UAE వెళ్తున్నారా?.. అయితే అక్కడ ఆమోదం పొందిన కరోనా టీకాలేవో తెలుసా?

ABN , First Publish Date - 2021-09-29T13:56:22+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెళ్లేవారు తప్పకుండా ఆ దేశంలో ఆమోదం పొందిన కరోనా టీకాల గురించి పక్కాగా తెలుసుకుని వెళ్లడం చాలా మంచిది.

UAE వెళ్తున్నారా?.. అయితే అక్కడ ఆమోదం పొందిన కరోనా టీకాలేవో తెలుసా?

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెళ్లేవారు తప్పకుండా ఆ దేశంలో ఆమోదం పొందిన కరోనా టీకాల గురించి పక్కాగా తెలుసుకుని వెళ్లడం చాలా మంచిది. లేనిపక్షంలో అక్కడికెళ్లిన తర్వాత సమస్యల్లో పడతారు. యూఏఈ ఇప్పటివరకు మొత్తం తొమ్మిది కోవిడ్-19 వ్యాక్సిన్లను ఆమోదించింది. తాజాగా అబుధాబి పబ్లిక్ హెల్త్ సెంటర్(ఏడీపీహెచ్‌సీ), ఆ దేశ ఆరోగ్యశాఖ అక్కడ ఆమోదం పొందిన తొమ్మిది టీకాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోని వ్యాక్సిన్లు తీసుకున్న వారిని మాత్రమే దేశంలోకి ప్రవేశం ఉంటుందని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు.


ఇక యూఏఈ ఆమోదించిన 9 కరోనా టీకాల జాబితా ఇదే... 1. సినోఫార్మ్, 2. ఫైజర్-బయోఎన్‌టెక్, 3. హాయత్‌వ్యాక్స్, 4. స్పుత్నిక్ వీ, 5. ఆక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనెకా, 6. మోడెర్నా, 7. కోవిషీల్డ్, 8. జాన్సన్ అండ్ జాన్సన్, 9. సినోవాక్. ఇందులో సినోఫార్మ్ అనే చైనీస్ వ్యాక్సిన్ యూఏఈలో హాయత్‌వ్యాక్స్ పేరుతో ఉత్పత్తి అవుతోంది. అలాగే ఆక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనెకా టీకా భారత్‌లో కోవిషీల్డ్ పేరుతో తయారవుతున్న సంగతి తెలిసిందే. 


యూఏఈలో అందుబాటులో ఉన్న టీకాలు..

ఈ జాబితాలోని ఐదు టీకాలు యూఏఈలో పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. సినోఫార్మ్, ఫైజర్-బయోఎన్‌టెక్, స్పుత్నిక్ వీ, ఆక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనెకా, మోడెర్నా. ఇక సినోఫార్మ్ వ్యాక్సిన్ మూడేళ్లకు పైబడిన పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైజర్-బయోఎన్‌టెక్ 12ఏళ్ల కంటే ఎక్కువ వయసు గల పిల్లలకు అందుబాటులో ఉంది.


ఇక వచ్చేవారం ప్రారంభం కాబోతున్న Expo 2020 Dubai నేపథ్యంలో తాజాగా యూఏఈ అధికారులు కీలక సూచన చేశారు. ఎక్స్‌పోకు వెళ్లే సందర్శకులు(దేశ పౌరులు, నివాసితులు) తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనికోసం ముందస్తుగానే Al Hosn appలో వ్యాక్సిన్ స్టేటస్‌ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్‌లో అంతర్జాతీయ ప్రయాణికులు కింద పేర్కొన్న విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.   


* యూఏఈ బయల్దేరడానికి ముందు సందర్శకులు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్‌షిప్(ఐసీఏ)కు సంబంధించిన యాప్‌లోని ‘Register Arrivals’ సెక్షన్‌లో మొదట రిజిస్టర్ చేసుకోవాలి. 

* ‘Register Arrivals’ ఫారంను పూర్తి చేసిన తర్వాత స్వదేశంలో జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఆ సమయంలో సందర్శకులకు ఓ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అందులో Al Hosn app డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఓ లింక్ ఉంటుంది.  

* యూఏఈ చేరుకున్న తర్వాత విజిటర్లకు విమానాశ్రయంలో లేదా ఐసీఏ యాప్ ద్వారా ఏకీకృత గుర్తింపు నంబర్(యూఐడీ) వస్తుంది.   

* ఈ యూఐడీ, ఫోన్ నెంబర్‌తో Al Hosn app డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకోవాలి. చివరగా ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఇలా యాప్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేసి వ్యాక్సినేషన్ స్టేటస్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.    


Updated Date - 2021-09-29T13:56:22+05:30 IST