Oct 27 2021 @ 17:33PM

Aryan Khan తరపు లాయర్ Mukul Rohatgi.. కోర్టులో వాదించడానికి ఎంత ఫీజు తీసుకుంటారో తెలిస్తే..

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అతడి బెయిల్ పిటిషన్‌ను ఎన్సీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. న్యాయవాదులు సరిగ్గా వాదించకపోవడంతోనే తన కొడుకుకు బెయిల్ రాలేదని కింగ్ ఖాన్ భావిస్తున్నారు. సతీశ్ మనీశ్ షిండే, అమిత్ దేశాయ్ ఆర్యన్‌కు బెయిల్ ను తీసుకురాలేకపోయారు.  దీంతో అటార్నీ జనరల్‌గా పనిచేసిన ముకుల్ రొహత్గీని తన న్యాయవాదిగా నియమించుకున్నారు. బాంబే హైకోర్టులో ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను ఆయనే వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఆరా తీయడం అందరూ ప్రారంభించారు. 


జస్టిస్ యోగేశ్ కుమార్ సభర్వాల్ సుప్రీంకోర్టుకు 36వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన హైకోర్టులో పనిచేస్తున్నప్పుడు రొహత్గీ తన ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ముకుల్ రొహత్గీ 1999లో అడిషినల్ సొలిసిటరల్ జనరల్‌గా నియమితులయ్యారు. గుజరాత్ అల్లర్ల కేసు ముకుల్ రొహత్గీకి పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అల్లర్లల్లో భాగమైన బెస్ట్ బేకరీ, జహీరా షేక్, యోగేష్ గౌడ కేసులను ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో  ఆయన వాదించారు. ఆయన తండ్రి కూడా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఒక సారి కోర్టుకు హాజరుకావడానికి ఆయన రూ.10లక్షల వంతున ఛార్జ్ చేస్తారట. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున బిహెచ్.లోయ కేసును సుప్రీంకోర్టులో వాదించడానికి రూ.1.21కోట్లను తన పారితోషికంగా ఆయన తీసుకున్నట్లు ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా వెల్లడైంది. 


కాగా, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆస్ట్రిచ్ పక్షి లాగా వ్యవహరిస్తుందని ఆర్యన్ కేసులో ఆయన హైకోర్టులో వాదించారు. ఆర్యన్ జీవించే హక్కును ఎన్సీబీ కాలరాస్తుందని ఆయన వాపోయారు. సెలెబ్రిటీ కొడుకు కావడంతోనే అతడిని ఈ కేసులో ఇరిక్కించారన్నారు. ఆర్యన్ వద్ద మాదకద్రవ్యాలు ఏమీ దొరక్కపోయినప్పటికీ అనవసరంగా ఇరిక్కించారని అభిప్రాయపడ్డారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు.