శనివారం నాన్‌వెజ్‌ తినొచ్చా?

ABN , First Publish Date - 2020-09-13T16:05:08+05:30 IST

ఓ రోజు రోమ్‌లో కలిసే అవకాశం వచ్చింది. కలిసి డ్రింక్‌ తీసుకుందాం అన్నాడు సీతారాం ఏచూరి.

శనివారం నాన్‌వెజ్‌ తినొచ్చా?

ఓ రోజు రోమ్‌లో కలిసే అవకాశం వచ్చింది. కలిసి డ్రింక్‌ తీసుకుందాం అన్నాడు సీతారాం ఏచూరి. సరేనని ఆర్డరివ్వబోతూండగా ఆవేళ శనివారమని సడన్‌గా గుర్తుకొచ్చింది. ‘ఒరేయ్‌, తాగనురా’ అన్నాను. వాడు చాలా రుత్సాహపడిపోయాడు. ‘ఇవాళ ఇండియాలో శనివారమా, యిక్కడ శనివారమా, ఎక్కడ కాదో దాన్ని లెక్కలోకి తీసుకుందాం, మామా’ అన్నాడు. రెండు చోట్లా శనివారమేరా అన్నాను. ‘మనవాళ్లు ప్రతీదానికీ శాపవిముక్తో, ప్రాయశ్చిత్తమో ఏదో ఒకటి పెడతారుగా, ఆ మార్గమేదో చూడు తప్ప మూడ్‌ పాడుచేయకు’ అన్నాడు. 


వీగన్‌ (తెలుగులో ఏమిటో!?) ఉద్యమం పడమట ప్రారంభమై 75 ఏళ్లయినా మన దేశంలో గత 20 ఏళ్లుగా దాని గురించి అవగాహన పెరిగింది. విరాట్‌ కోహ్లీ, వీనస్‌ విలియమ్స్‌ వంటి సెలబ్రిటీలు తాము వీగన్‌లమని ప్రకటించుకోవడం వలన చాలామందికి ఆసక్తి కలిగింది. ప్రపంచంలో శాకాహారులు అత్యధికంగా వున్న దేశం మనదే. మాంసాహారం కంటే శాకాహారం ఉన్నతమైనదీ, పవిత్రమైనదీ అనే భావమూ మనలో వుంది. పుణ్యదినాల్లో, తీర్థస్థలాలలో, మొక్కులతో దేవుణ్ని సంతృప్తి పరచాలనుకున్నపుడు మాంసాహారానికి దూరంగా వుండి శుచిగా వున్నామని భావిస్తుంటాం. అందువలన వీగన్‌ సంగతి వినగానే ‘కొత్తేముందీ? మన శాకాహారానికే పాశ్చాత్యులు ఆ పేరు పెట్టారు’ అనేసుకుంటాం. నిజానికి శాకాహారాల్లోనే తేడాలున్నాయి. కొంతమంది కోడిని తినకపోయినా కోడిగ్రుడ్డు తింటారు. దాన్ని ఆమ్లెట్‌ వంటి రూపాల్లో తినకపోయినా కేక్‌లో వేస్తే తింటారు మరి కొందరు. ఇంకొందరు అదీ తినరు కానీ నీరుల్లి, వెల్లుల్లి తింటారు. జైనులకైతే ఉల్లిపాయలతో బాటు భూమి కింద పండే దుంపలన్నీ నిషిద్ధం. కానీ పాలూ, పెరుగూ తీసుకుంటారు. వీగన్‌లయితే జంతు సంబంధమైనవేవీ, అంటే పాలుపెరుగుతో సహా, తీసుకోరు. తిండి విషయంలో కానీ, జంతువుల విషయంలో కానీ, అనేక రకాలుగా వారు జాగ్రత్తలు పాటిస్తారు. అదీ తేడా!


మనం శాకాహారాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటాం కానీ జంతువుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వుంటాం. వాటి చర్మాలతో తయారు చేసిన చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, కంబళ్లు, స్వెటర్లు వాడతాం. వాటిని ‘జూ’లలో పెట్టి వినోదంగా చూస్తాం. సర్కస్‌లలో వాటి చేత ఆటలాడిస్తాం. దంతాల కోసం ఏనుగుల్ని, గోళ్ల కోసం, చర్మం కోసం పులుల్ని వేటాడుతుంటే పెద్దగా పట్టించుకోం. కొన్నిరకాల వైద్యాల కోసం రకరకాల జంతువులను వేటాడి, ఎగుమతి చేస్తారని తెలిసినా విని వూరుకుంటాం. ఆహారం కోసం జంతువులను, పక్షులను చంపడం వేరు, వాణిజ్యావసరాల కోసం క్రూరంగా చంపడం వేరు. ఆహారం కోసమైతే ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆరు వేల కోట్ల జంతువులను, లక్ష కోట్ల జలజీవాలను తింటారట. ఇదంతా ఆగిపోవాలని, మనలాగే స్వేచ్ఛగా బతికే హక్కు సమస్త ప్రాణులకు ఉండాలని వీగన్ల నినాదం.


