మీరు ప్రభుత్వం మనిషా?.. నిలదీసిన రాహుల్

ABN , First Publish Date - 2021-12-20T21:02:15+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనలపై సోమవారంనాడు మీడియాతో..

మీరు ప్రభుత్వం మనిషా?.. నిలదీసిన రాహుల్

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనలపై సోమవారంనాడు మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సందర్భంలో ఓ విలేఖరిని నిలదీశారు. ''మీరు ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నారా?'' అని ప్రశ్నించారు. ముందు తన ప్రశ్నకు సమాధానమివ్వాలని అన్నారు.


పార్లమెంటు సమావేశాల నుంచి 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసిన అంశంపై చర్చ జరపాలని, లఖింపూర్ ఘటనలో కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను తొలగించాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా, ఒక రిపోర్టర్ ప్రశ్న లేవనెత్తారు. విపక్ష నేతల గందరగోళం  కారణంగానే సభలో చర్చ చోటుచేసుకోవడం లేదని ప్రభుత్వం అంటోందని విలేఖరి చెప్పడంతో....''ఆ మాట ఎవరు చెప్పారు? మీరు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా?''అని రాహుల్ ఆయనను ఎదురు ప్రశ్నించారు. ఇదే మాట రాహుల్ ఐదుసార్లు రిపీట్ చేశారు. ముందు తన ప్రశ్నకు సమాధానమివ్వాలన్నారు. ఆ తర్వాత రాహుల్ తన వాదనను వినిపిస్తూ, సభను ఆర్డర్‌లో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ, విపక్షాలది కాదని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-20T21:02:15+05:30 IST