Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎర్రమట్టిని తరలిస్తుంటే అడ్డుకోరా..?

  1. తహసీల్దారును నిలదీసిన వైసీపీ జడ్పీటీసీ
  2. పోలీసులే సహకరిస్తున్నారన్న తహసీల్దారు
  3. మండల సమావేశంలో మాటల యుద్ధం


కోడుమూరు, డిసెంబరు 4: కోడుమూరులో కొండ మట్టి తరలింపుపై జడ్పీటీసీ, తహసీల్దార్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన కథనం చర్చకు వచ్చింది. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం ఇందుకు వేదికైంది. తహసీల్దార్‌ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ జడ్పీటీసీ రఘునాథ్‌రెడ్డి కొండపై ఉన్న ఎర్రమట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రెవెన్యూశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్‌ సమాధానం ఇచ్చారు. అయితే ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నా ఎందుకు అడ్డుకోవడం లేదని జడ్పీటీసీ ప్రశ్నించారు. దీంతో తహసీల్దారు ఆవేశానికి లోనయ్యారు. అడ్డుకునే హక్కు తమకు లేదని, పోలీసులే ఎర్రమట్టి తరలింపునకు సహకరిస్తుంటే ఎవరికి చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్న వేశారు. కొంతమంది స్వలాభం కోసం ఎర్రమట్టిని తీసుకెళ్లి వంకలకు అడ్డుగా వేస్తున్నారని, దీనివల్ల వర్షాకాలంలో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని జడ్పీటీసీ అన్నారు. కొండపై ఉన్న పట్టా భూముల నుంచి ఎర్రమట్టిని తరలించి పొలాన్ని చదును చేసుకుంటామని కొందరు రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి అనుమతి ఇవ్వలేదని అన్నారు. అదే కొండపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చారని, ఆ స్థలాల్లో ఎర్రమట్టిని తరలించుకుంటామని లబ్ధిదారులు అడిగితే అనుమతులు ఇస్తారా..? అని తహసీల్దార్‌ను జడ్పీటీసీ నిలదీశారు. పట్టపగలు ఎక్స్‌కవేటర్లతో కొండను తవ్వుతున్నారని, వందలాది ట్రిప్పులు అక్రమంగా తరలిపోతుంటే తమ దృష్టికి రావడం లేదని తహసీల్దారు చెప్పడం విడ్డూరంగా ఉందని జడ్పీటీసీ అన్నారు. తహసీల్దారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎర్రమట్టి అక్రమ తరలింపును అడ్డుకోవాలని, చారిత్రాత్మక కొండను కాపాడాలని అధికారులను జడ్పీటీసీ కోరారు. 

Advertisement
Advertisement