Abn logo
Aug 11 2020 @ 01:17AM

నదీ స్నానాలు కొవిడ్ ను నిరోధిస్తాయా?

కొవిడ్ మహమ్మారి ఇప్పట్లో మనలను వదిలిపెట్టదు. ఈ నిశ్చిత, కఠోర వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల జీవన శైలులలో మార్పును సాధించేందుకు వ్యాధి నిరోధక చర్యలపై ఉద్యమ స్థాయిలో ఒక బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి. వెల్లుల్లి, తిప్పతీగ, అల్లం, పసుపు కొమ్ములను ప్రతి కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేయాలి. కుంభమేళా, పుష్కరాల సందర్భంగా నదులలో చేసే సామూహిక స్నానాల లాంటి సృజనాత్మక పరిష్కారాలపై శ్రద్ధ చూపాలి. సమున్నత భారతీయ సంస్కృతీ నాగరికతల ప్రస్థాన ప్రారంభంలో మన తొలి పూర్వీకుల ఆరోగ్యానికి విశేషంగా దోహదమొనర్చిన మొహెంజోదారో విశాల స్నానఘట్టాలలో సామూహిక స్నాన సంప్రదాయాన్ని మనమూ అధునాతన రీతుల్లో ఆచరించడం, బహుశా, మనకు శుభస్కరం.


ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కనుకనే ప్రజల ఆరోగ్య రక్షణకు గణనీయంగా ఖర్చుచేయడం ప్రభుత్వాలకు అనివార్యమయింది. ఈ వ్యయాలు రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి-వ్యాధి నిర్మూలనకు; రెండు- వ్యాధిని నిరోధించేందుకు. ముందుగా వ్యాధి నిర్మూలనా వ్యయాల తీరుతెన్నులను చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (క్లుప్తంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ) ప్రచురించిన ‘జాతీయ ఆరోగ్య పద్దుల అంచనాలు-2018’ (నేషనల్ ఎకౌంట్స్ ఎస్టిమేట్స్ -2018)లోని గణాంకాలను పరిశీలిద్దాం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2015--–--16 సంవత్సరంలో 31లక్షలమంది ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య భద్రతకు రూ. 9,134 కోట్లు వెచ్చించారు. ఉద్యోగి కుటుంబ సభ్యులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కో ఉద్యోగికి రూ.7000 చొప్పున ఖర్చు చేశారు. అదే సంవత్సరం, ప్రభుత్వోద్యోగులతో పోల్చితే సర్కారు సిబ్బందేతర పౌరుల ఆరోగ్య రక్షణకు చేసిన సగటు వ్యయం చాలా తక్కువ 131 కోట్ల మంది ప్రభుత్వేతర పౌరులకు రూ.38,794కోట్లు ఖర్చు చేశారు. అంటే ఒక్కో పౌరుని ఆరోగ్య సంక్షేమానికి వెచ్చించింది కేవలం రూ.296 మాత్రమే! 


2020–21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్లో, అల్లోపతి వైద్యానికి ప్రాధాన్యమిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రూ.63,000 కోట్లు; ఆయుర్వేదం, హోమియోపతి మొదలైన ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖకు కేవలం రూ.2100 కోట్లు కేటాయించారు. దేశ ప్రజల ఆరోగ్యానికి అల్లోపతి వైద్యం అనుపమాన సేవలనందిస్తుందనడంలో సందేహం లేదు. గుండెలో స్టెంట్లు అమర్చడం లాంటి అత్యాధునిక వైద్య చికిత్సలు అల్లోపతిలోనే సాధ్యమవుతాయి. ఆయుర్వేదానికి అలాంటి చికిత్సలు అపరిచితమైనవి. అయితే శరీర ధర్మాలకు ఆనుగుణ్యమైన చికిత్సలు అందజేపేందుకు ఆయుష్ విధానాలు ప్రాధాన్యమిస్తాయి. హృద్రోగులకు ఒక స్టెంట్ స్థానంలో మరో స్టెంట్ నేర్పాటు చేసే చికిత్సను సమకూర్చేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొగ్గు చూపితే అసలు హృద్రోగి గుండెలో స్టెంట్ నమర్చవలసిన అవసరాన్నే నిరోధించేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ కృషి చేస్తుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి వ్యాధి నిర్మూలనకు అధిక మొత్తంలో, వ్యాధి నిరోధానికి అల్పస్థాయిలో నిధులు కేటాయిస్తున్నది. ఈ తలకిందులు వ్యవహారానికి కారణమేమిటి? బహుళజాతి ఆరోగ్య భద్రతా కంపెనీలు సరఫరా చేసే ఔషధాలు, వైద్య పరికరాల కొనుగోలుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎనలేని ప్రాధాన్యమివ్వడమేనని చెప్పక తప్పదు.


