వైరల్‌గా మారిన ఓ వైద్యుడి లేఖ..అలసిపోయానంటూ..

ABN , First Publish Date - 2021-01-06T22:56:09+05:30 IST

కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న నేపథ్యంలో, కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో...

వైరల్‌గా మారిన ఓ వైద్యుడి లేఖ..అలసిపోయానంటూ..

చెన్నై: తమిళనాడు థియేటర్లలో వంద శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పళని సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న నేపథ్యంలో, కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ఈ నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదనే వాదన కొందరి నుంచి వినిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఓ వైద్యుడు సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందన ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేసింది. ఆ వైద్యుడి పేరు అరవింద్ శ్రీనివాస్. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జేఐపీఎంఈఆర్) పుదుచ్చేరిలో రెసిడెంట్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న అరవింద్ శ్రీనివాస్ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీపై ఆవేదనతో కూడిన పోస్ట్ చేశాడు. తమిళనాడు ప్రభుత్వంతో పాటు హీరో విజయ్, శింబును ఉద్దేశిస్తూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం యథాతథంగా..


ఇదీ ఓ వైద్యుడి ఆవేదన. ఇదిలా ఉంటే.. తమిళ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది వంద శాతం ప్రేక్షకులను అనుమతించాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే.. సినీ పరిశ్రమ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా పూర్తి స్థాయిలో కట్టడి కాకుండానే థియేటర్లలోకి అందరినీ అనుమతిస్తే.. రెండున్నర గంటల పాటు మూసేసి ఉంచే అలాంటి చోట వైరస్ ప్రబలడానికి అవకాశమిచ్చినట్టవుతుందని చెబుతున్నారు. ఈ నిర్ణయం ఎంత మాత్రం సరైంది కాదని వాదిస్తున్నారు. సినీ పరిశ్రమ నష్టాల్లో ఉంటే ఆ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నయ మార్గాలపై దృష్టి పెట్టాలని, అంతేగానీ ఇలా నిర్మాతల వ్యాపారం కోసం అమాయకులను బలి చేయడం సరికాదని కొందరు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ‘మాస్టర్’ సినిమా విడుదల నేపథ్యంలో సీఎం పళనిస్వామిని విజయ్ కలిసిన రోజుల వ్యవధిలోనే థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం రావడం చర్చనీయాంశంగా మారింది. తమిళ నటుడు అరవింద స్వామి మాత్రం ‘100 శాతం కంటే 50 శాతమే మేలుగా చెప్పుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ఇది ఒకటి’ అని ట్వీట్ చేశాడు.


నేను అలసిపోయాను. మేమంతా అలసిపోయాం. నాలాంటి వేలమంది వైద్యులు అలసిపోయారు. హెల్త్ కేర్ వర్కర్లు అలసిపోయారు. పోలీసు అధికారులు అలసిపోయారు. పారిశుద్ధ్య కార్మికులు అలసిపోయారు. ఊహించని ఉపద్రవం వల్ల జరిగిన నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు కింది స్థాయి సిబ్బంది నుంచి అందరం చాలా శ్రమించాం. చూసేవాళ్లకు మేం పడిన కష్టం గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మా ముందు ఎలాంటి కెమెరాలు లేవు. మేం ఎలాంటి స్టంట్ సీక్వెన్స్‌లూ చేయలేదు. మేము హీరోలం కాదు. కానీ.. మేం ఊపిరి పీల్చుకోవడానికి కొంత సమయం కావాలి. ఈ ఉపద్రవం ఇంతటితో అయిపోలేదు.


కరోనాతో ఇప్పటికీ కొంతమంది ప్రజలు చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడమంటే ఆత్మహత్యా సదృశ్యమే, అంతేగాక సామూహిక జన హననమే. సినిమాలు వంద శాతం ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఏ ప్రజాప్రతినిధి గానీ, హీరోలుగా చెప్పుకునే ఏ ఒక్కరూ సిద్ధంగా ఉండరు. కొంచెం నిదానంగా ఆలోచించి, మా ప్రాణాలపై కూడా కాస్త శ్రద్ధ పెట్టి కనికరం చూపండి.


ఇట్లు

అలసిసొలసిన, ఓ నిస్సహాయ వైద్యుడు

Updated Date - 2021-01-06T22:56:09+05:30 IST