డబ్బు బదిలీ సేవలు 14 గంటలపాటు నిలిచిపోయేదెప్పుడో తెలుసా?

ABN , First Publish Date - 2021-04-16T01:02:09+05:30 IST

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్వహిస్తున్న రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్

డబ్బు బదిలీ సేవలు 14 గంటలపాటు నిలిచిపోయేదెప్పుడో తెలుసా?

న్యూఢిల్లీ : భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్వహిస్తున్న రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలు మరింత ఆధునికతను సంతరించుకోబోతున్నాయి. ఈ సేవలను సాంకేతికంగా మరింత మెరుగుపరిచాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నెల 17 రాత్రి 12 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ మర్నాడు ఆదివారం అంటే ఏప్రిల్ 18 మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ టెక్నికల్ అప్‌గ్రెడేషన్ జరుగుతుంది. ఈ 14 గంటల సమయంపాటు ఆర్‌టీజీఎస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో నిధులను ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేయడం సాధ్యం కాదు. ఎన్ఈఎఫ్‌టీ సిస్టమ్‌లో లావాదేవీలు నిర్వహించవచ్చు. ఈ వివరాలను ఆర్బీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 


ఆర్బీఐ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఆర్బీఐ అందిస్తున్న #ఆర్‌టీజీఎస్‌ను 2021 ఏప్రిల్ 17న బిజినెస్ ముగిసిన తర్వాత టెక్నికల్ అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించినందువల్ల, #ఆర్‌టీజీఎస్‌ సర్వీస్ 2021 ఏప్రిల్ 18 ఆదివారం 00:00 గంటల నుంచి 14:00 గంటల వరకు అందుబాటులో ఉండదు. #మనీట్రాన్స్‌ఫర్స్ కోసం ఈ సమయంలో యథావిధిగానే #ఎన్ఈఎఫ్‌టీ సిస్టమ్ పని చేస్తుంది’’ అని ప్రకటించింది. 


ఆర్‌టీజీఎస్ సేవలను వినియోగించుకునేవారు డబ్బును తక్షణమే ఒక ఖాతా నుంచి వేరొక ఖాతాకు బదిలీ చేయడానికి వీలవుతుంది. ఇబ్బందులు లేకుండా ప్రతి లావాదేవీని జరపవచ్చు. నిధుల బదిలీకి సురక్షితమైన, భద్రతగల సేవలు అన్ని వేళలా, నిరంతరం అందుబాటులో ఉంటాయి. 


Updated Date - 2021-04-16T01:02:09+05:30 IST