దళిత సర్పంచ్‌పై దాడి జరిగితే పట్టించుకోరా?

ABN , First Publish Date - 2021-01-18T05:29:03+05:30 IST

మండలంలోని అంత్వార్‌ దళిత సర్పంచుపై దాడి జరిగి పది రోజులు కావస్తున్నా పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడం తగదని కేవీపీఎస్‌, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు.

దళిత సర్పంచ్‌పై దాడి జరిగితే పట్టించుకోరా?
ఖేడ్‌ మండలం అంత్వార్‌లో సర్పంచ్‌ను పరామర్శిస్తున్న కేవీపీఎస్‌, ప్రజా సంఘాల నాయకులు

 కేవీపీఎస్‌, ప్రజా సంఘాల నాయకులు 


నారాయణఖేడ్‌, జనవరి 17: మండలంలోని అంత్వార్‌ దళిత సర్పంచుపై దాడి జరిగి పది రోజులు కావస్తున్నా పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడం తగదని కేవీపీఎస్‌, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం అంత్వార్‌ సర్పంచ్‌ పుట్టి లింగమ్మ, ఆమె కుమారుడు సల్మాన్‌ను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం, జిల్లా ఉపాధ్యక్షులు కొటారి నర్సింహులు మాట్లాడుతూ.. అంత్వార్‌ సర్పంచ్‌ పుట్టి లింగమ్మను అదే గ్రామానికి చెందిన భూస్వాములు బక్కప్ప, బసప్ప, బస్వరాజ్‌, సాయిలు, శ్రీదేవి ఈ నెల 5న అకారణంగా దాడి చేశారని ఆరోపించారు. అంత్వార్‌కు మంజూరైన -ఈ సిటిజన్‌ సెంటర్‌ను ప్రభుత్వం కేటాయించిన, ప్రభుత్వ భూమిలో నిర్మిస్తుంటే వారు అడ్డుకోవడమే కాకుండా సర్పంచుతో పాటు ఆమె కుమారుడిని దూషించి దాడి చేశారన్నారు. దాడి జరిగి పది రోజులు గడిచినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్పంచుపై, ఆమె కుమారుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారివెంట ఆయా సంఘాల నాయకులు కాన్షీరాం, చిరంజీవి, ప్రశాంత్‌, గణపతి, నర్సింహులు, రాజ్‌కుమార్‌ ఉన్నారు. 


Updated Date - 2021-01-18T05:29:03+05:30 IST