కరోనా పై విజయం సాధించాలంటే స్వీయ నిర్బంధమే కీలకం

ABN , First Publish Date - 2020-04-10T00:01:28+05:30 IST

కరోనా వైరస్‌ పై విజయం సాధించాలంటే స్వీయ నిర్బంధంలోనే ఉండాలని ప్రభుత్వ చెస్ట్‌ ఆస్పత్రి వైద్యనిపుణులు డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ అన్నారు.

కరోనా పై విజయం సాధించాలంటే స్వీయ నిర్బంధమే కీలకం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పై విజయం సాధించాలంటే స్వీయ నిర్బంధంలోనే ఉండాలని ప్రభుత్వ చెస్ట్‌ ఆస్పత్రి  వైద్యనిపుణులు డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ అన్నారు. గురువారం సమాచార పౌరసంబంధాల శాఖ ఆద్వర్యంలో కరోనా వైరస్‌ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ కట్టడికి వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది, మీడియా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని దీనికి ప్రజలందరూ సహకరించాలన్నారు. తొలుత కరోనా వైరస్‌ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి మాత్రమే వచ్చిందని, ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్నారు.  రాష్ట్రంలో యువత ఎవరూ కరోనా బారిన పడలేదని, కేవలం వృద్ధులు మాత్రమే మరణించారని తెలిపారు. ప్లాస్మా ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపామన్నారు. గాంధీ, సరోజిని, చెస్ట్‌ హాస్పిటల్స్‌లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్టు డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌తెలిపారు. 


ఈ సమయంలో వృద్దులు, చిన్నపిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కరోనా వైరస్‌ పై అనుమానం ఉంటే ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని నిర్భయంగా డాక్టర్లను సంప్రదించాలన్నారు. కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ భయాందోళనలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రహిత భారత్‌ను ప్రపంచానికి చూపవచ్చన్నారు. ముఖ్యంగా వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మవద్దన్నారు. చేతినికళ్లకు, ముక్కు, నోటికి దూరంగా ఉంచితేకరోనా సోకకుండా చూసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో పౌరసంబంధాల శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్యకాంబ్లే, జాయింట్‌ డైరెక్టర్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-10T00:01:28+05:30 IST