కథలు పగపడతాయా?

ABN , First Publish Date - 2020-07-27T06:20:00+05:30 IST

జనం కోసం కాదు, కథలు తెలిసినవాళ్ళు తమకోసమే సందర్భాన్ని చూసుకుని, కల్పించుకుని కథలు చెప్పాలి, తప్ప దాచుకోకూడదు. అలా దాచుకుంటే కథలు ఆ వ్యక్తిమీద ప్రతీకారం తీర్చుకుంటాయి...

కథలు పగపడతాయా?

జనం కోసం కాదు, కథలు తెలిసినవాళ్ళు తమకోసమే సందర్భాన్ని చూసుకుని, కల్పించుకుని కథలు చెప్పాలి, తప్ప దాచుకోకూడదు. అలా దాచుకుంటే కథలు ఆ వ్యక్తిమీద ప్రతీకారం తీర్చుకుంటాయి. ఈ విషయాన్ని ఎ.కె. రామానుజన్‌ సేకరించిన కథ A Story and a song తెలియచేస్తుంది.


“What can not be be said above all must not be silenced but written”- Derrida 

మానవ అస్తిత్వంలో కథలు అత్యంత కీలక మని, జ్ఞాన గ్రహణకు, అవగాహనకు కథలు అవసరం అనేది ఇప్పటికే రూడీ అయిన విషయం. కథ అనేది విశ్వజనీనంగా వుండేది. కథలు ప్రపంచంలో మన స్థానాన్ని తెలియజేస్తాయి. మనం ఎలా వుండాలో నేర్పుతాయి, మన దృక్పథాన్ని రూపకల్పన చేస్తాయి. ఇతరుల దృక్పథాల్ని మనకు తెలియచేస్తాయి. నైతికాంశాలను ప్రస్తావిస్తాయి, అన్నిం టికంటే ముఖ్యంగా మనల్ని మనకు తెలియజేస్తాయి. వీటితోపాటు కథలు పగపడతాయనే భావన కూడా ఒకటి వుంది. ఇది ఆలంకారిక ఆలోచనయినప్పటికీ, ఆసక్తిగా వుంటుంది.  భారతీయ కథా సంప్ర దాయంలో కథలు భౌతికంగా కథకుడిలో జీవిస్తాయి. వాటిని ప్రక్కవాళ్ళకి వినిపిం చటం ఆ వ్యక్తి బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించటంలో ఆ వ్యక్తి విఫలమయితే అతనిలో జీవించే కథలు అనివార్యంగా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. అతను/ ఆమె శిక్ష అనుభవించక తప్పదు అనే నమ్మకాలున్నాయి. 


‘‘కొన్నింటిని నీ కోసం మాత్రమే వుంచుకోవటం కుదరదు. ముఖ్యంగా ఆహారాన్ని... వేరేవాళ్ళకు ఇవ్వాలి. కథ అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు. అది చాలా ముఖ్యమయిన సామాజిక బాధ్యత. కథను తను అందరికి చెప్ప కపోతే నువ్వునీ సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నట్లే’’ అని అంటుంది కవితా కసుగల్‌ అనే ఆమె. ఈ విషయంలో పాశ్చాత్య కళాసిద్ధాంతానికి భారతీయ కళా సిద్ధాంతానికి మౌలిక వ్యత్యాసం వుందంటారు విమర్శకులు. అరిస్టాటిల్‌లాంటి వాళ్ళ నాటకం చూసే ప్రేక్షకులలో క్షాళన జరుగుతుందని చెప్పారు. అది ప్రేక్షకుల అనుభూతికి సంబంధించినది. వ్యక్తి లోపలి కల్మషాన్ని తొలగించి ఆ వ్యక్తిని విముక్తం చేస్తుంది అని భావించారు. ఎ.కె.రామానుజన్‌ లాంటివాళ్ళు జానపద సాహిత్యంతో తమకున్న అపార అనుభవంలోంచి మౌఖిక కథా సంప్రదాయంలో, కథ చెప్పేవాళ్ళు. అది స్త్రీ అయినా, పురుషుడయినా తమకోసం, తమ రక్షణకోసం, తాము ఇబ్బందుల్లో, ప్రమాదాల్లో పడకుండా వుండటంకోసం కథ చెప్పాలి అనే భావన ప్రాచీన మౌఖిక సాహిత్యంలో వున్నట్లుగా గుర్తించారు. జనంకోసం కాదు, కథలు తెలిసిన వాళ్ళు తమకోసమే సందర్భాన్ని చూసుకుని, కల్పించుకుని కథలు చెప్పాలి, తప్ప దాచుకోకూడదు. అలా చేస్తే కథలు ఆ వ్యక్తిమీద ప్రతీకారం తీర్చుకుంటాయి. ఈ విషయాన్ని ఎ.కె. రామానుజన్‌ ేసకరించిన కథ A Story and a Song తెలియచేస్తుంది. ఆ కథ అనువాదం ఇది.