అయితే వీగన్‌ ఆహారం కారణంగా కొలెస్ట్రాల్‌, స్థూలకాయం అదుపులో ఉంటాయనే లాభమున్నా శరీరానికి దక్కవలసిన స్థాయిలో ప్రొటీన్లు, కాల్షియం, అయోడిన్‌, కొన్ని విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ దక్కవట. అందువలన అవి వుండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలట. ఏది ఏమైనా వీగన్‌ ఆహారానికి ఒక క్రేజ్‌ వచ్చింది. రోజూ కాకపోయినా, ఎప్పుడైనా వెరయిటీ కోసం వీగన్‌ హోటల్‌కు వెళ్లడం ఫ్యాషనైంది. ఆ మధ్య మా బావమరిది తన మారేజ్‌ యానివర్శరీకి వీగన్‌ హోటల్‌లోనే విందు ఏర్పాటు చేశాడు. పదార్థాలు రుచిగా వున్నాయి కానీ రోజూ వాటి మీదే బతకాలంటే కష్టమే.


మా తల్లిదండ్రులు శాకాహారులే అయినా నేను నాన్‌వెజ్‌ కూడా తీసుకుంటాను. లోకులంతా శాకాహారులే అయి వుండాలనే చాదస్తం నాకు లేదు. ఎయిర్‌ ఇండియా వాళ్లు ‘ఇకపై మా ఫ్లయిట్లలో శాకాహారమే పెడతాం’ అన్నపుడు నొచ్చుకున్నాను కూడా. మనకు నచ్చినది ఎదుటివాళ్లపై రుద్దడం తప్పు. కస్టమర్‌ దేవుడితో సమానం అన్నపుడు ఎంచుకునే అవకాశం ఆ దేవుడికి యివ్వాలి కదా. ‘ఎరుపు రంగు పంచె కట్టుకుని మాత్రమే నా ఎదుట ప్రత్యక్షం కా’ అని దేవుణ్ని నిర్బంధిస్తే ఎలా? పైగా అది బిజినెస్‌ను దెబ్బతీస్తుంది కూడా. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఏ ఎయిర్‌లైను ఎంచుకోవాలి? అని ఆలోచించినప్పుడు యితర సౌకర్యాలతో బాటు ఫలానా దానిలో మీల్స్‌, డ్రింక్‌ బాగున్నాయని తెలిస్తే దానివైపు మొగ్గుతాం. పైగా అందరూ శాకాహారులే అయితే వారికి సరిపడా మొక్కలున్నాయా? ఓ పక్క చెట్లు, మొక్కలు కొట్టేసి కాంక్రీటు అరణ్యాలు తయారుచేస్తున్నాం. పొలాలన్నిటినీ రియల్‌ ఎస్టేటు వెంచర్లుగా మార్చేస్తున్నాం. మరో పక్క కూరగాయలు మాత్రమే తింటాం అంటే అవి ఎక్కణ్నుంచి ఊడిపడతాయి?


నాకు నాన్‌వెజ్‌ విషయంలో పట్టింపు లేకపోయినా డ్రింక్‌ విషయంలో నియమం పెట్టుకున్నాను - కొన్నాళ్లపాటు శనివారం నాడు డ్రింక్‌ తీసుకోనని మొక్కుకున్నాను. సీపీఎం పార్టీ జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరి మా మేనల్లుడు. మా యింట్లోనే పెరిగాడు. నాకు చాలా ఆత్మీయుడు. వాడు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత, నేను దిల్లీ వెళ్లినప్పుడు ఇద్దరం బిజీగా వుండేవాళ్లం. కలవడమే గగనమై పోయింది. చివరకు ఓ రోజు రోమ్‌లో కలిసే అవకాశం వచ్చింది. కలిసి డ్రింక్‌ తీసుకుందాం అన్నాడు. సరేనని ఆర్డరివ్వబోతూండగా ఆవేళ శనివారమని సడన్‌గా గుర్తుకొచ్చింది. ‘ఒరేయ్‌, తాగనురా’ అన్నాను. వాడు చాలా రుత్సాహపడిపోయాడు. ‘ఇవాళ ఇండియాలో శనివారమా, యిక్కడ శనివారమా, ఎక్కడ కాదో దాన్ని లెక్కలోకి తీసుకుందాం, మామా’ అన్నాడు. రెండు చోట్లా శనివారమేరా అన్నాను. ‘మనవాళ్లు ప్రతీదానికీ శాపవిముక్తో, ప్రాయశ్చిత్తమో ఏదో ఒకటి పెడతారుగా, ఆ మార్గమేదో చూడు తప్ప మూడ్‌ పాడుచేయకు.’ అన్నాడు. ‘సరే, పాపపరిహారార్థం యికపై శనివారం రాత్రి భోజనం మానేస్తాను’ అని సంకల్పం చెప్పుకుని వాడి ముచ్చట తీర్చాను. అది యిప్పటికీ పాటిస్తున్నాను. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని మనవాళ్లు ఊరికే అనలేదు. 


డా. మోహన్‌ కందా

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి

Updated Date - 2020-09-13T16:05:08+05:30 IST