కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నాక.. ఎందుకిలా జరుగుతోంది..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

ABN , First Publish Date - 2021-05-01T16:42:17+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఎందుకు సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి? అది కూడా రెండో డోస్ తీసుకున్నప్పుడు మరింత ఇబ్బందిగా ఎందుకు ఉంటుంది? అనే ప్రశ్నలకు నిపుణులను అడిగితే ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దామా..

కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నాక.. ఎందుకిలా జరుగుతోంది..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

ప్రపంచం మొత్తం విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అయితే ఈ టీకాలపై రకరకాల అనుమానాలతో వీటిని తీసుకోవడానికి కొందరు ప్రజలు సంకోచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి నీరసం, జ్వరం, దురదలు, నొప్పి.. వంటి సైడ్ ఎఫెక్ట్‌లు వస్తున్నాయనేది వారి వాదన. అయితే కరోనా మహమ్మారి చూపించే నరకం ముందు ఇది తక్కువే అని కొందరు అంటున్నారు. దీని గురించి అసలు ఈ రంగంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసా? కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఎందుకు సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి? అది కూడా రెండో డోస్ తీసుకున్నప్పుడు మరింత ఇబ్బందిగా ఎందుకు ఉంటుంది? అనే ప్రశ్నలకు నిపుణులను అడిగితే ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దామా..


కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు మనందరం లాక్‌డౌన్‌లు, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజర్ వంటి కొత్త కొత్త అలవాట్లు చాలా చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందులన్నీ భరించినా కూడా వైరస్ మాత్రం తన ఉధృతి తగ్గించుకోవడం లేదు. ప్రస్తుతం భారతదేశంలో కనిపిస్తున్న పరిస్థితులే దీనికి ఉదాహరణ. ఇక్కడ కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో శవాల దిబ్బలు, శ్మశానాల ముందు క్యూలు, ఆక్సిజన్ లేక ఇబ్బందులు, ఆస్పత్రుల్లో బెడ్ల కోసం గొడవలు చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే ఒకే ఒక పద్ధతి వ్యాక్సినేషన్. ఇతర దేశాలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి.


నిపుణులు మాత్రం ఇలాంటి లక్షణాలు సర్వసాధారణం అంటున్నారు. ఎటువంటి టీకా తీసుకున్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్తున్న వారు.. కరోనా విషయంలో ఇదేమీ ప్రత్యేకం కాదని స్పష్టం చేస్తున్నారు. ‘‘రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్‌లు మరింత తీవ్రంగా ఉండొచ్చు. కానీ దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అయితే ఇలా సైడ్ ఎఫెక్ట్‌లు రావడం అనేది మన శరీరం రక్షణను ఏర్పాటు చేసుకుంటుంద అనడానికి నిదర్శనాలు’’ అని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వర్గాలు చెప్తున్నాయి.


శరీరానికి వైరస్‌ విషయంలో ఎలా స్పందించాలో వ్యాక్సిన్ తొలి డోస్ నేర్పుతుందట. ఈ విషయంలో రోగనిరోధక వ్యవస్థ రియాక్ట్ అవడం వల్లే సైడ్ ఎఫెక్ట్‌లు కనిపిస్తాయని నిపుణులు వివరించారు. ఇక రెండో డోసు తీసుకునే సమయానికి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి ప్రారంభమైపోతుంది. ఇలాంటి సమయంలో మరోసారి పాథోజెన్ కనిపించడంతో శరీరంలోని కణాలు దాన్ని గుర్తించి చాలా బలంగా రియాక్ట్ అవుతాయి. దీంతో మనలో కనిపించే సైడ్ ఎఫెక్ట్‌ల తీవ్రత కూడా పెరుగుతుంది. ఇలా జరిగినప్పుడు తట్టుకోలేనంతగా ఇబ్బంది ఉంటే వైద్యుడిని సంప్రదించి బాధ, జ్వరం, ఒళ్లునొప్పుల వంటి సమస్యలకు మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుందని నిపుణులు వెల్లడించారు.. అలాగే ఆల్కహాల్ జోలికి పోకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిదని సలహా కూడా ఇస్తున్నారు.


కరోనా మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందంటూ కొందరు నిపుణులు హెచ్చరికలు చేస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ తప్పనిసరి. భారత్‌లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ప్రపంచంలో ఎక్కడైనా నెలకొనే ప్రమాదం ఉందని, కనుక ఏ దేశమూ కరోనా నిబంధనలు సడలించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది సందేహిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే, అదీ రెండో డోసు తీసుకున్నప్పుడు నొప్పి, జ్వరం, బాధ, నీరసం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని బెదురుతున్నారు.

Updated Date - 2021-05-01T16:42:17+05:30 IST