విశ్వాసం కలిగిస్తారా?

ABN , First Publish Date - 2020-09-30T07:21:31+05:30 IST

సమాజంలో అధికుల దౌర్జన్యం నుంచి బలహీనులను రక్షించేది ఏమిటి? ఆ సమాజం నమ్మే నైతిక విలువలా, చట్టమా, రక్షక వ్యవస్థా? బాధితులను రక్షించవలసిన...

విశ్వాసం కలిగిస్తారా?

సమాజంలో అధికుల దౌర్జన్యం నుంచి బలహీనులను రక్షించేది ఏమిటి? ఆ సమాజం నమ్మే నైతిక విలువలా, చట్టమా, రక్షక వ్యవస్థా? బాధితులను రక్షించవలసిన కంచెలే నేరస్థులను కాపాడుతుంటే, ఎవరికి మొరపెట్టుకోవాలి? ఎంతో సహజంగా, సాధారణంగా జరిగిపోవలసిన న్యాయరక్షణ కోసం రోడ్డున పడి అడగవలసి రావడమేమిటి? ఉద్యమాలు చేయవలసి రావడమేమిటి? 


హేమంత్ తండ్రికి ఇంకా ప్రాణభయం పోలేదు. చెట్టంత కొడుకు అన్యాయంగా బలి అయ్యాడని దుఃఖించాలా, సొంత ప్రాణం కోసం నిత్యభయంతో బతకాలా? శ్మశానానికి వెళుతుంటే కూడా దుండగులు అతడిని వెంటాడుతూనే ఉన్నారట. పోలీసుల మీద అతనికి నమ్మకం కుదరడం లేదు. తన కూతురును అపహరించారని లక్ష్మారెడ్డి కుటుంబం ఫిర్యాదు చేసినప్పుడు, పోలీసులు తనని ఎట్లా చూశారో హేమంత్ తండ్రికి ఇంకా గుర్తుంది. ఎంత ధైర్యం లేకపోతే, హంతకులు సకుటుంబ సపరివారంగా ఇంతటి ఘోరాన్ని బాహాటంగా చేస్తారు? ఆ ధైర్యం డబ్బు నుంచి వచ్చి ఉండాలి, సామాజిక హోదా నుంచి వచ్చి ఉండాలి. డబ్బుతో పోలీసులను, న్యాయాన్ని నిర్వహించగలమనే విశ్వాసంతో వచ్చి ఉండాలి. 


డబ్బంటే ప్రలోభం, పలుకుబడి అంటే భయం.- వీటి వల్ల మాత్రమే పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేరని అనుకుంటే అది పాక్షిక సత్యం మాత్రమే. సమాజంలోని ఏ విలువల వల్ల మహిళలపై అత్యాచారాలు, కులాంతర వివాహాలపై వ్యతిరేకత, అట్టడుగు కులాలపై హత్యాకాండ జరుగుతున్నాయో, ఆ విలువలు పోలీసులలో విడిగానూ, ఒక వ్యవస్థగా కూడా జీర్ణించుకుపోయి ఉంటాయి. పురుషాధిక్యత; అగ్రకుల అహంకారం; బలహీనులు, దరిద్రులపై చిన్నచూపు- ఇటువంటివి సమాజంలోని అన్ని రంగాలలో ఉన్నట్టే, పోలీసులలో కూడా ఉంటాయి. డబ్బు కోసమే ఇంకో కులం అమ్మాయిని హేమంత్ ప్రేమించి ఉంటాడని పోలీసు కూడా నమ్మడానికే ఉత్సాహపడతాడు. ఎంత డబ్బు ఇచ్చినా ప్రేమించిన అమ్మాయిని వదులు కోనని గట్టిగా నిలబడిన అతని వ్యక్తిత్వం పోలీసుకు నమ్మబుద్ధి కాదు. డబ్బు కోసం అభిమతాన్ని మార్చుకోకపోవడం అంటే ఏమిటో ఆ పోలీసుకు అర్థం కాకపోవచ్చు కూడా. వీటన్నిటి కారణంగా, పెళ్లి దగ్గర నుంచి వేధింపుల దాకా మొత్తం సన్నివేశంలో అనాలోచితంగానే వాళ్లు బలవంతుడి పక్షాన చేరిపోతారు. పోలీసులందరూ అట్లా ఉన్నారని కాదు. అట్లా ఉండడానికి ప్రేరేపించే అంశాలు సమాజంలో ఉన్నాయి. సామాజికంగా మంచిచెడ్డలను ఆలోచించి వ్యవహరించాలన్న శిక్షణ, బోధన పోలీసులకు ఇచ్చి ఉంటే, దాని వల్ల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. లేకపోతే, తరచు మనం బాధితుల ముఖాల్లో అపనమ్మకాన్నే చూస్తాము. 


ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడానికి మరో తాజా ఉదాహరణ ఉత్తరాదిలో చూడవచ్చు. ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరప్రదేశ్‌ లోని హత్రస్ అనే గ్రామంలో ఒక దళిత అమ్మాయిని నలుగురు అగ్రకుల యువకులు అత్యంత దారుణంగా హింసించారు, అత్యాచారం చేశారు, ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలను చూస్తే 2012 నాటి నిర్భయ గుర్తుకు వస్తుంది. పదిహేను రోజుల కిందట, సెప్టెంబర్ 14 నాడు తల్లి, సోదరుడితో కలిసి గడ్డి కోస్తూ ఉండగా, దుపట్టా పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు దుండగులు. తరువాత వెదకగా వెదకగా ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో పొలాల్లో కనిపించింది, ఒళ్లంతా చీరుకుపోయి, నాలిక తెగిపోయి, మెడ ఎముకలు విరిగిపోయి, రక్తస్రావం జరుగుతూ.. ఆ నలుగురూ ఎవరో తెలుసు. అమ్మాయి కుటుంబం పోలీసుల దగ్గరికి వెళ్లింది. వారి స్పందన సహజంగానే ఉదాసీనంగా ఉండింది. చివరకు అరెస్టయితే చేశారు కానీ, ఆ స్పందనలో చిత్తశుద్ధి కనిపించలేదు. ఆ అమ్మాయి, మంగళవారం పొద్దున ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో మరణించింది. మృతురాలి తల్లి, సోదరుడు ఒకవైపు దుఃఖంతో ఏడవాలి, మరొకవైపు న్యాయం కోసం పోరాడాలి. న్యాయం కావాలి, కానీ, దొరుకుతుందన్న నమ్మకం లేదు. నిర్భయ తరువాత ఎంతో ఉద్యమం జరిగింది. కొత్త చట్టం వచ్చింది. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా తీసుకుంటున్నట్టు కనిపించింది. నిర్భయ హంతకులకు ఉరిశిక్ష కూడా అమలు జరిగింది. అంతే కాదు, ఆ రాష్ట్రంలో నేరస్థుల భరతం పడతానంటూ ఎన్‌కౌంటర్ల పరంపరను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అయినా ఆ నలుగురికి ఎందుకు భయం లేకపోయింది? తమకు ఏమీ కాదన్న ధీమా వారికి ఎందుకు ఉండింది? అందరూ చూస్తుండగానే ఆడపిల్లను అపహరించి అత్యాచారం చేయగలగడానికి, ఈ వ్యవస్థ తమదేనన్న నమ్మకం తప్ప మరొక కారణం ఉన్నదా? ఆ రాష్ట్రంలో చంపుతున్నది నిజంగా నేరస్థులనేనా? అయితే, మరి నేరస్వభావం కలిగినవారిలో భయం ఎందుకు లేదు? 


ఉత్తరాదిన భూస్వామ్యం ఎక్కువ కనిపిస్తూ ఉండవచ్చు. దక్షిణాదిన ఆధునికత కాస్త ఎక్కువ మోతాదులో ఉండవచ్చు. కానీ, దేశంలో ఆడపిల్లల విషయంలో, దళితులు కిందికులాల విషయంలో, ఏ రంగంలో అయినా బలహీనుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందా అన్న విశ్వాసం ప్రజలలో లేదు. విశ్వాసం కలగడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రయత్నం ఏదీ చేయదు. ఒకసారి ఒక చట్టం చేయడం, ఏదో ఒక కేసులో ఉరిశిక్ష, మరో కేసులో ఎన్‌కౌంటర్- ఇవి జరిగినంత మాత్రాన పరిస్థితి చక్కపడుతుందా? కులాంతర వివాహం చేసుకున్నందుకు, అందులో బలహీనపక్షానికి చెందిన యువకుడిని చంపేస్తున్న ఉదంతాలు ఎన్నిజరిగినా ప్రభుత్వాలు, ఆ సంఘటనలను శాంతిభద్రతల అంశంగా చూడడం తప్ప, నివారణ చర్యలు తీసుకుంటున్నదా? ప్రభుత్వాలను నడిపిస్తున్న రాజకీయపక్షాలకు ఒక సామాజిక దృక్పథం ఉన్నదా? కులం, కులాంతర వివాహాలు, కులవివక్షను అన్ని రంగాలలో తొలగించడం- వంటి అంశాలపై క్రియాశీలంగా జోక్యం చేసుకోవాలన్న స్పృహ, సోయి వారికి ఉన్నదా? శిక్షలు, పోటీచంపుళ్లు లాభం లేదని తెలిసిన తరవాత, మనుషులను సంస్కరించడం, సంఘ భయం కల్పించడం వంటి ప్రయత్నాలను ప్రారంభించాలి. హంతకులు, బాధితుల మధ్య కూడా కులాలను లెక్కవేసుకుని వైఖరులు తీసుకునే నేతల నుంచి, ఇటువంటి సాంఘిక సంస్కరణలను ఆశించగలమా?

Updated Date - 2020-09-30T07:21:31+05:30 IST