ఓ కథ, ఒక పాట

ఒకామెకు ఒక కథ తెలుసు. ఆమె దగ్గర ఒక పాట కూడా వుంది. ఆమె వాటిని తనలోనే దాచుకుంది. ఆ కథని ఎవ్వరికీ చెప్పలేదు. ఆ పాటను ఎవ్వరికీ వినిపిం చలేదు. వాటిని తనలోనే బంధించేసింది. ఆమె లోపల కథ, పాట ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. ఎట్లాగయినా బయటపడి పారిపోవాలనుకుంటున్నాయి. ఒక రోజు ఆమె నోరు తెరచి నిద్రపోతున్నప్పుడు కథ పారిపోయి చెప్పుల జతగా మారి ఆమె ఇంటి వాకిటి దగ్గర కూర్చుంది. పాట కూడా బయటపడి మగవాడి చొక్కాలాగా మారి ఇంట్లో కొయ్య మేకుకు వేలాడుతూ వుంది.

ఇంటికి వచ్చిన ఆమె భర్త చెప్పులు, చొక్కా చూసి: 

‘‘ఎవరొచ్చారు?’’ అన్నాడు.

‘‘ఎవరూ రాలేదు’’, అంది ఆమె.

‘‘అయితే ఈ చొక్కా, చెప్పులు ఎవరివి?’’ అని అడిగాడు భర్త.

‘‘నాకు తెలియదు’’, సమాధానం చెప్పింది భార్య.

ఆమె సమాధానం భర్తకు అసంతృప్తి కలిగించింది. ఆమె మీద అనుమానం కలిగింది. ఇద్దరి మధ్య సంభాషణ చిరాకుగా మారింది. చిరాకు కాస్త గొడవగా మారింది. భర్తకు విపరీతంగా కోపమొచ్చింది. భర్త దుప్పటొకటి తీసుకుని దగ్గరలో వున్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర కెళ్ళాడు పడుకోవటానికి.


ఏమి జరిగిందో భార్యకు అర్థంకావటంలేదు. ఒంటరిగా పడుకుని ‘‘ఈ చొక్కా, చెప్పులు ఎవ్వరివి?’’ అనేదాన్ని గురించి అనేకసార్లు ఆలోచించింది. అంతా గందరగోళంగా వుంది. చివరకు దీపం ఆర్పి నిద్రలోకి జారుకుంది.


రోజూ ఊళ్ళో దీపాలు ఆర్పిన తరువాత ఆ దీపపు మంటలన్నీ ఆంజనేయ స్వామి గుళ్ళో  చేరి రాత్రంతా ఊళ్ళో పుకార్ల గురించి గుసగుసలాడుకుంటూ రాత్రంతా గడుపుతాయి. ఎప్పటిలాగా ఆరోజు కూడా ఆ రాత్రి దీపాలు ఆర్పిన తరువాత మంటలన్నీ గుడిలో సమావేశ మయ్యాయి, ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి ఆలస్యంగా వచ్చింది. 

