Abn logo
Sep 24 2021 @ 00:53AM

వెట్టిచాకిరి చేయించుకొని కడుపులు కొడతారా..!


- తొలగించిన అర్బన హెల్త్‌ సెంటర్ల సిబ్బంది ఆగ్రహం

- డీఎంహెచఓ కార్యాలయం గేట్‌ ఎదుట బైటాయింపు

అనంతపురం వైద్యం, సెప్టెంబరు23: ఏళ్లుగా మాతో వె ట్టిచాకిరి చేయించుకున్నారు... ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి మా కడుపులు కొడుతారా... అంటూ తొలగించిన అర్బన హెల్త్‌ సెంటర్ల సిబ్బంది మండిపడ్డారు. దాదాపు 20ఏళ్ల నుంచి పనిచేస్తున్న సిబ్బందిని ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో వారు గురువారం తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా వైద్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ వైద్యుల సమీక్షకు వస్తున్నారని తెలిసి, డీఎంహెచఓ కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైటాయించారు. నినాదాలు చేస్తూ కూర్చున్నారు. ముందుగా వచ్చిన జేసీ సిరి వారితో చర్చించారు. డీఎంహెచఓ ను నిరసన కారుల వద్దకు పిలిపించారు. ఆ సమయంలో తొలగించిన వైద్య సిబ్బంది మాట్లా డుతూ... ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మాకు కడుపులు కొడతారా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జేసీ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ నిరసనలో తొలగించిన నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.