు? ఇప్పుడీ రెండూ కొట్టుకుపోవడమే ఇంతటి విపత్తు, విధ్వంసానికి కారణం.        

క్లెమోర్‌ మైన్స్‌ తట్టుకున్న ఈ శరీరం.. నా భార్యను అవమానపరిచేలా మాట్లాడితే తట్టుకోలేకపోయాను. మా ఇంటిపై దాడి చేశారు. ఆఫీసుపై దాడి చేశారు. చివరకు నా భార్యను, కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారు. -చంద్రబాబు



అన్నమయ్య ప్రాజెక్టు మాకొద్దు

అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్లే మా ఊరు ఇసుక దిబ్బగా మారింది. సర్వం కోల్పోయాం. మా ఇంట్లో 20 గేదెలు చనిపోయాయి. బంగా రు, నగదు, ధాన్యం వరదకు కొట్టుకుపోయాయి. చంద్రన్నా.. మీరే మాకు అండగా నిలవాలి. ప్రతిపక్ష నాయకుడిగా మా బాధలు, కన్నీళ్లు, కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మమ్మల్ని ముంచేసిన ఈ అన్నమయ్య ప్రాజెక్టు మాకు వద్దేవద్దు.

- తోట రజని, మందపల్లె


సీబీఐతో విచారణ చేయించాలి

అన్నమయ్య ఆనకట్ట ఐదు గేట్లు ఉంటే ఐదో గేటు ఎందుకు తెరవలేదు? ఆ గేటు కూడా గత ఏడాదే రిపేరు చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండే ది కాదు. ప్రాజెక్టు కట్టడం వల్ల 10 వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టు కట్టకపోయి ఉంటే ఊట ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందేది. చెయ్యేరు తీరంలో ఇన్ని గ్రామాలు కొట్టుకుపోవడానికి, 40 మంది మృతి చెందడానికి, వేల కోట్ల ఆస్తి నష్టానికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడమే కారణం. దీనిపైన సెంట్రల్‌ విజిలెన్స్‌ లేదా సీబీఐ ద్వారా విచారణ చేయాలి. నిందితులపైౖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు కట్టాలనుకుంటే ముందుగా మా గ్రామాలను సురక్షిత ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో అలా నిర్మించాలి. లేదా రక్షణ గోడ నిర్మించాలి. మీరు మాకు అండగా నిలవాలి.

- తిరుమల శ్రీనివాసులు, మందపల్లె







Updated Date - 2021-11-24T08:59:08+05:30 IST