ఈ అసంగత పరిస్థితిని సరిదిద్దేందుకు నీతి ఆయోగ్ సలహాదారుడు రాకేష్ సర్వాల్ కొన్ని చర్యలను సూచించారు. వాటిలో మొదటిది- కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవలను సార్వజనిక ఆరోగ్య సేవలుగా మార్చివేయడం. తద్వారా ప్రభుత్వోద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు, సామాన్య పౌరుల ఆరోగ్య రక్షణకు చేసే వ్యయాలు సమాన స్థాయిలో ఉంటాయి. రెండో చర్య- ఆయుష్ మంత్రిత్వ శాఖకు నిధుల కేటాయింపు పెంచడంతో పాటు హై- టెక్ చికిత్సలకు వెచ్చించే నిధులను గణనీయంగా తగ్గించాలి. ప్రజల ఆరోగ్య రక్షణకు అనుసరిస్తున్న రెండో విధానం వ్యాధి నిరోధకచర్యలు. వీటిలో భాగంగా ఆరోగ్య కరమైన జీవనశైలులను అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరమున్నది. కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణకు ప్రజలు మరింతగా వెల్లుల్లి, అల్లం, పసుపు మొదలైన వాటిని అధికంగా తీసుకునేలా తగు చర్యలు చేపట్టాలి. యోగాను అభ్యసించేందుకు, ధ్యానాన్ని చేసేందుకు, నిత్యం ఆరు బయట మరింతగా వ్యాయామం చేసేందుకు ప్రజలను ప్రోత్సహించాలి. అయోడిన్ వున్న ఉప్పు వాడకం, బిడ్డలకు తల్లిపాలనివ్వడం మొదలైన అంశాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అదే విధంగా ప్రజల జీవనశైలులలో ఆరోగ్యకరమైన మార్పులు తెచ్చేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. అల్లం, పసుపు, వెల్లుల్లి, తిప్పతీగ మొదలైన సాంప్రదాయక ఆరోగ్య పోషక పదార్థాలను ప్రతి కుటుంబానికి ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. దీనివల్ల ప్రజారోగ్య రక్షణకు మంచి ప్రయోజనాలు సమకూరుతాయనడంలో సందేహం లేదు.


సామాన్య పౌరుల ఆరోగ్య రక్షణకు 2015–-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయంలో రూ.12,000 కోట్లను టీకాలు వేయడం, వైద్య సంబంధిత సమాచారాన్ని ప్రజలకు అందించడం, ధూమ పాన వ్యతిరేక కార్యక్రమాలు మొదలైన వ్యాధి నిరోధక చర్యలకు వినియోగించారు. నిజానికి ఇది చాలా స్వల్ప మొత్తం. వ్యాధి నిరోధక కార్యక్రమాలకు ఇంతకంటే ఇతోధికంగా ఖర్చు పెట్ట వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇందుకు హై-టెక్ చికిత్సా పద్ధతులకు వెచ్చిస్తున్న వ్యయాలను గణనీయంగా తగ్గించాలి. వ్యాధుల నిరోధానికి ఒక భిన్న సామాజిక నమూనాను అన్వేషించాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్లో వైద్య వాచస్పతి త్రిపాఠి విరచిత విపుల పరిశోధనా పత్రం ఒకటి వున్నది. కుంభమేళ, నదుల పుష్కరాల సందర్భాలలో ప్రజలు నదులలో చేసే స్నానాల ఫలితంగా ప్రజలలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుందని వైద్య వాచస్పతి పేర్కొన్నారు. పుష్కర స్నానఘట్టాలలో వేలాది ప్రజలు నదీ ప్రవాహంలో మునకలు వేయడం పరిపాటి. దీనివల్ల వివిధ వ్యాధులను సృష్టించే వైరస్ లు, ఇతర సూక్ష్మ జీవులను అత్యంత సూక్ష్మ పరిమాణంలో నదీజలాలలో మిళితమవుతాయి. ఇవి, స్నానమాచరిస్తున్న ఇతర యాత్రికుల శరీరాలలోకి ప్రవేశిస్తాయి. నది జలాల తో సోకిన వ్యాధికారక సూక్ష్మ జీవులతో పోరాడేందుకు ఆరోగ్యవంతులైన యాత్రికుల శరీరాలు తక్షణమే సంసిద్ధమవుతాయి. తద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటాయి. ప్రజలు అందరూ తమకు సమీపంలో ఉన్న నదులలో స్నానమాచరించేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహా సంప్రతింపులతో ఒక నిర్దిష్ట తేదీని ప్రకటించి, ఆ రోజున ప్రజలు నదులలో స్నానమాచరించేందుకు సకల ఏర్పాట్లు చేయాలి. కొవిడ్ వైరస్ సూక్ష్మ రేణువుల ప్రసారం వల్ల ప్రజల్లో ఉమ్మడి రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. 


అయితే ఇటువంటి ఆరోగ్య భద్రతా చర్యలు చేపట్టేందుకు రోగ నిర్మూలనా ఔషధాలు, హై-టెక్ వైద్య ఉపకరణాలను సరఫరా చేసే బహుళజాతి సంస్థల ప్రయోజనాలు ప్రధాన అవరోధంగా ఉన్నాయి. ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ డాక్టర్లు, ఆస్పత్రులు సైతం ఆ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్లే సంప్రదాయ, భద్రమైన, స్వల్ప వ్యయంతో కూడిన వ్యాధి నిరోధక పద్ధతులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇది మన ప్రజారోగ్య వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. సరే, కొవిడ్ మహమ్మారి ఇప్పట్లో మనలను వదిలిపెట్టదు. ఈ నిశ్చిత, కఠోర వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల జీవన శైలులలో మార్పును సాధించేందుకు వ్యాధి నిరోధక చర్యల పై ఉద్యమ స్థాయిలో ఒక బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి. వెల్లుల్లి, తిప్పతీగ, అల్లం, పసుపు కొమ్ములను ప్రతి కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేయాలి. కుంభమేళా, పుష్కరాలలో నదులలో చేసే సామాజిక స్నానాల లాంటి సృజనాత్మక పరిష్కారాల పై శ్రద్ధ వహించాలి. సమున్నత భారతీయ సంస్కృతీ నాగరికతల ప్రస్థాన ప్రారంభంలో మన తొలి పూర్వీకుల ఆరోగ్యానికి విశేషంగా దోహదమొనర్చేలా మొహెంజోదారో విశాల స్నానఘట్టాలలో సామూహిక స్నాన సంప్రదాయాన్ని మనమూ అధునాతన రీతుల్లో ఆచరించడం, బహుశా, మనకు శుభస్కరం.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...