‘‘ఎందుకివ్వాళ ఇంత ఆలస్యమయింది’’ అడిగాయి మిగతా మంటలు. 

‘‘మాయింట్లో మొగుడు పెళ్ళాలు ఇప్పటిదాకా పోట్లాడుకున్నారు’’ చెప్పిందా మంట. 

‘‘ఎందుకు?’’

‘‘మొగుడు ఇంట్లో లేనప్పుడు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పులజత వరండాలోకి వచ్చాయి. చొక్కావొకటి చెక్క కొయ్యకు వేలాడుతూవుంది. ఆవెవరివని భర్త అడిగాడు. పెళ్ళాం తనకు తెలియదంది. దాన్ని గురించి ఇద్దరూ పోట్లాడుకున్నారు.’’ ‘‘ఆ చొక్కా, చెప్పులు ఎక్కడనుంచి వచ్చాయి’’ ‘‘ఆ ఇంటావిడకి ఒక కథ తెలుసు, అలాగే ఒక పాటకూడా. ఆమె ఆ కథ ఎవ్వరికీ చెప్పలేదు.  ఆ పాట ఎవ్వరి దగ్గర పాటలేదు. ఆమె లోపలి కథ, పాట ఊపిరాడక బయటపడి చొక్కా, చెప్పులుగా మారాయి. ఆ విధంగా అవి ఆమె మీద కక్ష తీర్చుకున్నాయి. అయితే, ఆ విషయం ఆమెకు తెలియదు’’.


అక్కడే దుప్పటి కప్పుకుని పడు కున్న భర్త దీపం చెప్పిన వివరణ విన్నాడు. అతని అనుమానం నివృత్త యింది. ఇంటికెళ్ళాడు. అప్పటికే తెల్ల వారింది. కథ, పాట గురించి భార్య నడిగాడు. వాటిని మర్చిపోయిన ఆమె ‘‘ఏం కథ, ఏం పాట’’ అనింది.


పైకథతోపాటు ఎ.కె.రామానుజన్‌ ఈ విషయాన్ని‘Folk Tales from India’లో Tell it to the Walls అనే కథలో కూడా చూడవచ్చు. ఈ కథలో భర్త చనిపోయిన ఒకామెను తన కొడుకులు ఇద్దరూ కోడళ్ళు రాచిరంపాన పెడుతుంటారు. తన బాధను ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. ఫలితంగా ఆమె బాధ మరింతగా పెరగటమే కాకుండా ఆమె విపరీతంగా లావవుతుంది. బరువు పెరిగి భరించలేకపోతుంది. ఆ స్థితిలో ఒక రోజు తన ఇంటికి దూరంగా వున్న ఒక పాడుపెట్టిన ఇంట్లోకెళ్ళి ఆ ఇంటి గోడలకు తన బాధలు ఒక్కొక్కటి ఒక కథగా చెపుతుంది. ఆమె ఒక కథ చెప్పగానే ఒక గోడపడిపోతుంది. వెంటనే ఆమె బాధ కొంత తగ్గుతుంది. చివరకు ఆమె చెప్పిన కథలవల్ల ఆ ఇంటికున్న గోడలన్నీ పడిపోతాయి. తను బరువు తగ్గి ఇంటికెళుతుంది. ఈ కథల ద్వారా కథలు ప్రతీకారం తీర్చుకుంటాయనే విషయాన్ని ప్రతీకాత్మ కంగా చెపుతాడు ఎ.కె.రామానుజన్‌. ఇలాంటి కథలు సామాజిక జీవితంలో కథకున్న కీలక స్థానాన్ని నొక్కి చెపుతాయి. 

బి. తిరుపతిరావు

Updated Date - 2020-07-27T06:20:00+05:30 IST